ఆదివారం 31 మే 2020
Nizamabad - Apr 13, 2020 , 02:04:25

‘కంటైన్‌మెంట్‌'పై డేగ కన్ను!

‘కంటైన్‌మెంట్‌'పై డేగ కన్ను!

  • మరోసారి ఇంటింటా ఆరోగ్య సర్వే
  • క్వారంటైన్‌ కేంద్రాలపై అధికారుల ప్రత్యేక దృష్టి
  • ఎప్పుటికప్పుడు పరిస్థితులపై సమీక్ష
  • కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల్లో రెండేసి పాజిటివ్‌ కేసులు నమోదు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. జిల్లాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఆదివారం కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల్లో  రెండేసి పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. క్వారంటైన్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: చాప కింద నీరులా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు తెలంగాణ సర్కారు లాక్‌డౌన్‌ ఈ నెల 30 వరకు పొడిగించడంతో కామారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా కంటైన్‌మెంట్‌ ప్రాంతాలపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రాకుండా ఇంటింటికీ నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మందికి కాస్త ఊరట లభించనుంది. ఇప్పటికే వరి పంట కోత దశకు చేరుతుండగా ధాన్యం మార్కెట్‌కు రాక ప్రారంభమవుతున్నది. 

కంటైన్‌మెంట్‌ ప్రాంతాలపై నిఘా...

జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు ఏర్పాటు చేయగా,  బాన్సువాడలో మూడు, కామారెడ్డిలో ఒక టి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని మరోసారి తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేయనున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులతో పాటు సహచరులు క్వారంటైన్‌ పాటిస్తున్నారా? లేదా అనే వివరాలు సేకరించనున్నారు.

బాన్సువాడలో భరోసా కల్పించేలా...

జిల్లాలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా బాన్సువాడ పట్టణంలోనే ఉన్నాయి. ఆదివారం మరో రెండు కేసులు పాజిటివ్‌ రావడంతో ఈ సంఖ్య 12కు చేరింది. వీరిలో బాన్సువాడలోనే 11 మంది, కామారెడ్డి పట్టణానికి చెందిన ఒకరున్నారు.  కేసుల సంఖ్య పెరగడంతో కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి  ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతరం అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. కంటైన్‌మెంట్‌గా గుర్తించిన మూడు ప్రాంతాల్లోని ప్రజలెవరినీ బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. పెరుగుతున్న పాజిటివ్‌ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతుండడంతో కలెక్టర్‌, ఎస్పీలు నిత్యం బాన్సువాడను సందర్శిస్తూ వారిలో ధైర్యం నింపుతున్నారు. దీనికి తోడు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం  క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.

మరింత దిగ్బంధంలో నిజామాబాద్‌

నిజామాబాద్‌/నమస్తు తెలంగాణ ప్రతినిధి: కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించడంతో  జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకు 49 పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు కలెక్టర్‌, సీపీలతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లోని కంటైన్‌మెం ట్‌ క్లస్టర్లలో పర్యటించాల్సి ఉండగా అనివార్యకారణాలతో పర్యటన రద్దయ్యింది. దీంతో కలెక్టర్‌, సీపీలను క్లస్టర్‌ ప్రాంతాల్లో పరిస్థితిని  సమీక్షించాలని మంత్రి ఆదేశించారు.   గాంధీలో పాజిటివ్‌ కేసులతో చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 29మందికి లక్షణాలు పూర్తిగా బయట పడకున్నా పాజిటివ్‌ నమోదు కావడం ఆందోళనకు గురిచేసింది. వీరి రిపోర్టులను  మళ్లీ పరిశీలించి, ఒకవేళ నెగెటివ్‌ వస్తే హోం క్వారంటైన్‌కు తరలించే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటికే 112 మందికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్‌ కేసుల్లో నెగెటివ్‌ రిపోర్టు రావడం కొంత ఊరటనిచ్చింది. మరో వంద రిపోర్టుల వరకు రావాల్సి ఉంది. మర్కజ్‌ నుంచి జిల్లాకు 63 మంది రాగా ఇందులో 32 మందికి పాజిటివ్‌ వచ్చింది. మిగతావి ప్రైమరీ కాంటాక్ట్స్‌ పాజిటివ్‌గా గుర్తించారు. మర్కజ్‌ నుంచి తిరిగి వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ 289 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు 17 మంది పాజిటివ్‌గా తేలారు. 289 మంది శాంపిల్స్‌ సేకరించి పం పారు. ఇందులో 112 నెగెటివ్‌ రాగా 130 మంది ఫలితాలు రావాల్సి ఉంది. సెకండరీ కాంటాక్ట్స్‌ కింద 531 మందిని గుర్తించారు. వీరి శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. 

68 నెగెటివ్‌ రిపోర్ట్స్‌ 

జిల్లాలో పరీక్షలకు పంపిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లలో 68 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం 45 మంది ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు సంబంధించిన శాంపిళ్లను పరీక్షల కోసం పంపించినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రజలు వారం రోజులు నిబంధనలు వంద శాతం పాటించాలని సూచించారు. జిల్లా యంత్రాంగానికి, అధికారులకు సహకరించాలని కోరారు. ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, అధికారులు కూడా కఠినంగా వ్యవహరిస్తారని, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

కామారెడ్డిలో 12కు చేరిన కేసులు

బాన్సువాడ, నమస్తే తెలంగాణ: కామారెడ్డి జిల్లాలో మరోరెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం వచ్చిన రిపోర్టుల్లో ఇద్దరు  చిన్నారులకు పాజిటివ్‌ వచ్చినట్లు బాన్సువాడ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ తెలిపారు.  దీంతో  జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12కు చేర గా, ఇందులో బాన్సువాడలోనే  11  కేసులు నమోదయ్యాయి.  గతంలో కరోనా బారిన పడిన వ్యక్తుల కుటుంబాల్లోని ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌ రావడం తో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.  ఇప్పటి వ రకు 97 మందిని క్వారంటైన్‌లో ఉంచి శాంపిల్స్‌ను పంపగా వారిలో 85 మందికి నెగెటివ్‌, 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఢిల్లీ వెళ్లొచ్చిన వారితో ప్రాథమికంగా కాంటాక్టులో ఉన్నవారికే పాజిటివ్‌ రావడం గమనార్హం.  

నిర్మల్‌లో మరో రెండు పాజిటివ్‌ కేసులు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: నిర్మల్‌ జిల్లాలో ఆదివారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసు ల సంఖ్య 19కి చేరింది. భైంసాకు చెందిన ఒక వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి రాగా.. ఆయనకు ఇప్పటికే పాజిటివ్‌ రా గా తాజాగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. సదరు వ్యక్తి భార్య, 18నెలల కుమారుడికి ప్రైమరీ కాంటాక్టు ద్వారా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. వీరినీ గాంధీ దవాఖానకు తరలించారు. జిల్లాలో పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో అధికారులు మరింత అప్రమత్తమవుతున్నారు.జిల్లాలోని వివిధ క్వారంటైన్‌లలో వంద మందికి పైగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 11 కంటైన్‌మెంట్‌ జోన్లుండగా.. ఈ ఏరియాల్లో ఇంటింటికీ కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ వందశాతం హోంక్వారంటైన్‌, రోడ్ల మూసివేత, సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే, ఇంటింటి సర్వే, సామాజిక దూరం అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే  వారిని పోలీసులు మొబైల్‌యాప్‌ ద్వారా గుర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ఎవరైనా వస్తే వారిని గుర్తించి పట్టుకుంటున్నారు. వారి నుంచి రక్తనమూనాలను సేకరించిన అనంతరం  క్వారంటైన్‌కు పంపిస్తున్నారు.


logo