శనివారం 30 మే 2020
Nizamabad - Mar 29, 2020 , 02:15:42

స్వీయ నిర్బంధంలో గ్రామాలు

స్వీయ నిర్బంధంలో గ్రామాలు

  • దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిస్తున్న కొనుగోలుదారులు 

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ / ఎల్లారెడ్డి రూరల్‌/ గాంధారి / నాగిరెడ్డిపేట్‌ / సదాశివనగర్‌ / లింగంపేట : కరోనా నేపథ్యంలో చేపడుతున్న లాక్‌డౌన్‌ శనివారం ఆరో రోజుకు చేరుకున్నది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు మెడికల్‌ దుకాణాలు, దవాఖానలు రోజంతా తెరచి ఉంచుతున్నారు. కిరాణా దుకాణాలు, పాల కేంద్రాలు, అత్యవసర దుకాణాలు అధికారులు సూచించిన సమయం వరకు తెరచి ఉంచుతున్నారు. నిత్యావసర వస్తువులు కొనేందుకు వచ్చిన వారు సామాజిక దూరం పాటిస్తున్నారు. 

ఎల్లారెడ్డి పట్టణంలోని డెయిలీ మార్కెట్‌ను తహసీల్దార్‌ స్వామి గురువారం పరిశీలించారు. వ్యాపారులు, ప్రజలతో మాట్లాడారు. అత్యవసర పనులపై బయటకు వస్తున్న వారు మాస్క్‌ తప్పక ధరించాలన్నారు. సామాజిక దూరం పాటించి కొనుగోళ్లు చేయాలని అన్నారు. కూరగాయలు అధిక ధరలకు విక్రయించవద్దని వ్యాపారులకు సూచించారు. ఎల్లారెడ్డిలోని భిక్కనూరు గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి స్థానికులకు కరోనాపై అవగాహన కల్పించారు. గ్రామానికి విదేశాల నుంచి ఎవరైనా వస్తే అధికారులకు సమాచారమివ్వాలని కోరారు. ఆయన వెంట ఉపసర్పంచ్‌ గోనె శ్రీకాంత్‌, పంచాయతీ కార్యదర్శి సాయిలు, కారోబార్‌ రాజు ఉన్నారు.     

స్టాక్‌ వివరాల సేకరణ..

ఎల్లారెడ్డి పట్టణంలోని వివిధ కిరాణా దుకాణాల్లో మున్సిపల్‌ అధికారులు ప్రదీప్‌, రాజు వస్తువుల స్టాక్‌ వివరాలపై శనివారం సర్వే నిర్వహించారు. ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువుల వివరాలు సేకరించారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ప్రజలకు సరిపడా నిత్యావసర వస్తువులు దుకాణాల్లో ఉన్నాయా, లేదా అనే విషయంపై సర్వే నిర్వహించామని అధికారులు తెలిపారు.      

పలు దుకాణాల యజమానులకు జరిమానా..

గాంధారి మండల కేంద్రంలో సర్పంచ్‌ మమ్మాయి సంజీవ్‌ శనివారం పర్యటించి కరోనాపై స్థానికులకు అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా తెరిచిఉంచిన దుకా ణాల యజమానులకు జరిమానా విధించారు. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజలు రోడ్లపైకి రాకుండా ఎస్సై శ్రీకాంత్‌, తహసీల్దార్‌ సంగమేశ్వర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.  

నాగిరెడ్డిపేట్‌ మండలంలోని తాండూర్‌ గ్రామంలో సర్పంచ్‌ గంగామణి కరోనాపై అవగాహన కల్పించారు. గ్రామంలో సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయించారు. ప్రజలు బయట తిరగవద్దని కోరారు. మండల కేంద్రంలోని కిరాణా దుకాణాల్లో సరుకుల నిల్వపై తహసీల్దార్‌ సయ్యద్‌ అహ్మద్‌ సిబ్బందితో సర్వే చేయించారు. 

కార్మికులకు కరోనాపై అవగాహన..

సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామ పరిధిలోని గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు కరోనా వైరస్‌పై ఫ్యాక్టరీ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ రావు అవగాహన కల్పించారు. అధికారుల నిబంధనల మేరకు పనులు కొనసాగుతున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో చెరుకు రైతులు ఇబ్బందులు పడకుండా రూ. 4 కోట్ల బిల్లును విడుదల చేశామని తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు ఫ్యాక్టరీలో శానిటైజర్‌ను తయారు చేయిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పీఆర్వో బస్వ పున్నారెడ్డి, ఇన్‌చార్జి గోవింద్‌, కార్మికులు పాల్గొన్నారు.

లింగంపేట మండలంలోని శెట్పల్లి సంగారెడ్డిలో సర్పంచ్‌ అనిల్‌ రెడ్డి పారిశుద్ధ్య పనులు చేయించారు. గ్రామస్తులకు కరోనాపై అవగాహన కల్పించారు.  


logo