గురువారం 28 మే 2020
Nizamabad - Apr 21, 2020 , 02:39:29

ఆదర్శం.. ఆదివాసీ గూడేలు

ఆదర్శం.. ఆదివాసీ గూడేలు

  • స్వీయనిర్బంధం పాటిస్తున్న గిరిజనులు
  • పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు
  • ఆదిలాబాద్‌ జిల్లాలో 248 గిరిజన పల్లెలు
  • ఉచిత బియ్యం, నగదుతో ప్రయోజనం
  • ఇప్పపువ్వు సేకరణ, ఉపాధి పనుల్లో నిమగ్నం

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: లాక్‌డౌన్‌ అమలు లో ఆదిలాబాద్‌ జిల్లా ఆదివాసీ గూడేలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉం డగా ఏజెన్సీతో పాటు నాన్‌ ఏజెన్సీలో 248 గిరిజన గ్రామాలున్నాయి. జిల్లాలో సగానికి పైగా గిరిజన పంచాయతీల్లో ఆదివాసీలు సంపూర్ణంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. నెల రోజులుగా ఆ గూడేల ప్రజలు గ్రామ సరిహద్దుల్లో అడ్డుకట్టలు వేసి గ్రామాల్లోకి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు. ఐక్యతకు మారుపేరుగా నిలిచే జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో కరోనా ఛాయలు దరిచేరకపోగా అనుమానితులు కూడా కనపడడం లేదు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన 12 కిలో ల బియ్యం రూ.1500 నగదు వారికి ఎంతో ప్రయోజనకరం గా మారాయి. ఈ ఏడాది వానాకాలంలో సాగుచేసిన కంది దిగుబడి రాగా ఇసుర్రాయిపై ఇంటివద్దనే పప్పును తయా రు చేసుకుంటున్నారు. జిల్లాలో ఆదివాసీ గూడేలతో పాటు పరిసర గ్రామాల్లో టమాటా ఎక్కువగా సాగవుతోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా అధికారులు కామన్‌ సర్వీస్‌ సెంటర్ల నిర్వాహకులను పల్లెలకు పంపి రూ.1500 నగదు అందించారు.  

సామాజిక దూరం పాటిస్తూ..

ఆదివాసీ గ్రామాల ప్రజలు ఇటీవల సర్కారు పంపిణీ చేసిన 12 కిలోల బియ్యం తీసుకునేందుకు రేషన్‌ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించి శెభాష్‌ అనిపించుకున్నారు. దు కాణాలు, కుళాయిలు, బావుల వద్ద, ఆలయాల వద్ద, గ్రామం లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం చర్చించుకునేటప్పుడు, అధికారులు పర్యటిస్తే వారితో మాట్లాడేటప్పుడు, ఉపాధిహామీ పనుల్లో సామాజిక దూరం పాటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. 

ఇప్పపూల సేకరణతో ఉపాధి

ఆదివాసీ పల్లెల్లో రేషన్‌కార్డు లేనివారు, కూలీలకు మిగితావారు సాయం అందిస్తున్నారు. ఎండాకాలంలో గిరిజనులు ఇప్పపువ్వు సేకరణ ద్వారా ఉపాధి పొందుతారు. ఇప్పపువ్వు పౌష్టికాహారం కావడంతో ఐటీడీఏ అధికారులు ఇటీవల ఇప్ప లడ్డూల తయారీని ప్రారంభించారు. దీంతో ఇప్పపువ్వునకు డిమాండ్‌ బాగా పెరిగింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆదివాసీ గూడేల ప్రజలు అటవీ ప్రాంతాల నుంచి ఇప్పపూలు సేకరించి ఆరబెడుతున్నారు. పలు గ్రామాల్లో జాతీయ ఉపాధిహామీ పనులు ప్రారంభమయ్యాయి.ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పల్లెప్రగతి  ద్వారా గిరిజన పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం సంతరించుకోగా.. స్థానిక ప్రజాప్రతినిధులు తమవంతు బాధ్యతగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. 

తరాల నుంచి సంప్రదాయ పౌష్టికాహారంగా అడవి పండ్లు

గోండు, కొలాం, ఇతర ఆదివాసీ పల్లెలను గమనిస్తే.. వారు ముత్తాతల జమానా నుంచి సంప్రదాయ ఆహారంగా సీజనల్‌గా అడవుల నుంచి లభించే పండ్లు తీసుకుంటారు. ఇప్పటికీ కొన్ని ఆవాసాల్లో బురుకులు, సామలను సాగుచేస్తారు. ఇక తునికి, మొర్రి, జీడి, సీతాఫలం, మామిడి పండ్లు, సిర్మని బంక (జిగురు), తేనె, బెల్లం వంటివి అడవిబిడ్డల రోజువారీ ఆహారంలో ఏ రూపంలోనైనా భాగమవుతాయి. వీటి ద్వారా వ్యాధి నిరోధక శక్తి తమకు ఎక్కువేనని వారు చెబుతుంటారు. జొన్న రొట్టె, జొన్న గట్క ఇప్పటికీ తీసుకుంటారు. ఇవన్నీ ఆదివాసీ గూడేలు, పల్లెల ప్రశాంతత, ఆరోగ్యానికి కారకాలని చెప్పవచ్చు.

ఐక్యతతో కరోనాను తరిమికొడుతాం..

మా గ్రామంలో ప్రజలంతా కలిసిమెలిసి ఉంటూ వై రస్‌ సోకుండా జాగ్రత్తలు పాటిస్తున్నం. అంతా ఏకమై క రోనాను అడ్డుకుంటాం. గ్రామం నుంచి ఎవరూ బయట కు పోతలేరు. మా ఊరివాళ్లకు కావాల్సిన కిరాణా సామా న్లు గుడిహత్నూర్‌ నుంచి యవకులతో తెప్పిస్తున్నాం. లాక్‌డౌన్‌ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటిలా గా ఉంటున్నాం. సర్కారు ఇచ్చిన బియ్యం, రూ.1500  మరింత భరోసా నింపాయి. గ్రామంలో సామాజిక దూరానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.

- కుమ్ర శంభు, సర్పంచ్‌, శంభుగూడ


logo