బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Apr 08, 2020 , 02:38:23

ఇందూరులో15 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు

ఇందూరులో15 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలపై మంగళవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 39 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇందులో 21 కేసులు నగరానికి చెందినవి కాగా, మరో 18 జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందినవని తెలిపారు. వీటి పరిధిలో మొత్తం 15 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి పరిధిలో కిలోమీటర్‌ మేర ఎవరూ బయటకు రాకుండా, బయటకు వారు ఎవరూ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేకంగా ఓ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, సరుకులు కావాల్సినప్పుడు ఈ ప్రాంత ప్రజలు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసి సౌకర్యాలు పొందవచ్చని తెలిపారు. మొబైల్‌ రైతుబజార్లను వీరి వద్దకే పంపుతామని, నిత్యావసరాలు అయిపోతే అధికారులే తీసుకువెళ్లి అందిస్తారని తెలిపారు. మరికొన్ని రోజులు ప్రజలు స్వీయ గృహ నిర్బంధం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ పరిధిలో 100 ఇండ్లకు ఓ ఆశా వర్కర్‌ ఇన్‌చార్జిగా ఉండి, రెండు రోజులకోసారి పాజిటివ్‌ కేసులు నమోదైన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తారని తెలిపారు. వారిపైన ఇన్‌చార్జిలు పర్యవేక్షిస్తారని, వీరు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి నివేదిక అందజేస్తారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన పాజిటివ్‌గా తేలిన కేసుల్లో ఢిల్లీ మర్కజ్‌కు చెందినవేనని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో 547 ధాన్యం, 45 మక్కల, 10 పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి రైతులకు బాసటగా నిలుస్తున్నామని మంత్రి తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు చంద్రశేఖర్‌, బీఎస్‌ లత, సీపీ కార్తికేయ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo