గురువారం 28 మే 2020
Nizamabad - May 01, 2020 , 01:51:34

మక్కలకు ‘మద్దతు’

మక్కలకు ‘మద్దతు’

  • నిర్మల్‌ జిల్లాలోలక్ష మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా
  • 104 కేంద్రాల్లో కొనుగోళ్లకు చర్యలు
  • ఇప్పటికే 37,014 మెట్రిక్‌ టన్నులు సేకరణ 

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మక్క రైతులకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తున్నది. ఒకేసారి మక్కలు, ధాన్యం పంటలు చేతికి రావడం.. ఒకవైపు లాక్‌డౌన్‌ ఉండడం.. గోదాముల సమస్య ఏర్పడినప్పటికీ అధికార యంత్రాంగం రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. నిర్మల్‌ జిల్లాలో 80వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, లక్ష మెట్రిక్‌ టన్ను ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 

మక్కలు కొనుగోలు చేసేందుకు జిల్లాలో 104 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 100 కేంద్రాలను ప్రారంభించి 8,077మంది రైతుల నుంచి 37,014 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. క్వింటాలుకు రూ. 1760 చొప్పున మద్దతు ధర చెల్లిస్తున్నారు. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు క్షేత్రస్థాయిలో పర్యటించి మక్కల కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నారు. 

కొనుగోళ్లు జోరుగా సాగుతుండగా.. నిల్వ చేసేందుకు గోదాముల సమస్య ఏర్పడింది. జిల్లాలో గోదాముల్లో 95,780 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా.. వీటిని ఇప్పటికే శనగలు, కందులు, ధాన్యం కోసం ఇచ్చారు. దీంతో  గోదాముల సమస్య ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 19వేల మెట్రిక్‌ ట న్నుల మక్కలను జిల్లాలోని 15 గోదాముల్లో నిల్వ చేశా రు. మరోవైపు ధర్మాబాద్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ ప్రాం తాల్లో గోదాములను అద్దెకు తీసుకుంటున్నారు. భైంసా, నిర్మల్‌ ప్రాంతాల్లో మూతబడిన జిన్నింగ్‌ మిల్లులు, రైస్‌మిల్లుల్లో మక్కలను నిల్వ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి  గోదాముల విషయంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావుతో మా ట్లాడారు. సోఫీనగర్‌లోని గోదాముల్లో నిల్వ చేస్తున్న మక్కలను మంత్రి స్వయంగా పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ ధర్మాబాద్‌కు రెండు, మూడుసార్లు వెళ్లి అక్కడి గోదాములను పరిశీలించి వచ్చారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి మక్కలు అక్రమ రవాణా కాకుండా చర్యలు చేపట్టారు. బుధవారం మహారాష్ట్ర నుంచి అక్రమంగా మక్కలతో వ స్తున్న లారీని కరీంనగర్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారులు తనిఖీ చేసి సారంగాపూర్‌ మండ లం సిర్పెల్లి చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. మెట్‌పల్లికి వెళ్తున్నాయని చెప్పగా.. అక్కడ చిరునామా తప్పని తేలడంతో లారీని సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. గురువారం సోన్‌ మండలం సోఫీనగర్‌ శివారులో మక్కల నిల్వల కోసం గోదాములను రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి పరిశీలించారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా మక్కలు రాకుండా తనిఖీలు చేపట్టామని జిల్లా మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌ ‘నమస్తే తెలంగాణ’తో పేర్కొన్నారు.


logo