గురువారం 28 మే 2020
Nizamabad - Apr 20, 2020 , 01:49:02

అకాల న(క)ష్టం

అకాల న(క)ష్టం

  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షం
  • కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
  • దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు

నిజాంసాగర్‌, నమస్తే తెలంగాణ / గాంధారి / లింగంపేట / పిట్లం / దోమకొండ / బీబీపేట / విద్యానగర్‌ / ఇందల్వాయి : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం గంటపాటు కురిసింది. భారీ వర్షంతో పలు గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. లింగంపేట మండలంలోని మోతె, నల్లమడుగు, శెట్పల్లిసంగారెడ్డి, శెట్పల్లి, కోమట్‌పల్లి, పోతాయిపల్లి, పోల్కంపేట, మెంగారం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. మెంగారం గ్రామంలో తేలికపాటి వడగండ్లు పడ్డాయి. వరిపంట నేలవాలింది. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లుపడ్డారు. నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. పిట్లం మండలంలో 6.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రామారెడ్డి మండలం పోసానిపేట్‌లో తడిసిన ధాన్యాన్ని ఏఎంసీ చైర్మన్‌ సదాశివరెడ్డి, సర్పంచ్‌ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట సొసైటీలో తడిసిన ధాన్యాన్ని జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌ పరిశీలించారు. బీబీపేటలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.  ఇందల్వాయి, నల్లవెల్లి సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం నీటిపాలైంది. 

పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి

నిజాంసాగర్‌, నమస్తే తెలంగాణ / గాంధారి / సిరికొండ / భీమ్‌గల్‌: కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. గాంధారి, సిరికొండ మండలాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతిచెందారు. భీమ్‌గల్‌లో ఓ రైతుకు గాయాలయ్యాయి. నిజాంసాగర్‌ మండలంలో రెండు ఎడ్లు మృత్యువాత పడ్డాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో కుర్మ లక్ష్మణ్‌ (38) పిడుగుపాటుతో మృతిచెందాడు. లక్ష్మణ్‌ తన భార్య, పిల్లలతో కలిసి మొక్కజొన్న పంటకు కాపలా కోసం చేనులో గుడిసెను ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నారు. గుడిసె పక్కనే ఉన్న మామిడి చెట్టుపై పిడుగు పడడంతో లక్ష్మణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన చిన్న కొడుకు సతీశ్‌ స్పృహ కోల్పోయాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్‌ పరిశీలించారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని మెట్టుమర్రి తండాకు చెందిన కేతావత్‌ శీల (42) పిడుగుపాటుతో మృతి చెందింది. భర్తతో కలిసి పొలం పనులకు వెళ్లింది. వర్షం కారణంగా ఇంటికి వచ్చేందుకు భర్త బైకు తీస్తుండగా కొద్దిదూరంలో ఉన్న శీలపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భీమ్‌గల్‌ మండలంలోని దేవక్కపేట్‌కు చెందిన మాలావత్‌ కిషన్‌ ఎడ్ల బండిపై ఇంటికి వస్తుండగా వర్షం పడడంతో చెట్టు కింద ఆగాడు. పిడుగుపడడంతో కిషన్‌ కాలికి గాయమైంది. ఎడ్లబండి స్వల్పంగా కాలిపోయింది. నిజాంసాగర్‌ మండలం మంగ్లూర్‌లో నయాకుని రాములు పొలంలో పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృత్యువాతపడ్డాయి. ఎడ్లు మృతిచెందడంతో బాధిత రైతు కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 


logo