సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Apr 28, 2020 , 02:38:09

ఊరూరా గులాబీ పండుగ

ఊరూరా గులాబీ పండుగ

  • నిరాడంబరంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు
  • రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ
  • రక్తదానం చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి,విప్‌ గంప గోవర్ధన్‌

నమస్తే తెలంగాణ యంత్రాంగం: కరోనా విజృంభణ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ, రక్తదానం శిబిరాలు నిర్వహించారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా హైదరాబాద్‌లోని తన నివాసంలో టీఆర్‌ఎస్‌ జెండా ను ఎగురవేశారు.టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి జెండాను ఎగురవేశారు. జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, డాక్టర్‌ బాపురెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రక్తదానం చేశారు. జడ్పీ చైర్మన్‌ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీలో దివ్యాంగులు, పేదలకు సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్‌ నీతూ కిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోధన్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి తన నివాసంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. ధర్పల్లిలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. చందూర్‌లో పోచారం సురేందర్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. బోధన్‌, రెంజల్‌, రుద్రూర్‌, నవీపేట, ఎడపల్లి, జక్రాన్‌పల్లి,సిరికొండ, నిజామాబాద్‌ రూర ల్‌, ఇందల్వాయి, మెండోరా, మోపాల్‌, బాల్కొండ, భీమ్‌గల్‌,మోర్తాడ్‌, ఏర్గట్ల, మాక్లూర్‌, నందిపేట, కమ్మర్‌పల్లి తదితర మండలాల్లో స్థానిక నాయకులు సంబురాల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని తన నివాసం వద్ద టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలను  విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్కులు పంపిణీ చేసి టీఆర్‌ఎస్‌ జెండాను ఆయన ఎగుర వేశారు. బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు.  బాన్సువాడలో టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. బిచ్కుంద మండలం బండ రెంజల్‌లో ఎమ్మెల్యే హన్మంత్‌షిండే  జెండాను ఆవిష్కరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంపత్‌గౌడ్‌ కామారెడ్డిలో తన ఇంటి వద్ద టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. నిజాంసాగర్‌, జుక్కల్‌, బిచ్కుం ద, పిట్లం, బీర్కూరు, బాన్సువాడ, గాంధారి, లింగంపేట్‌, రాజంపేట, భిక్కనూర్‌, బీబీపేట్‌, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లోని అన్ని గ్రామాల్లో స్థానిక నాయకులు ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంతో పాటు మండలాలు, గ్రామా ల్లో నాయకులు పార్టీ జెండాలు ఎగురవేశారు. ఆదిలాబాద్‌లో తెలంగాణ చౌక్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి పార్టీ జెండాను ఎగురువేశారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, వైస్‌ చైర్మన్‌ ఆరే రాజన్న, మున్సిపల్‌ మాజీ  చైర్‌పర్సన్‌ రంగినేని మనిషాతో పాటు నాయకులు, కార్యకర్తలు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఇచ్చోడ, బోథ్‌, ఇంద్రవెల్లి, బేల, జైనథ్‌, గుడిహత్నూర్‌, తాంసి, భీం పూర్‌ మండలాల్లో స్థానిక టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధు లు, నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉట్నూర్‌లోని తన ఇంటి మేడపై జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  నిర్మల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భైంసా పట్టణ టీఆర్‌ఎస్‌  కార్యాలయంలో ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి , ఖానాపూర్‌లోని తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. దస్తురాబాద్‌, కుంటాల, లోకేశ్వరం, పెంబి మండలాలు, పరిధిలోని గ్రామాల్లో స్థానిక టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు  పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌

  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా సోమవారం రాష్ట్ర  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లోని తన నివాసం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాయకత్వం లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన వీరుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు. కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ పునర్నిర్మాణం అద్భుతంగా జరుగుతోందని, రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకా లు, కార్యక్రమాలు, సంక్షేమ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రాజెక్టుల పూర్తి తో తెలంగాణ సుభిక్షంగా మారిందన్నారు.  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద  అమరవీరుల స్తూపానికి మంత్రి నివాళులర్పించారు. ఆ తర్వాత  కొండాపూర్‌ వద్ద వలస కూలీలకు, కార్మికులకు అన్నదానం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. 

కేసీఆర్‌ పోరాటంతోనే  ‘తెలంగాణ’ఆవిర్భావం

  • టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం వేల్పూర్‌లోని తన నివాసంలో రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తన ఇంటిపై టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్ఛరించడమే అప్రకటిత నిషేధంగా ఉన్న రోజుల్లో, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారన్నారు. ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలతో కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా మడమ తిప్పకుండా పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌ సొంతం అన్నారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచతో సమానంగా భావించి వదిలేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించినప్పుడు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి కేసీఆర్‌తో ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. అటుకులు బుక్కి కేసీఆర్‌ వెంట పదిహేనేండ్లు తాము నడిచామని, ఇది తమకు గర్వంగా ఉంటుందని మననం చేసుకున్నారు. శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో, ప్రజా పోరాటాలు నిర్వహించి కేసీఆర్‌ తెలంగాణను సాధించారన్నారు. అనేక పథకాలు, కార్యక్రమాలు అమలుతో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏప్రిల్‌ మాసంలోనూ చెరువులు నింపుకోవడం చూస్తున్నామన్నారు. జనరంజక పాలనతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ బ్రహ్మాండమైన విజయాలు సాధించిందన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ మాత్రమే శ్రీరామరక్ష అని, ఇదే నమ్మకాన్ని కొనసాగించేందుకు మున్ముందు మరింతగా శ్రమించాలరని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు కార్యకర్తలతో కలిసి మంత్రి రక్తదానం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. 


logo