శనివారం 06 జూన్ 2020
Nizamabad - Apr 09, 2020 , 03:06:25

పేద కుటుంబాలకు చేయూత

పేద కుటుంబాలకు చేయూత

  • స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి
  • ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం పంపిణీపై సమీక్ష

బాన్సువడ, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌తో పేదలకు ఇబ్బందులు తలెత్తకుం డా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిరుపేదలకు బి య్యం పంపిణీపై బుధవారం బాన్సువాడలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యంతో పాటు, నిత్యావసర వస్తువుల కోసం రూ.1500 పంపిణీకి చర్యలు ప్రారంభించిందన్నారు. అదే విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో రేషన్‌ కార్డులు లేని నిరుపేద కుటుంబాలకు 25 కిలోల చొప్పున పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 186 పంచాయతీల్లోని పేదల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గురువారం నుంచి గ్రామాలకు వాహనాల ద్వారా బియ్యాన్ని పంపనున్నట్లు తెలిపారు. నాయకులు జాబితా ప్రకారం పేదలకు బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సీఎం సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకుని బాన్సువాడ మున్సిపాలిటీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 116 మందికి వెయ్యి రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని పోచారం ట్రస్టు ద్వారా అందజేసినట్లు తెలిపారు.

సామాజిక దూరం పాటించాలి

బీర్కూర్‌: ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించి కరోనా అంతానికి కృషి చేయాలని స్పీకర్‌  పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆయన నూతన వాహనానికి ప్రత్యేక పూజలు జరిపించారు. కరోనా వైరస్‌ నివారణకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.


logo