గురువారం 04 జూన్ 2020
Nizamabad - Apr 28, 2020 , 02:40:12

అర్వింద్‌.. అబద్ధ్దాలు మానుకో

అర్వింద్‌.. అబద్ధ్దాలు మానుకో

  • ప్రభుత్వం రూ.30వేల కోట్లు అప్పుతెచ్చి పంట దిగుబడులు కొనుగోలు చేస్తున్నది
  • రూ. వెయ్యి కోట్ల వడ్డీ, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు భరిస్తూ వడ్లు కొంటున్నాం 
  • మక్కలు, తెల్లజొన్నలు కేంద్రం ఒక్క గింజైనా కొనడం లేదు..
  • రూ.3,200 కోట్ల భారం మోస్తూ కొంటున్నది కేసీఆర్‌ ప్రభుత్వమే
  • శనగలు, పొద్దుతిరుగుడు పంటలు 75శాతం కొంటున్నది 
  • రైతులపై ప్రేమ ఉంటే పసుపుబోర్డు తీసుకురా..
  • మోదీ వద్ద మీ మాట నడిస్తే రాష్ట్రం భరిస్తున్న  డబ్బులు ఇప్పించండి
  • విపత్కర సమయంలో ప్రజలు రాజకీయాలు కోరుకోవడం లేదు
  • రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి:  దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పంట దిగుబడులు కొనుగోలు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని ఎంపీ అర్వింద్‌, బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని మోతెలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి పరిశీలించి రైతులతో మాట్లాడారు. హమాలీల కొరత ఉన్నచోట గ్రామస్తులు సహాయసహకారాలు అందించాలని కోరారు. కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, కడ్తా విషయంలో రైస్‌ మిల్లర్లని కట్టడి చేయాలని, రైతులు మోసపోకుండా చూడాలని  అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లు అప్పుతెచ్చి కొనుగోలు కేంద్రాల ద్వారా పంట దిగుబడులను సేకరిస్తున్నదన్నారు. రాష్ట్రం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా ఏ ఆరు నెలలకో కొంటుందని, అది కూడా ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తుందో ఇప్పుడే తెలియదన్నారు. అప్పటి వరకు కేంద్రం ఒక్కపైసా ఇవ్వదన్నారు. ధాన్యం కొనుగోలుకు వెచ్చిస్తున్న మొత్తంపై పడే వడ్డీభారం రూ.వెయ్యి కోట్లతో పాటు రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. క్వింటాల్‌కు రూ.300 అదనపు భారాన్నానైనా భరించేందుకు సిద్ధపడి సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారని అన్నారు.  కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత కారణంగా ధాన్యం సేకరణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి అన్నారు. వాటిని అధిగమిస్తూ త్వరితగతిన కొనుగోళ్లు పూర్తిచేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వకున్నా మొత్తం ధాన్యం కొనుడు పక్కా అని భరోసా ఇచ్చారు. ఇప్పుడు చేయాల్సింది దీక్షలు కాదు, చేయాల్సింది రైతుల నుంచి ధాన్యం కొనడం అని అన్నారు. 

ఈ సమయంలో రాజకీయాలా..?

కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.7వేల కోట్లు ఇవ్వలేదని, ఇచ్చింది రూ.1600 కోట్లు మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు కేటాయించిన విధంగానే తెలంగాణాకూ కేటాయించారు తప్ప, చిల్లిగవ్వ ఎక్కువ ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇచ్చిన దానికి రెండురెట్లు అదనంగా కలిపి కేసీఆర్‌ ప్రభుత్వం సహాయం చేస్తున్నదన్నారు. తెలంగాణలో చేపడుతున్న కరోనా కట్టడి, సహాయక చర్యలను ప్రశంసిస్తూ కేంద్ర బృందం, జాతీయ మీడియా కోడైకూస్తున్నా అర్వింద్‌ కండ్లకు కనిపిస్త లేదా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రజలు రాజకీయాలు కోరుకోవడం లేదని, సహాయం, ధైర్యం, భరోసా కోరుకుంటున్నారన్నారు. నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో నెల రోజులు ఇంట్లో దాక్కుని బయటకు రాని మీకు అది అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 

ఎంపీవి పచ్చి అబద్ధ్దాలు

ఎంపీ అర్వింద్‌ రైతులను తప్పుదోవ పట్టించేందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మద్దతు పంటలైన మక్కలు, తెల్లజొన్నలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, రూ.3,200 కోట్లు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల వద్దనుంచి నేరుగా సేకరిస్తున్నదన్నారు. శనగ, పొద్దుతిరుగుడును కేంద్రం కేవలం 25 శాతమే కొనుగోలు చేస్తున్నదని, 75శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. ప్రధాని మోదీ దగ్గర నీ మాటనడిస్తే ధాన్యం కొనుగోళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న వడ్డీభారం, ఇతర ఖర్చులను కేంద్రం నుంచి ఇప్పించాలని అర్వింద్‌కు సూచించారు. అబద్దాలతో ఓట్లు దండుకున్నావని, రైతులపై ప్రేమ ఉంటే పసుపుబోర్డు తీసుకురావాలని, మక్కలు, శనగలు, తెల్లజొన్న, పొద్దుతిరుగుడు దిగుబడులను కేంద్రంతో కొనుగోలు చేయించాలని హితవుపలికారు.  స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని, బాధ్యతను మరిచి అబద్ధాలతో రాజకీయాలు చేస్తే రైతులు వాత పెడతారన్నారు. ‘అబద్ధాలు మాట్లాడి గెలిచిన ఆయనకు అన్నీ అబద్ధాలు మాట్లాడడం అలవాటుగా మారిందని’ నిజమైన పాత బీజేపీ నాయకుడొకరు తనతో పేర్కొన్నాడని తెలిపారు. 


logo