మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Apr 22, 2020 , 02:06:07

పేదలకు మేమున్నామంటూ..

పేదలకు మేమున్నామంటూ..

నమస్తే తెలంగాణ యంత్రాంగం : లాక్‌డౌన్‌ వేళ పేదలు ఇబ్బందులు పడకూడదని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ముందుకు వచ్చి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సరుకుల పంపిణీ కొనసాగుతున్నది.  

ఆదిలాబాద్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మంగళవారం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా, బోథ్‌, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నార్నూర్‌, నేరడిగొండ మండలాలతోపాటు నిర్మల్‌ జిల్లాలోనూ నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగింది. దస్త్తురాబాద్‌ మండలంలో  ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఆదివాసీలకు సరుకులు పంపిణీ చేశారు. దాతల సహకారంతో నిర్మల్‌లో పోలీసులకు ఎస్పీ శశిధర్‌రాజు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. భైంసా, కడెం, సారంగాపూర్‌, సోన్‌, లోకేశ్వరం మండలాల్లో నిత్యావసర సరుకులు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కొనసాగింది. కామారెడ్డి జిల్లాలో పేదలకు ఆసరాగా నిలవడానికి పలువురు నాయకులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముందుకు వస్తున్నారు. పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, బీబీపేట్‌, దోమకొండ మండలాల్లో మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, కామారెడ్డి పట్టణంలో విప్‌ గంప గోవర్ధన్‌ కుమారుడు శశాంక్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు. మాచారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్‌ మండలాల్లో  సరుకుల పంపిణీ కొనసాగింది. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌లో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, బోధన్‌, శక్కర్‌నగర్‌, మోర్తాడ్‌, వేల్పూర్‌, చందూర్‌, డిచ్‌పల్లి, ధర్పల్లి, నిజామాబాద్‌ రూరల్‌  మండలాల్లో పలువురు నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు సరుకులు పంపిణీ చేశారు. 

కొనసాగుతున్న మాస్కులు, శానిటైజర్ల పంపిణీ

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా మాస్కుల వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బందికి, కూలీలకు, అత్యవసర విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ సిబ్బందికి స్థానిక నాయకులు మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌, బోథ్‌, జైనథ్‌, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ మండలాల్లో కార్మికులకు నాయకులు, అధికారులు మాస్కులు పంపిణీ చేశారు. నిర్మల్‌ జిల్లాలోని లక్ష్మణచాందలో ఐకేఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు. నిర్మల్‌, సోన్‌ మండలాల్లో సైతం శానిటైజర్లు, మాస్కుల పంపిణీ కొనసాగింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు నిజామాబాద్‌, బోధన్‌లో సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులను స్వచ్ఛంద సంస్థ సభ్యులు అందజేశారు.    logo