సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Mar 28, 2020 , 02:24:32

వైద్యుడా వందనం..!

వైద్యుడా వందనం..!

  • కరోనా కట్టడిలో డాక్టర్ల అలుపెరగని పోరాటం 
  • ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న వైనం 
  • ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధుల్లో..
  • అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్న వైద్య సిబ్బంది 
  • మహమ్మారిని పారదోలేందుకు నిర్విరామ కృషి
  • ప్రత్యక్ష దైవాలని కొలుస్తున్న ప్రజలు

 కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుండడంతో ఎక్కడ చూసినా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు వైద్యులు, వైద్య సిబ్బంది. మనుషుల మధ్య అంతరాన్ని పెంచుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌పై డాక్టర్లు   అలుపెరగని పోరాటం చేస్తున్నారు. సాటి మనుషులను బతికించాలనే వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, కుటుంబాలను ఫణంగా పెట్టి రోగుల సేవలో తరిస్తున్నారు. దవాఖానలకు కరోనా అనుమానిత కేసులు వస్తేనే ఆమడదూరం పారిపోతున్న ఈ తరుణంలో.. ఆ వైరస్‌ను పారదోలేందుకు వైద్యసిబ్బంది చేస్తున్న త్యాగం అంతా ఇంతా కాదు. ‘వైద్యో నారాయణో హరి’ అనే సూక్తిని సార్థకం చేసుకుంటూ.. ప్రత్యక్ష దైవాలుగా నిలుస్తున్నారు వైద్యులు.  

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచం నేడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కరోనా వైరస్‌ మహమ్మారితో అంతటా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. మనుషుల మధ్య అంతరాన్ని పెంచుతున్న ఈ మహమ్మారిపై వైద్యులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. సాటి మనుషులను బతికించాలనే వృత్తి ధర్మాన్ని నమ్ముకున్న డాక్టర్లు... వారి కుటుంబాన్ని ఫణంగా పెట్టి ప్రజాసేవ చేస్తున్నారు. దవాఖానలకు కరోనా అనుమానిత కేసులు వస్తేనే ఆమడ దూరం జరిగిపోతున్న సందర్భంలో ప్రాణాంతక వైరస్‌ను పారదోలేందుకు వైద్యులు చేస్తున్న త్యాగం అంతా ఇంత కాదు. మార్చి 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొదలైన కరోనా కలకలంతో జిల్లాలోని వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో ఏరియా దవాఖానల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్‌ స్టాఫ్‌, 108 సిబ్బంది చేస్తున్న కృషి వెలకట్టలేనిది. అనుమానితులను గుర్తించి వారికి వైద్య సాయం అందిస్తూ జాతి క్షేమం కోసం 24 గంటలూ పాటు పడుతున్నారు. సర్వం బంద్‌ పాటిస్తున్న ప్రస్తుత సందర్భంలో తిండీ తిప్పలకు ఓర్చుకుని ప్రజల కోసం  పాటుపడుతున్నారు.

కుటుంబం కన్నా మిన్నగా...

కరోనా వైరస్‌ మూలంగా ప్రస్తుతం సమాజంలో మనుషుల మధ్య సామాజిక దూరం పెరిగింది. వైరస్‌ నివారణలో భాగంగా దూరం అనేది నివారణ చర్యగా భావిస్తున్నారు. జనతా కర్ఫ్యూ నాటి నుంచి అమలవుతున్న లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ప్రజలెవరూ బయట తిరిగే అవకాశాలే లేవు. ఎంత పెద్ద అవసరమైనా ఇంటికే పరిమితం కావాల్సిందే తప్ప చేసేదేమీ లేదు. ఇక కరోనా వైరస్‌ లక్షణాలున్నాయంటే చాలు గజగజా వణికిపోతున్నారు. ఏదేని ప్రాంతం నుంచి అనుమానితులను దవాఖానలకు తరలించడమే ఆలస్యం చుట్టు పక్కల జనమంతా వణికిపోయే దుస్థితి ఏర్పడింది. కట్టుకున్న సంబంధాలైనా, రక్తం పంచుకు పుట్టిన వారైనప్పటికీ కరోనా వైరస్‌ ముందు ఏ బంధాలు నిలవలేకపోతున్నాయి. అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు వంటి బంధాలు సైతం తోడు లేని ప్రత్యేక సందర్భంలో వైద్యులే అన్నీ తామై వ్యవహ రిస్తున్నారు. విదేశాల నుంచి కామారెడ్డి జిల్లాకు వచ్చిన సుమారు 1200 మందిని స్వీయ పర్యవేక్షణలో ఉంచి నిరంతరం వారి సేవలోనే వైద్య సిబ్బంది పని చేస్తుండడం విశేషం. కంటికి రెప్పలా వారిని చూస్తూ ఇతరులకు కరోనా వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కనిపించే దైవాలు...

కరోనా దెబ్బకు ప్రపంచమే లాక్‌డౌన్‌ అయిన ప్రత్యేక సందర్భంలో వైద్యులే మానవాళికి ప్రత్యక్ష దైవాలుగా నిలుస్తున్నారు. అన్ని మతాలకు చెందిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు మూతపడగా కేవలం ఇప్పుడు దవాఖానలే తెరుచుకుని ప్రజాసేవలో తరిస్తున్నాయి. జిల్లా కేంద్ర దవాఖానలో 24గంటలపాటు కరోనా కోసం డాక్టర్లు అప్రమత్తమై ఉన్నారు. వీరికి తోడుగా పారామెడికల్‌ సిబ్బంది తోడై నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5 సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ దవాఖానల్లో కరోనా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటయ్యాయి. ఇక హోం క్వారంటైన్‌లో ఉన్న సుమారు 12వందల మందికి 780 మంది ఆశ వర్కర్లు, 20 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 30 మంది సూపర్‌వైజర్లు, 100 మంది ఏఎన్‌ఎంలు క్షేత్ర స్థాయిలో అలుపెరగని సేవలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంలోని 13 ఆర్‌బీఎస్‌కే బృందాలు సైతం ఈ క్రతువులోనే భాగస్వామ్యం అయ్యాయి. ఇలా కరోనా వైరస్‌ బారిన పడకుండా నిరంతరం అప్రమత్తతతో వైద్యులంతా ప్రత్యక్ష దేవుళ్లుగా ప్రజలకు మేలు చేస్తున్నారు.

విస్తృత అవగాహన

ఖలీల్‌వాడి: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు  వైద్యులు, సిబ్బంది నిరంతరం కృషిచేస్తున్నారు.  వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, వైద్యులు వారి ఇంటి వద్దకు వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చంటి పిల్లాడిలా వారిని కాపాడేందుకు వైద్యులు ఎంతోగానో కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణకు నిజామాబాద్‌ జిల్లాలో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానలో 120 పడకల ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. మరో 200 పడకలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌లో 120 పడకలు, బోధన్‌లో 10 పడకలను ఏర్పాటు చేశారు. కాగా, మరో 200 పడకలను ఆర్మూర్‌, డిచ్‌పల్లి, మాక్లూర్‌, ధర్పల్లిలో ఏర్పాటు చేసేందుకు  సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌కు సంబంధించి ఓపీ సేవలను నిజామాబాద్‌ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశారు. 

అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ఏర్పాటు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు చర్య లు తీసుకుంటున్నాం. ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. వైరస్‌ కారక లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. 

- డాక్టర్‌ సుభాష్‌, కరోనా కమిటీ సభ్యుడు

ప్రజారోగ్యమే ముఖ్యం.. 

ప్రభుత్వ దవాఖానలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కరోనా వైరస్‌కు సంబంధించి ఓపీ సేవలు ప్రారంభించాం. ప్రతి రెండు గంటకోసారి  శుభ్రతను పాటిస్తున్నాం. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నాం.

- నాగేశ్వర్‌రావు, నిజామాబాద్‌ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ 

ప్రజల ఆర్యోగ సంరక్షణకు కృషి..

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషిచేస్తాం. ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే వైద్యాధికారులను సంప్రదించాలి. కరోనా వైరస్‌ ఒక్కరికి వచ్చినా వెయ్యి మందికి సోకే ప్రమాదం ఉంది. కావున ప్రజలు జాగ్రత్తగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

- డాక్టర్‌ జలగం తిరుపతిరావు, స్పెషల్‌ నోడల్‌ అధికారి 

ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తున్నాం..

జిల్లావ్యాప్తంగా ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని నియమించాం. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రభు త్వ ఆదేశాల ప్రకారం ఐసోలేషన్‌ వార్డులను పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.

- సుదర్శనం, డీఎంహెచ్‌వో నిజామాబాద్‌

భగవంతుడు ఇచ్చే శక్తితోనే...

కరోనా వంటి క్లిష్టమైన పరిస్థితులను గతంలో ఏనాడూ ఎదుర్కోలేదు. ఈ వైరస్‌ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వైద్యులందరిదీ. మేము మా వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాం. ప్రజల కోసం అలుపెరగని సేవ చేస్తున్నాం. 24 గంటల పాటు కష్టపడటానికి దేవుడే ఏదో ఒక రూపంలో మాకు శక్తిని ప్రసాదిస్తున్నట్లుగా ఉంది. ప్రజలంతా వైద్యుల కష్టాన్ని చూసైనా మాకు సహకరిస్తారని, ఇండ్ల నుంచి బయటకు రాకుండా కరోనా కట్టడికి పాటుపడతారని ఆశిస్తున్నాం.

- చంద్రశేఖర్‌, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, కామారెడ్డి

ప్రజల కోసం మేమున్నాం...

క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలంతా వైద్యులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము నిరంతరం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పని చేస్తాం. వారి ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు ప్రజలకు నైతిక బాధ్యతలున్నాయి. ఇంటికే పరిమితం కావాలన్న ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల కోసం మేమున్నాం... మా కోసం మీరు ఇంట్లో ఉండండి అనేది మా విజ్ఞప్తి.

- డాక్టర్‌ శిల్ప, కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాల

ఎల్లప్పుడూ ప్రజా సేవలోనే...

కరోనా కట్టడిలో మేమంతా సంసిద్ధులై ఉన్నాం. సాధారణ రోగులకు అత్యవసర సేవలను కొనసాగిస్తూనే ప్రపంచాన్ని వణికిస్తున్న కరో నా వంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధమై పని చేస్తున్నాం. ప్రజలంతా సామాజిక బాధ్యతగా సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవస రం ఇప్పుడుంది. ప్రభుత్వ సూచనలను పాటించి వైరస్‌ను మన నుం చి దూరం చేయాల్సిన బాధ్యత మనందరిది. ఇలాంటి ఆపత్కాలం లో ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటాం.

- డాక్టర్‌ ప్రవీణ్‌, కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన

ఇంట్లో ఉంటేనే సురక్షితం.. 

జిల్లా ప్రజలు ఇంట్లో ఉండడం సురక్షితం. కరోనా వైరస్‌ సోకిన వారిని మేము కాపాడతాం. ప్రజల ప్రాణాలను ప్రజలే కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకి రావాలి.

- డాక్టర్‌ ప్రతిమరాజ్‌, కరోనా కమిటీ నోడల్‌ అధికారిణి

సామాజిక దూరం పాటించాలి..

జిల్లావ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మూడు అడుగుల దూరం పాటించాలి. కరోనా వైరస్‌ చాలా తీవ్రమైనది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలి. అందరూ తగు జాగ్రత్తలు పాటించాలి.  

- డాక్టర్‌ గోపాల్‌సింగ్‌, కరోనా కమిటీ సభ్యుడు


logo