మంగళవారం 26 మే 2020
Nizamabad - Apr 30, 2020 , 02:47:22

రైతులు అధైర్యపడొద్దు

రైతులు అధైర్యపడొద్దు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి/సోన్‌/ సారంగాపూర్‌: రైతులు అధైర్యపడవద్దని, పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని సోఫీనగర్‌లోని శ్రీసాయి శ్రీనివాస్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ గోదాములో నిల్వచేస్తున్న మక్కలను ఆయన పరిశీలించారు. చిట్యాల్‌లో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సారంగాపూర్‌ మండలం ఆలూర్‌, జామ్‌ గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో 80వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, లక్ష మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 7,451 మంది రైతుల నుంచి రూ. 61,38,82,720 విలువైన 34వేల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న  కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో 19వేల మెట్రిక్‌ టన్నులు  జిల్లాలోని 15 గోదాముల్లో నిల్వ చేశామని, మిగతా 15వేల మెట్రిక్‌ టన్నుల మక్కలను నిల్వ చేయడానికి గోదాములను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా గోదాములతో పాటు ఆర్మూర్‌, నిజామాబాద్‌, ధర్మాబాద్‌ గోదాముల్లో మక్కలు నిల్వ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ధాన్యం స్టోరేజీ కోసం ప్రభుత్వం రైస్‌మిల్లర్లు, ఎఫ్‌సీఐతో చర్చించినట్లు తెలిపారు. జిల్లాలో 35లక్షల గన్నీ సంచులు నిల్వ ఉన్నాయని, ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఎఫ్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజిగారి రాజేందర్‌, జిల్లా రైతుబంధు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ నల్లా వెంకట్రామ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌రెడ్డి, నిర్మల్‌ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


logo