శనివారం 30 మే 2020
Nizamabad - Apr 26, 2020 , 02:54:03

మిల్లర్ల దోపిడీపై ఉక్కుపాదం!

మిల్లర్ల దోపిడీపై ఉక్కుపాదం!

  • నిజామాబాద్‌ జిల్లాలో 104 టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ల ఏర్పాటు
  • తరుగుతీస్తే క్రిమినల్‌ కేసులు పెట్టేలా ఆదేశాలు

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: తరుగు పేరిట కొందరు మిల్లర్లు రైతులను ముంచుతుండడంతో యంత్రాంగం చర్యలకు సిద్ధమైంది. రైతులను దోపిడీకి గురిచేసే మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టి రైస్‌ మిల్లులు సీజ్‌ చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచనల మేరకు జిల్లాలో 104 టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. మిల్లులు, మండలాలు, నియోజకవర్గాల వారీగా టీమ్‌లు ఏర్పాటు చేశారు. 70 మిల్లులకు ఒక్కో టీమ్‌ చొప్పున నిత్యం మానిటరింగ్‌ చేస్తాయి. ఇందులో సివిల్‌సప్లయ్‌ శాఖకు చెందిన డిప్యూటీ తహసీల్దారు, వ్యవసాయశాఖ విస్తరణాధికారి (ఏఈవో) ఉంటా రు. మండలాల టీమ్‌లు మొత్తం 29 ఏర్పాటు చేయగా.. మండలానికొకటి చొప్పున పనిచేస్తాయి. ఇందులో మండల వ్యవసాయాధికారి, ఎస్సై ఉంటా రు. నియోజకవర్గాల టీముల్లో నోడల్‌ ఆఫీసర్‌గా జిల్లా అసిస్టెంట్‌ వ్యవసాయ శాఖాధికారి, ఏసీపీ, ఆర్డీవోలు ఉంటారు. వీరంతా నిత్యం జిల్లాలో కొనుగోలు జరుగుతున్న ధాన్యంపై నిఘా పెడతారు. మిల్లర్ల అక్రమాలపై దృష్టిసారించి వాటిని ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు చేరవేస్తారు. అక్రమాలను వెంటనే గమనించి తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఫిర్యాదు మేరకు కొందరు మిల్లర్లపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధ్దమైనట్లు తెలిసింది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు మొత్తం లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. దాదాపు రూ.70 కోట్ల మేర   ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగాయి.   

రైతులను తప్పుదోవ పట్టించొద్దు 

  • డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేశ్‌రెడ్డి

ప్రస్తుత ఈ విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు  ఇబ్బంది లేకుండా జిల్లాలో 547 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, పక్కాగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేశ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గన్నీ బ్యాగుల కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని పేర్కొన్నారు


logo