శనివారం 30 మే 2020
Nizamabad - Apr 14, 2020 , 03:12:13

సరిహద్దుల్లో ‘మహా’ ముప్పు!

సరిహద్దుల్లో ‘మహా’ ముప్పు!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/బాన్సువాడ/మద్నూరు:  మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో జిల్లా సరిహద్దున  నిఘా పటిష్టం చేశారు. కామారెడ్డి జిల్లా కర్ణాటక, మహారాష్ట్రతో  సరిహద్దును కలిగి ఉంది. మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ దాటితే మహారాష్ట్ర వస్తుంది. నాందేడ్‌ జిల్లాలోని దెగ్లూర్‌ ప్రాంతం కూతవేటు దూరంలోనే ఉండడంతో జుక్కల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది. ఇక్కడ ఇప్పటివరకు సరుకు రవాణా వాహనాలను అనుమతించిన అధికారులు.. ఇకపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబోతున్నారు. కాలినడకన, మోటార్‌ సైకిల్‌, కార్లలో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించే వారిని అక్కడే నిలువరించనున్నారు. మంజీరా నది మార్గంలో ఇసుక తిన్నెలపై నుంచి రాకుండా చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీ పాలకవర్గాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. బంధాలు, బంధుత్వాల పేరుతో ఇకపై పొరుగు రాష్ర్టాలకు తిరగడం కుదరదని తేల్చిచెప్పారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే తప్పక సమాచారం చేరవేయాలని ఆదేశాలిచ్చారు. కాగా, జిల్లాలో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనా.. కొందరిలో మార్పు రావడం లేదు. కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం పక్కాగా అమలు కావడం లేదు. అన్నదానం, ఆహార పొట్లాలు, నిత్యావసరాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించే సమయంలో రెవెన్యూ, పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలి. కానీ, చాలాచోట్ల సమాచారం ఇవ్వకుండానే పంపిణీ చేస్తున్నారు. ఇక్కడా సామాజిక దూరం పాటించక పోవడంతో ప్రమాదం పొంచి ఉంది. కాగా, కామారెడ్డి జిల్లాకేంద్రంలోని దేవునిపల్లి ప్రాంతానికి చెందిన 69 ఏండ్ల వృద్ధుడికి మార్చి 31న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. ఆ వ్యక్తి ప్రస్తుతం కోలుకున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. నేడో రేపో గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జి కానున్నట్లుగా వెల్లడించారు.

కరోనా కట్టడిలో అధికారులు

బాన్సువాడ పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో యంత్రాంగం కట్టడి చర్యల్లో నిమగ్నమైంది.ఆర్డీవో రాజేశ్వర్‌, డీఎస్పీ దామోదర్‌రెడ్డి నిరంతరం ఆయా కాలనీల్లో పర్యటిస్తూ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు.

సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేయాలి: బాన్సువాడ ఆర్డీవో

కామారెడ్డి జిల్లా మద్నూరు వద్ద తెలంగాణ-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిపివేయాలని, అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ఎవరూ వెళ్లవద్దని, సరిహద్దు గ్రామాల్లో కంచెలు ఏర్పాటు వేయాలని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌ ఆదేశించారు. మద్నూరులోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం  సరిహద్దు గ్రామా ల సర్పంచులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలెవరూ బయటకు రాకుండా సర్పంచులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు, వైద్యసేవల కోసం మహారాష్ట్రలోని దెగ్లూర్‌ వెళ్లాల్సి ఉంటుందని కొందరు సర్పంచులు ఆర్డీవో దృష్టికి తీసుకురాగా.. మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ఎట్టి పరిస్థితిలోనూ దీనికి అనుమతించబోమన్నారు. వైద్యం కోసం అత్యవసరమైతే బాన్సువాడకు పంపాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ కిష్ట్యానాయక్‌, ఎంపీడీవో సాయిశ్రీ, సీఐ సాజిద్‌, ఎస్సై సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.   


logo