శనివారం 06 జూన్ 2020
Nizamabad - Apr 14, 2020 , 03:13:11

ప్రచండ భానుడు

ప్రచండ భానుడు

  • నాలుగు జిల్లాల్లో నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు
  • నిర్మల్‌లో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
  • లాక్‌డౌన్‌తో ఇండ్లకే పరిమితమవుతున్న ప్రజలు

 ఖలీల్‌వాడీ (నిజామాబాద్‌) : కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక వైపు లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా, మరో వైపు భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సూర్యుడి తాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలు దంచి కొడుతుండడంతో అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నిర్మల్‌లో సోమవారం 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతుండడం, ఎండలు మండుతుండడంతో మధ్యా హ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వగా, ఉదయం 10 గంటల్లోపే మార్కెట్లలో సందడి తగ్గి పోతున్నది. ఎంతటి అత్యవసరమున్నా మధ్యాహ్నం వేళ ఇల్లుదాటి వచ్చేందుకు సాహసించడంలేదు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గత ఏడాది కన్నా ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో గతేడాది రికార్డు స్థాయిలో మేలో 43.6 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో భారీ వర్షాలు పడిన నేపథ్యంలో తాగునీటికి ఇబ్బందలు అంతగా ఉండకపోవచ్చు. పిల్లలు, గర్భిణులకు ఎండలు మంచివి కావని, రక్షణ లేకుండా బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వచ్చేవారు మాత్రం ఎండవేడిమి నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. logo