శనివారం 23 జనవరి 2021
Nizamabad - May 01, 2020 , 01:55:00

ఉపాధికి కొంత ఊరట

ఉపాధికి కొంత ఊరట

  • 16 రకాల పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు
  • పట్టాలెక్కనున్న నిలిచిన నిర్మాణ పనులు
  • యంత్రాంగానికి ఆదేశాలిచ్చిన కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో  ఎక్కడికక్కడే పరిశ్రమలు మూసివేయడంతో ఉపాధి లేక అనేక మంది రోడ్డున పడ్డారు. ఫలితంగా అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. గడిచిన 40 రోజులుగా లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతుండడంతో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఇప్పటికే గ్రామాల్లో ఉపాధి హామీ పనులతో కూలీలకు చేతి నిండా పని దొరుకుతున్నది. పరిస్థితి కాస్త కుదుట పడుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. కరోనా వ్యాప్తిని నిరోధిస్తూనే, సామాజిక దూరాన్ని పాటిస్తూనే కొన్ని పరిశ్రమలు, పనులకు అనుమతులు ఇస్తూ నిర్ణయించాయి. ముఖ్యంగా 16 రకాల గ్రామీణ ఆధారిత  పనులకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

16 రకాల పనులకు గ్రీన్‌ సిగ్నల్‌...

తాజా ఉత్తర్వులతో పల్లెల్లో నిలిచిపోయిన నిర్మాణ పనులన్నీ పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ కలెక్టర్‌ శరత్‌ యంత్రాంగానికి ఆదేశాలు సైతం జారీ చేశారు. రాష్ట్రంలో మార్చి 22న జనతాకర్ఫ్యూ, ఆ తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రకాల పనులు ఆగిపోయాయి. ఫార్మా, కిరాణా దుకాణాలకు మాత్రమే మినహాయింపు ఉండగా, తాజా అనుమతులతో పలు రకాల పరిశ్రమలు, దుకాణాలు తిరిగి తెరుచకోనున్నాయి. 

జాగ్రత్తలు ముఖ్యం...

ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతులు పొందిన 16 రకాల పరిశ్రమల్లో పలు నిబంధనలు, జాగ్రత్తలు పాటించాల్సిందిగా సర్కారు స్పష్టం చేసింది. ఆ దుకాణాలు, పరిశ్రమలు సాయంత్రం ఆరు గంటల వరకే పనిచేస్తాయి. పరిశ్రమలు, దుకాణాల వద్ద తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలి. ఉద్యోగుల సంఖ్య సాధారణ సమయంతో పోలిస్తే 30శాతం మించకుండా ఉండాలి. పరిశ్రమల్లో శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కుల కొరత లేకుండా చూడాలి. అంతేకాకుండా థర్మల్‌ స్క్రీనింగ్‌ సైతం తప్పనిసరిగా వాడాల్సిందిగా  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పని చేసే వారందరికీ మెడికల్‌ ఇన్సూరెన్సు తప్పనిసరిగా చేయాలి. 

అనుమతించిన పరిశ్రమలు ఇవీ...

1. నిర్మాణ పనులు, 2. స్టోన్‌ క్రషర్స్‌, 3. ఇటుకల బట్టీలు, 4. చేనేత పరిశ్రమ, 5. రిపేర్‌ వర్క్‌షాప్స్‌, 6. బీడీల తయారీ, 7. ఇసుక మైనింగ్‌, 8. సిరామిక్‌, రూఫ్‌ టైల్స్‌, 9. సిమెంట్‌ పరిశ్రమలు, 10.జిన్నింగ్‌ మిల్లులు, 11. ఇనుము -స్టీల్‌ ప్లాంట్లు, 12. ప్లాస్టిక్‌, శానిటరీ పైపుల దుకాణాలు, 13. కాగిత పరిశ్రమ, 14. పరుపుల తయారీ, 15. ప్లాస్టిక్‌ - రబ్బర్‌ తయారీ, 16. ఇతర వస్తువుల దుకాణాలు.

సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరి

16 రకాల పనులకు అనుమతులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాం. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు జాగ్రత్తలు తీసుకుంటూనే పరిమితంగా పనులు చేసుకునే వెసులుబాటు మాత్రమే ఉంది. సామాజిక దూరం, మాస్కుల వాడకం తప్పనిసరి. 

- శరత్‌, కామారెడ్డి కలెక్టర్‌


logo