శనివారం 30 మే 2020
Nizamabad - Apr 14, 2020 , 03:08:36

కందకాలు తవ్వి..

కందకాలు తవ్వి..

  • మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు
  •  జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తం
  • అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద రాకపోకలు  నిషేధం 
  • రోడ్లపై అడ్డంగా కందకాలు తవ్వి, కంచెలు ఏర్పాటు చేస్తున్న సరిహద్దు గ్రామాల ప్రజలు 

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభించి ఎందరినో పొట్టన పెట్టుకుంటుండడంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్న కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. పక్కరాష్ట్రం నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కాపలా కాస్తున్నారు. నిఘాను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు సాగించకుండా రోడ్లపై అడ్డంగా కందకాలు తవ్వడం, కంచెలు ఏర్పాటు చేయడం చేస్తున్నారు.

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి/బేల/భీంపూర్‌: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండడంతో సరిహద్దుల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని జైనథ్‌, బేల, బోథ్‌, తలమడుగు, గాదిగూడ మండలాల్లోని పలు గ్రామాలు మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్నా యి. జిల్లా ప్రజలకు మహారాష్ట్ర వాసులతో సన్నిహి త సంబంధాలు ఉన్నాయి. ప్రజలు సైతం ఉపాధి కోసం అక్కడి నుంచి జిల్లాకేంద్రానికి వస్తుంటారు. వ్యాపారులు కూరగాయలు, నిత్యావసర సరుకులు సైతం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకువస్తారు. జైనథ్‌ మండలం డొల్లార, బోథ్‌ మండలం ఘన్‌పూర్‌, తలమడుగు మండలం లక్ష్మీపూర్‌, గాదిగూడ మండలం లోకారి, బేల మం డలం బెదోడ, గూడ, మణియార్‌పూర్‌, దేహగాం, కొద్ద్దూర్‌ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా.. రెండు రాష్ర్టాల ప్రజలు గ్రామాల్లోని రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. బేల మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాల నుంచి ఎలాంటి రాకపోకలు జరగకుండా రోడ్లపై కందకాలు తవ్వారు. పెన్‌గంగ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ చర్యలు తీసుకున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు ఎవరూ మహారాష్ట్రకు వెళ్లవద్దని, బంధువులను సైతం రానీయవద్దని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని సరిహద్దుల్లో స్థానికులను కాపలా పెట్టి రాకపోకలు జరగకుండా చూస్తున్నారు. ఇతర గ్రామాల ప్రజలు ఎవరైనా వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. మిగతా రహదారుల గుండా ఎవరూ రాకుండా కందకాలు తవ్వుతున్నారు. ఏఎస్పీ వినోద్‌కుమార్‌ సోమవారం సీఐ మల్లేశ్‌, ఎస్సై ఆరిఫ్‌తో కలిసి భీంపూర్‌ మండలంలో మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు కరంజి-టి, గుబిడి, అంతర్గాం సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆత్మ డైరెక్టర్‌ జి.నరేందర్‌, కపిల్‌ తదితరులు వారి వెంట ఉన్నారు. బేల ఎంపీపీ ఠాక్రే వనిత మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బెదోడ, సాంగిడి, కాంగార్‌పూర్‌, మాంగ్రూడ్‌, మణియార్‌పూర్‌, శంకర్‌గూడ సరిహద్దు గ్రామాల్లో సోమవారం కందకాల తవ్వకాలను పరిశీలించారు.  

ఇందూరులో మరో 3 కేసులు 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 52కు చేరాయి. లాక్‌డౌన్‌ను మరింత పక్కాగా అమలు చేస్తామని, ప్రజలు ఇంటికే పరిమితం కావాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు సూచించారు. సోమవారం వాయిస్‌ మెసేజ్‌ ద్వారా జిల్లా ప్రజలకు సందేశం పంపారు. సోమవారం 103 మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌ రిపోర్ట్స్‌ వచ్చాయని, అందులో వంద నెగెటివ్‌ వచ్చాయని, ముగ్గురివి మాత్రం పాటిజివ్‌ వచ్చాయని తెలిపారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన 63 మందితో పాటు వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ 389 మందివి శాంపిళ్లు పంపగా.. అందులో 13 మినహా అన్ని నివేదికలు వచ్చాయన్నారు. అందులో 52 పాజిటివ్‌ పోను.. మిగతావి నెగెటివ్‌ వచ్చాయన్నారు. కరోనా విస్తృతిని తగ్గించడానికి జిల్లా వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల సిబ్బంది శక్తివంచన లేకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో 20 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను రెడ్‌జోన్లుగా ఏర్పాటు చేసి ‘నోమూవ్‌మెంట్‌' ఆదేశాలు జారీచేశామని తెలిపారు.  


logo