శనివారం 30 మే 2020
Nizamabad - Apr 16, 2020 , 03:40:07

లాక్‌డౌన్‌.. నో పరేషాన్‌!

లాక్‌డౌన్‌.. నో పరేషాన్‌!

  • ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారుల చర్యలు
  • కరోనా వ్యాప్తి చెందకుండా మరిన్ని జాగ్రత్తలు
  • నిత్యావసర సరుకులు, కూరగాయలు కొరత లేకుండా ఏర్పాట్లు
  • ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
  • కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో కదలికలపై నిఘా

 లాక్‌డౌన్‌ అమలుతో ప్రజలు ఏమాత్రం ఇబ్బందులకు గురి కాకుండా జిల్లా యంత్రాంగాలు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యం గా రెడ్‌జోన్‌ జిల్లాల్లోని హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఇండ్ల వద్దకే అధికారులు నేరుగా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కంటైన్మెంట్‌ ప్రాంతాలను దిగ్బంధించి పటిష్ట నిఘా కొనసాగిస్తున్నారు. కరోనా మహమ్మారి కట్టడికి యం త్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుండడంతో ప్రజలు ఊపరి పీల్చుకుంటున్నారు.

నిర్మల్‌,నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: లాక్‌డౌన్‌ పొడిగింపుతో నిర్మల్‌ జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపడుతున్నది. 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం, ఇద్దరు మృతి చెందడంతో జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలో లాక్‌డౌన్‌తో పాటు కర్ఫ్యూ అమల్లో ఉంది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజలకు కూరగాయలు, నిత్యావసరాల్లో కొరత లేకుండా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో హోల్‌సేల్‌ కిరాణా వ్యా పారులు వివిధ రాష్ర్టాల్లోని కంపెనీల నుంచి సరుకులు లారీల్లో తెప్పించుకుంటారు. సరుకు రవాణాకు ఇబ్బందులు ఎదురైతే అధికారులు రంగంలోకి దిగి మాట్లాడుతున్నారు. ఆయా కంపెనీలు, హోల్‌సేల్‌ డీలర్లతో ధరల నియంత్రణపై మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే 2.04లక్షల రేషన్‌కార్డుల లబ్ధ్దిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యం అందించడంతో పాటు రేషన్‌కార్డుదారుకు రూ. 1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు సోమవారం జమ చేశారు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న 3,241 మందికి 12కిలోల చొప్పున 389 క్వింటాళ్ల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 6,022 వలస కూలీలకు 12కిలోల చొప్పున 722 క్వింటాళ్లు పంపిణీ చేశారు. 

ఇంటి వద్దకే సరుకులు..

ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. కిలో చొప్పున నూనె, కందిపప్పు, ఉల్లిగడ్డలు, కారం పొడితో కూడిన కిట్లను రూ. 250కి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. మిర్చి, టమాట, ఆలు తదితర ఐదారు రకాల కూరగాయల ప్యాకెట్లను రూ. 100కే  అందిస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలను మున్సిపల్‌ వాహనాల్లో ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. గురువారం (నేటి నుంచి) ఇదే వాహనాల్లో చక్కెర, టీపొడి, నూనె, ఇతర నిత్యావసర ప్యాకెట్లు సైతం సరఫరా చేయాలని నిర్ణయించా రు. మరోవైపు నిర్మల్‌లోని మోర్‌, హెరిటేజ్‌, డీఎస్‌ మార్ట్‌, మారుతీ మార్ట్‌, శ్రీ హైపర్‌ మార్కెట్‌తో పాటు హోల్‌సెల్‌ వ్యాపారులు ఫోన్‌ ద్వారా హోం డెలివరీ చేయనున్నారు. లోకల్‌ విక్రయాలు చేయడానికి లేదు. ఫోన్‌ చేసిన వారికి అవసరమైన సరుకులు ఇంటికి తీసుకెళ్లి ఇవ్వనున్నారు. మరోవైపు గ్రామాల్లోని కిరాణా దుకాణాల వాళ్లకు సరుకుల కోసం పాస్‌లు జారీచేస్తున్నారు. వీరు హోల్‌సేల్‌ షాపులకు వచ్చి పాస్‌ చూపించి సరుకులు తీసుకెళ్లనున్నారు. జిల్లాలో 204కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 91 మొక్కజొన్న, 9 శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. 

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. 

జిల్లాలో నిర్మల్‌, భైంసాలో ఐసోలేషన్‌, ఐసీయూ, క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 14 కంటెన్మెంట్‌ జోన్లను గుర్తించి ఆ ప్రాంతాల్లోకి రాకపోకలు నిషేధించాం. ఈనెల 30వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు ఇంటికే ప్రత్యేక వాహనాల్లో చేరవేస్తున్నాం. జిల్లాలో ఎవరూ ఆకలితో అలమటించ కూడదన్న ఉద్దేశంతో బియ్యం పంపిణీ చేశాం. నిత్యావసర సరుకులు, రేషన్‌ బియ్యం నిల్వలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పటికప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి తెప్పిస్తున్నాం. ధరలను అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. గ్రామాల్లోనే రైతుల నుంచి ధాన్యం, మక్కలు, శనగ కొనుగోళ్లు చేస్తున్నాం.

-ముషారఫ్‌ అలీ ఫారూఖీ, నిర్మల్‌ కలెక్టర్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రత్యేక చర్యలు 

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : లాక్‌డౌన్‌ను  పొడిగించిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా నిత్యావసర సరుకుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి పౌరసరఫరాలు, రెవెన్యూ, రవాణాశాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సరుకులను అందుబాటులో ఉంచేలా చూస్తున్నారు.  వ్యాపారులు అధిక ధరలకు సరుకులు విక్రయించకుండా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి దుకాణంలో ధరల బోర్డు ఏర్పాటు చేయిస్తున్నారు. బ్లాక్‌ మార్కెటింగ్‌, కల్తీ వస్తువులు విక్రయించకుండా టోల్‌ఫ్రీ నంబరు 18004251939ను ఏర్పాటు చేశా రు. జిల్లాలో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కంటైన్మెంట్‌ ఏరియాల్లో నుంచి ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. గల్లీ వారియర్స్‌ను నియమించి ఆ ప్రాంతాల్లో  నిత్యావసర సరుకులను ఇండ్లకే సరఫరా చేస్తున్నారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ప్రత్యేకాధికారులతో కలెక్టర్‌ నిత్యం సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

సరుకుల కొరత లేకుండా చర్యలు.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా, నిత్యావసర సరుకుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిత్యావసరాల వినియోగం, సరుకుల రవాణా విషయంలో అధికారులతో చర్చించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్మకుండా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంటైన్మెంట్‌ ఏరియాల్లో వారియర్లు ఇండ్లకే సరుకులు పంపిణీ చేస్తున్నారు. రైతులు శనగ పంటను విక్రయించుకునేలా గ్రామాల్లో కొనుగోలు చేస్తున్నాం. 

- శ్రీదేవసేన, ఆదిలాబాద్‌ కలెక్టర్‌


logo