గురువారం 28 మే 2020
Nizamabad - Apr 13, 2020 , 02:08:21

‘పది’ మినహా అంతా పాస్‌

‘పది’ మినహా అంతా పాస్‌

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నాయి. ఆయా దేశాల్లో లాక్‌డౌన్‌ అమలు తో సర్వం మూతపడ్డాయి. గుడులు, బడులు సైతం మనరాష్ట్రంలో తెరుచుకోకపోవడంతో విద్యార్థులకు ఎదురైన విపత్కర సమస్యకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపింది. ఒకటి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వార ఇప్పుడు ఆయా తరగతుల్లో విద్యను అభ్యసిస్తున్న వారంతా పై తరగతులకు ప్రమోట్‌ కానున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏకంగా లక్షా 30వేల 534 మంది ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జిల్లాలో 12,751 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల పరీక్షలపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. 2020-2021 విద్యాసంవత్సరంలో పరీక్షలు రాయకుండానే 9వ తరగతి నుంచి నేరుగా పదో తరగతి ప్ర మోట్‌ అవుతున్న విద్యార్థులు 13,137 మంది ఉన్నా రు. 2019-2020 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి చదువుతున్న వారు 15,447 మంది ఉన్నారు.

పరీక్షల ముంగిట కరోనా ముప్పు...

గతేడాది డిసెంబర్‌లో పుట్టిన కరోనా వైరస్‌ మెల్లిమెల్లిగా ప్రపంచ దేశాలను చుట్టేసింది. రెండు నెలల కాలంలోనే సగానికిపైగా దేశాల్లో విస్తరించిన ఈ మహమ్మారి భారతదేశంలో మార్చి నెల మొదటి వారానికి వేగం పుంజుకుంది. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ సర్కారు మార్చి 15 నుంచి పాఠశాలలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్‌హాళ్లు, ఇతరత్రా జన సమ్మర్థ ప్రదేశాలను మూసేసింది. మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూతో యావత్‌ దేశం ఇండ్లకే పరిమితం కాగా.. తర్వాతి రోజు నుంచే దేశం మొత్తం లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ఫలితంగా 2019-2020 విద్యా సంవత్సరం ముగింపునకు ప్రభుత్వం పరిష్కార మార్గం చూపింది. పదో తరగతి మినహా మిగిలిన తరగతుల్లోని విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేసింది. లాక్‌డౌన్‌ ముగియగానే 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పదోతరగతి విద్యార్థులు మాత్రం ప్రభుత్వ ప్రకటన కోసం ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.

పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ 

ఇందూరు: ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వి ద్యార్థులకు వార్షిక పరీక్షలు లేకుండా ప్రమోట్‌ చేస్తున్న ట్లు ప్రభుత్వం ప్రకటించింది.  దీంతో నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న  సుమారు 2లక్షల 30వేలకు పైగా ఉన్న విద్యార్థులకు ఊరట లభించిందని డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. 


logo