గురువారం 28 మే 2020
Nizamabad - Apr 18, 2020 , 00:30:16

ఇదే స్ఫూర్తితో కరోనాను తరిమికొడదాం

ఇదే స్ఫూర్తితో కరోనాను తరిమికొడదాం

  • మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 
  • క్వారంటైన్‌ సెంటర్లు, కంటైన్మెంట్‌ ఏరియాల పరిశీలన 
  • కరోనా బాధితులకు భరోసా కల్పించిన మంత్రి  

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి/బాల్కొండ/ముప్కాల్‌ : జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గంలో  పలు క్వారంటైన్‌ సెంటర్లు, కంటైన్మెంట్‌ ఏరియాలను శుక్రవారం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. భీమ్‌గల్‌ క్వారంటైన్‌ సెంటర్‌ను సందర్శించి అందులో ఉన్న వారితో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌ కింద పరిశీలనలో ఉన్న వారితో మాట్లాడి ఆందోళన చెందవద్దన్నారు. ఇక్కడ సేవలందిస్తున్న డాక్టర్లు, ఇతర అత్యవసర శాఖల సిబ్బందితో మాట్లాడారు. తగు జాగ్రత్తలు పాటించాలని వారికి సూచించారు. అనంతరం కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఇండ్లలోనే ఉండి ఇంకొన్ని రోజులు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భీమ్‌గల్‌లో కరోనా నియంత్రణ కోసం చేపట్టిన చర్యలను  డ్రోన్‌ కెమెరా ద్వారా మంత్రి పరిశీలించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని మాస్కులు అందజేశారు. ఆశ కార్యకర్తలతో మాట్లాడి వారికి కళ్లద్దాలు అందజేశారు. బాల్కొండలో కంటైన్మెంట్‌ ఏరియాలను మంత్రి పరిశీలించారు. పెర్కిట్‌లో క్వారంటైన్‌ సెంటర్‌ను పరిశీలించి  మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపు వల్లే రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందన్నారు.  భీమ్‌గల్‌ పట్టణంలో ఒక వ్యక్తికి పాజిటివ్‌ వచ్చి ఆయన భార్యకు సోకిందే తప్ప, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కమ్మర్‌పల్లిలో జిల్లా సరిహద్దు వద్ద పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును మంత్రి పరిశీలించారు. ఆయా మండల కేంద్రాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించారు. మార్గమధ్యలో పలు గ్రామాల సర్పంచులతో మాట్లాడారు. నియోజకవర్గంలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై వేల్పూర్‌లో తన నివాసంలో డివిజన్‌ స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. బాల్కొండలోని క్వారంటైన్‌లో ఉన్నవారితో మంత్రి మాట్లాడారు. వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ముప్కాల్‌లో రేషన్‌ కార్డులేని 40 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అర్చన, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, డాక్టర్‌ రవిశంకర్‌, ముప్కాల్‌ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సామ పద్మ, జడ్పీటీసీ బద్ధం నర్సవ్వ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు వెంకట్‌రెడ్డి, నర్సారెడ్డి, సర్పంచులు ఆకుల రాజారెడ్డి, ముప్కాల్‌ మండల తహసీల్దార్‌ జయంత్‌రెడ్డి, ఎంపీడీవో దామోదర్‌, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.logo