శనివారం 30 మే 2020
Nizamabad - Apr 30, 2020 , 02:46:38

వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

  • ప్రతీ పీఏసీఎస్‌ చైర్మన్‌ కథానాయకుడు
  • మనం రైతులకు జవాబుదారులం.. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి  
  • సమస్యలు ఎదురైతే నాదృష్టికి తీసుకురండి
  • కడ్తా పేరుతో రైతులను మోసంచేస్తే కఠిన చర్యలు  
  • ధాన్యం సేకరణపై పీఏసీఎస్‌ చైర్మన్లకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచనలు  
  • హైదరాబాద్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్‌ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నా రు. బుధవారం జిల్లాలోని సహకార సంఘాల(పీఏసీఎస్‌) చైర్మన్లతో హైదరాబాద్‌ నుంచి ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలులో పీఏసీఎస్‌ చైర్మన్లు ఎక్కడికక్కడ కథానాయకుడి పాత్ర పోషించాలన్నారు.  లాక్‌డౌన్‌తో  క్లిష్ట పరిస్థితులు ఉన్నా.. రైతులు పండించిన పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలని సీఎం నిర్ణయించారన్నారు. క్షేత్రస్థాయిలో  సమస్యల పరిష్కారానికి కథానాయకుడి పాత్ర పోషించాలని పీఏసీఎస్‌ చైర్మన్లకు మంత్రి సూచించారు. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ర్టాల నుంచి హమాలీలు రావడం లేదని, ఈ నేపథ్యంలో గ్రామాల్లోనే హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు.లారీల కొరతతో ధాన్యం తరలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామా ల్లో ఉన్న ట్రాక్టర్లు, లారీలను గుర్తించి వీటికి వినియోగించుకోవాలని సూచించారు. కడ్తా పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో నోడల్‌ ఆఫీసర్లు, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేస్తారన్నారు. ఈ కష్టకాలంలో సొసైటీ చైర్మన్లు మరింత బాధ్యతతో పనిచేయాలని కోరారు. 

ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా... 

పీఏసీఎస్‌ చైర్మన్లకు ఏమైనా సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. జిల్లాలో 287 కొనుగోలు కేంద్రాల్లో మంగళవారం వరకు 1.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ఇందులో 90శాతం ధాన్యం రైస్‌మిల్లులకు చేర్చామన్నారు. 

రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి.. 

రైతులకు ఇబ్బంది కలగకుండా ఒక పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని, దానికి అనుగుణంగా పనిచేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కోరారు. ధాన్యం సేకరణ  మన రాష్ట్రంలో జరిగినట్లు దేశంలో ఎక్కడా జరగడం లేదని, కరోనాను సాకుగా చూపి మిగతా ఏ రాష్ట్రంలోనూ రైతు పండించిన పంటను పూర్తిగా కొనడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి కాబట్టి, ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దని ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం సేకరిస్తున్నట్లు చెప్పారు. తెల్లజొన్నలు, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొద్దు తిరుగుడు పంటను కేంద్ర ప్రభుత్వం కేవలం 25శాతం మాత్రమే కొంటుందన్నారు. మిగతా 75శాతం రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తున్నదన్నారు. తెల్లజొన్నలను వంద శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. 

ఖర్చులు భరించాలని మంత్రికి విజ్ఞప్తి...

మిల్లర్లు అన్‌లోడ్‌ కోసం హమాలీల ఖర్చులు ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి కోరగా.. హమాలీల ఖర్చు కచ్చితంగా ఆయా మిల్లర్లే భరించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఖర్చులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. ట్రాక్టర్లు, లారీల పేమెంట్‌ మిల్లర్లు భరించేలా చర్యలు తీసుకోవాలని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి కోరారు. వారి పేమెంట్‌కు పూర్తి బాధ్యతపై కలెక్టర్‌ హామీ ఇచ్చారని, రైస్‌మిల్లర్లకు అన్‌లోడ్‌ కోసం 24 గంటల సమయం కేటాయించారని తెలిపారు. పీఏసీఎస్‌ చైర్మన్లు నోడల్‌ ఆఫీసర్లకు హమాలీలను, లోకల్‌ ట్రాక్టర్‌ లారీలను అటాచ్‌ చేయాలని మంత్రి సూచించారు.  

కడ్తా పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు... 

కడ్తా పేరుతో రైతులను ఇబ్బందికి గురిచేసే రైస్‌మిల్లర్లపై చర్యలు తప్పవని మంత్రి ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లాకు చెందిన ఓ రైస్‌మిల్లును సీజ్‌ చేశామన్నారు. కడ్తా విషయంలో ప్రతి మూడు రైస్‌మిల్లులకు ఒక ఏఈవో పర్యవేక్షిస్తారని, పీఏసీఎస్‌ చైర్మన్లు వారి దృష్టికి తీసుకెళ్తే 12గంటల్లోపు రైస్‌మిల్లుకు చేరిన ధాన్యంలో కడ్తాను గుర్తిస్తారన్నారు. దాని ప్రకారం రైస్‌మిల్లర్లు నడుచుకోవాలన్నారు. లేకుంటే మండల నోడల్‌ కమిటీకి ఫిర్యాదు చేయాలని, వారు సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు రైతులకు జవాబుదారీగా ఉండాలన్నారు. 


logo