శనివారం 06 జూన్ 2020
Nizamabad - Apr 18, 2020 , 00:33:53

కాస్త ఊరట!

కాస్త ఊరట!

  • నిర్మల్‌ జిల్లాలో ఐదు రోజులుగా కేసులు నిల్‌ 
  • వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం
  • పక్కాగా లాక్‌డౌన్‌ అమలు
  • మహారాష్ట్రలో కేసులతో జిల్లాకు పొంచి ఉన్న ముప్పు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : నిర్మల్‌ జిల్లాలో 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఐదు రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు  నమోదు కాకపోవడం కాస్త ఊరటనిస్తోంది. జిల్లాలో మర్కజ్‌ కేసులతో కలకలం మొదలవ్వగా..ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. కరోనా పాజిటివ్‌ తేలిన వారు హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మిగతా వారిని హోం క్వారంటైన్‌ చేశారు. జిల్లాలోని నిర్మల్‌, భైంసాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో 14 రోజుల గడువు పూర్తవడంతో వారిని ఇండ్లకు పంపి హోం క్వారంటైన్‌ చేశారు. ఐదు రోజులుగా జిల్లాలో ఒక్క కేసు నమోదు కాకపోగా.. ఇదే పరిస్థితి మరో వారం, పది రోజులు అంటే కరోనా గండం నుంచి జిల్లా గట్టెక్కినట్లేనని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో నేటి నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపట్టాలని నిర్ణయించారు. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఇప్పటికే ఉపాధిహామీలో చేపట్టాల్సిన పనులపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కూలీలు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా రెడ్‌జోన్‌లో ఉండగా.. కర్ఫ్యూ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతుండగా.. ఇంటింటికీ కూరగాయలు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. జిల్లాలోని బాసర, ముథోల్‌, తానూ రు, కుభీర్‌, సారంగాపూర్‌, నర్సాపూర్‌(జి), కుంటాల, భైంసా మండలాలు మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రాకపోకలు సాగించకుండా దారులు మూసివేశారు. బెల్తరోడా, బిద్రెల్లి, సిర్పెల్లి చెక్‌పోస్టులను మూసివేశారు. ప్రధాన రహదారులతో పాటు గ్రామాల రోడ్లు, పిల్లదారుల వెంట నిఘా పెట్టారు. తాజాగా జిల్లాలో 32 మంది థర్డ్‌జెండర్లకు 12కిలోల చొప్పున బియ్యం, రూ.500 నగదు, కూరగాయలు అందించారు.  


logo