బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Apr 24, 2020 , 01:01:50

‘పాజిటివ్‌' పిడుగు!

‘పాజిటివ్‌' పిడుగు!

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : నిర్మల్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన పట్టణంలోని మోతీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి జలుబుతో బాధపడుతుండడంతో అధికారులు వైద్య పరీక్షలు చేశారు. గురువారం రిపోర్టురాగా కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. సదరు వ్యక్తికి గతంలో వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. తాజాగా రక్తనమూనాలను పరీక్షలకు పంపగా పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య మొత్తం 20కి చేరింది. వీరిలో ఇద్దరు కోలుకొని డిశ్చార్జి కాగా, మిగతా 18 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో  పదిరోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులేవీ నమోదు కాకపోవడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకన్నారు. తాజా కేసుతో మళ్లీ కలకలం మొదలైంది. మరోవారం రోజులపాటు కొత్తకేసులు నమోదుకాకుంటే జిల్లాలో మహమ్మారి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న తరుణంలో మోతీనగర్‌ ఉదంతంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

వైరస్‌ వ్యాప్తినివారణకు చర్యలు 

జిల్లాలో కరోనా వైరస్‌వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అధికారులు కంటైన్మెంట్‌ జోన్లలో ఫ్లడ్‌ సర్వే ప్రారంభించారు. వంద బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లాకేంద్రంలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద గురువారం ఫ్లడ్‌ సర్వేను ప్రారంభించిన కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ వైద్యారోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. మొదటిరోజు నాలుగు జోన్లలో బృందాలు సర్వే పూర్తిచేయగా, శుక్రవారం భైంసా, కడెంలో, శనివారం మిగతా చోట్ల సర్వే నిర్వహించనున్నారు. 

క్షేత్రస్థాయి పర్యటనలు

క్షేత్రస్థాయిలో అధికారులు, పోలీసులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో బుధవారం ఉదయం కలెక్టర్‌ ముషారఫ్‌ అలీఫారూఖీ, ఎస్పీ శశిధర్‌రాజు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు కాలినడకన పర్యటించారు. తిరిగి మధ్యాహ్నం మంత్రి అల్లోలతోపాటు బైక్‌లపై పర్యటించారు. భైంసాలోని కంటైన్మెంట్‌ జోన్లలో బుధవారం రాత్రి కలెక్టర్‌ కాలినడకన పర్యటించారు. ఇప్పటికే బారికేడ్లు, ఫెన్సింగ్‌, గోడలు నిర్మించడంతోపాటు పికెట్‌ ఏర్పాటు చేశారు. రాకపోకలను అనుమతించడం లేదు. తప్పనిసరిపరిస్థితుల్లో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. లాన్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తూ మందులు, ఇతరత్రా వైద్య అవసరాలకు మినహా మిగతా వాటిని అనుమతించడం లేదు. తోపుడుబండ్లపై కూరగాయలు విక్రయించేందుకు అనుమతించారు. నిత్యావసర సరుకులను మున్సిపల్‌ వాహనాల్లో ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలతో కంటైన్మెంట్‌ జోన్లలో పరిస్థితిని పర్యవేక్షించడంతోపాటు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.

బారికేడ్ల ఏర్పాటు

భైంసా, నమస్తే తెలంగాణ : కంటైన్మెంట్‌ జోన్లలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గురువారం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.  పట్టణంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో బుధవారం రాత్రి కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కుంట ఏరియాలో ఓ వర్గానికి చెందినవారు గుంపులుగుంపులుగా ఉండడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో వారంతా ఆందోళనకు దిగడంతో ఎస్పీ శశిధర్‌రాజు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గురువారం కుంట ఏరియాలోని ప్రతివీధిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 


logo