గురువారం 28 మే 2020
Nizamabad - Apr 26, 2020 , 02:52:19

ఆంక్షల నుంచి ఊరట

ఆంక్షల నుంచి ఊరట

కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడం ఊరటనిస్తున్నది. ఆయా జిల్లాల్లోని కంటైన్మెంట్‌ జోన్లలో కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం లేదు. దీంతో అధికారులు క్రమంగా పలు జోన్ల పరిధిలో ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. బారికేడ్లు తొలగిస్తూ ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునేందుకు నిబంధనలతో కూడిన సడలింపులు ఇస్తున్నారు. 

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: నిర్మల్‌ జిల్లా కరోనా బారి నుంచి క్రమంగా కోలుకుంటున్నది. కొవిడ్‌ -19 వైరస్‌ సోకి దవాఖానలో చికిత్స పొందుతున్నవారు ఒ క్కొక్కరుగా కోలుకొని ఇంటికి చేరుకుంటున్నారు. ఇటీవల కొత్త కేసులు నమోదు కాకపోవడంతో కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు సడలిస్తున్నారు. జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతిచెందగా.. 20 మందికి పాజిటివ్‌గా నమోదయ్యింది. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న వీరిలో 8మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 12మంది  చికిత్స పొందుతున్నారు. మొత్తం 16 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా 14 రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం లేదు. దీంతో తొమ్మిది జోన్లలో బారికేడ్లు తొలగించి.. ఆంక్షలు ఎత్తివేశారు. మరో ఏడు జోన్లలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. గాజులపేట్‌, జోహ్రానగర్‌, లక్ష్మణచాంద మండ లం రాచాపూర్‌, కనకాపూర్‌, పెంబి మండ లం రాయదారి, మామడ మండలం న్యూ లింగంపల్లి, కడెం, నిర్మల్‌ పట్టణంలోని కస్బా, బుధవార్‌పేట్‌లో ఆంక్షలను సడలించారు. జిల్లాలో ఉదయం 6 నుంచి సాయం త్రం 6గంటల వరకే అత్యవసర పనులకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపా రు. మే 7వ తేదీవరకు రాత్రివేళల్లో పూర్తిస్థాయిలో కర్ఫ్యూ కొనసాగుతుందని, ఎవరూ బయట తిరగవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రభు త్వ జీవో 45 ప్రకారం జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ప్రకటించారు. గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చిన వారినీ 14రోజులపాటు హోంక్వారంటైన్‌ చేసి వైద్యుల పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. 


logo