శనివారం 06 జూన్ 2020
Nizamabad - Apr 30, 2020 , 02:44:52

పేదలకు భారీ ఊరట!

పేదలకు భారీ ఊరట!

  • బియ్యంతో పాటు కందిపప్పు ఉచితం!
  • వచ్చే నెల నుంచి రేషన్‌ లబ్ధిదారులకు పంపిణీ
  • మున్సిపాలిటీల్లో అందుబాటులో గోధుమలు ..
  • నామమాత్రపు ధరకు చక్కెర, ఉప్పు ప్యాకెట్ల విక్రయం
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సాయం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంతోమంది తాత్కాలికంగా ఉపాధి కోల్పోయారు. వారు ఆకలితో అలమటించకుండా ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్క్రార్డుదారు కుటుంబాల్లో ఇదివరకు ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యం ఇవ్వగా.. ఏప్రిల్‌ నెల కోటాలో కరోనా సాయంగా 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. మే నెలలోనూ బియ్యంతో పాటు అదనంగా కిలో కందిపప్పును ఉచితంగానే అందించనున్నది. గోధుమలు, చక్కెర, ఉప్పు ప్యాకెట్లను నిర్దేశిత ధరకు విక్రయించనున్నారు. ప్రతి కార్డుదారుకు రూ.1500 బ్యాంకు, తపాలా ఖాతాల్లో జమ కానున్నది.

కామారెడ్డి జిల్లాకు 2.48లక్షల కిలోల కందిపప్పు

జిల్లాలో ఏప్రిల్‌ నెలలో 10,300 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ  ఉచితంగా అందించారు. మేలో బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు ఇవ్వనున్నారు. కిలో కందిపప్పు ఇవ్వనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో 2లక్షల 48వేల 913మంది కార్డుదారులకు ప్రయోజనం కలుగనున్నది. గోధుమలు కేవలం మున్సిపాలిటీల్లోనే పంపిణీ చేయనున్నారు. కిలో గోధుమలు రూ.7 చొప్పున కార్డుదారులకు ఇవ్వనుండగా, కిలో చక్కెర రూ.13.50కు 17,240 మంది అంత్యోదయ కార్డుదారులకు అందించనున్నారు. కిలో ఉప్పు రూ.5కు ప్రతికార్డుకు పంపిణీ చేయనున్నారు. 

రేషన్‌ దుకాణాల వద్ద నిబంధనలు తప్పనిసరి

లాక్‌డౌన్‌ కారణంగా రేషన్‌ దుకాణాల వద్ద బియ్యం, సరుకులు పంపిణీ సమయంలో నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. కార్డుదారులకు టోకెన్‌ ఇవ్వాలని, దుకాణం వద్ద సరుకుల పంపిణీ సందర్భంగా సామాజికదూరం పాటించాలని సబ్బు, నీటిని అందుబాటులో ఉంచాలని సూచించింది. మాస్కులు ధరించిన కార్డుదారులకే సరుకులు ఇవ్వాలని, రేషన్‌ దుకాణాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని ఆదేశించింది. దుకాణాల వద్దకు వచ్చే గర్భిణులు, వయోవృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

నేరుగా ఖాతాల్లోనే రూ.1500 జమ

లాక్‌డౌన్‌ సమయంలో ఆదాయం లేక విలవిల్లాడుతున్న ప్రజలకు ప్రభుత్వం రూ.1500 అందిస్తున్నది. ఏప్రిల్‌లో 2,48,913 మంది కార్డుదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే రూ.37.33కోట్లు నగదు జమ చేశాం. ఆధార్‌ నంబర్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ సీడింగ్‌ కాని వారికి నగదు జమ కాలేదు. ఇలాంటివారు జిల్లాలో 11,777మంది ఉన్నట్లుగా గుర్తించాం. వీరికి రూ.1.76 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

- కొండల్‌రావు, కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి

రేషన్‌ దుకాణాలకు బియ్యం పంపిస్తున్నాం..

జిల్లాలో రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నగదుకు సంబంధించి జాబితాలను రేషన్‌ దుకాణాల్లో పెడుతున్నాం. సాధారణంగా ప్రతినెలా 88 శాతం మంది రేషన్‌ తీసుకోగా.. గత నెలలో 94 శాతం మంది రేషన్‌ బియ్యం తీసుకున్నారు.

- కిరణ్‌కుమార్‌, డీఎస్‌వో, నిర్మల్‌


logo