గురువారం 04 జూన్ 2020
Nizamabad - Mar 28, 2020 , 02:16:38

ఎక్కడివారు అక్కడే..!

ఎక్కడివారు అక్కడే..!

  • జిల్లాలో ఐదోరోజూ కొనసాగిన లాక్‌డౌన్‌
  • సాలూర, భిక్కనూర్‌ వద్ద ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న వారి అడ్డగింత
  • అర్బన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా
  • పలు ప్రాంతాలో కలెక్టర్ల పర్యటన 

జిల్లాలో శుక్రవారం ఐదోరోజూ లాక్‌డౌన్‌ కొనసాగగా.. జనం ఇంటికే పరిమితమయ్యారు. కూరగాయలు, సరుకులు, ఇతరత్రా అవసరాలు ఉన్నవారు అక్కడక్కడా బయటకు రాగా.. పోలీసులు పరిమితుల మేరకు వారిని అనుమతించారు. కాగా.. కరోనా మహమ్మారి నియంత్రణకు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతున్నది.  కలెక్టర్‌ నారాయణరెడ్డి నిజామాబాద్‌ నగరంలో కంట్రోల్‌ రూం, ఐసోలేషన్‌ వార్డును పరిశీలించారు. కామారెడ్డి కలెక్టర్‌ మద్నూర్‌ వద్ద చెక్‌పోస్టును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా అధికారులతో సమీక్ష నిర్వహించి నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితులపై ఆరాతీశారు. అందిస్తున్న సేవలకు కృతజ్ఞతగా పోలీసులు, అధికారులు, వైద్యఆరోగ్య, మీడియా సిబ్బందికి ఆయన సెల్యూట్‌ చేశారు. సరిహద్దున మంజీర నదిని దాటి మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి ప్రవేశించిన యువకులను యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. జిల్లాలో ఎక్కడా పాలు, కూరగాయలు, సరుకులకు కొరత రాకుండా, అధిక ధరలకు విక్రయించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.  

కామారెడ్డి నమస్తే తెలంగాణ / విద్యానగర్‌ / రాజంపేట / బీబీపేట / కామారెడ్డి రూరల్‌ / దోమకొండ / మాచారెడ్డి : జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పలు గ్రామాల్లో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు గ్రామాల ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు నిర్వహించారు.  

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాన, సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌, వీక్లీ మార్కెట్‌ ప్రాంతాలను అగ్ని మాపక శాఖ అధికారి దత్తు ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం నీటితో శుభ్రపరిచారు. సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌, నవాబ్‌ వెంచర్‌ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, డీఎస్పీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. మాస్క్‌లు ధరించి మార్కెట్‌కు రావాలని కొనుగోలుదారులకు సూచించారు. బాంబే క్లాత్‌ హౌస్‌ ఆధ్వర్యంలో మాస్కులు, విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సుమారు 300 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు మూసివేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని మసీదులు శుక్రవారం మూసివేశారు. ముస్లిం మత పెద్దల సూచనల మేరకు ఇండ్లలోనే నమాజ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌, కాకతీయ నగర్‌, అశోక్‌ నగర్‌ తదితర కాలనీల్లో ఆరోగ్య బోధకులు సంజీవ్‌రెడ్డి, వేణుగోపాల్‌, రాణి పర్యటించారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారి ఇండ్లకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు.  

రాజంపేటలోని పలు గ్రామాల రేషన్‌ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశారు. మండల కేంద్రంలో విధుల్లో ఉన్న పోలీసులకు సర్పంచ్‌ సౌమ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు భోజన వసతి కల్పించారు. 

బీబీపేట్‌ మండలం జనగామ మర్రి చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసు సిబ్బంది, సర్పంచ్‌ రాజు, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు సాయికుమార్‌, ఉపసర్పంచ్‌ ఎల్లం, రెవెన్యూ సిబ్బంది కాపలా కాశారు. బయట తిరగవద్దని వాహనదారులకు అవగాహన కల్పించారు. తుజాల్‌పూర్‌లో దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ జిల్లా ప్రతినిధి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి ప్రేమ్‌కుమార్‌ 125 మందికి మాస్క్‌లు పంపిణీ చేశారు. మండలంలోని ప్రభుత్వ దవాఖానను జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌ తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని శుక్రవారం ప్రారంభించారు. 

 కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో విదేశాల నుంచి వచ్చిన వారి ఇండ్లకు వెళ్లి వైద్య సిబ్బంది తనిఖీలు చేపట్టారు. 

దోమకొండ మండల కేంద్రంలోని సిండికేట్‌ బ్యాంకు వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించి లావాదేవీలు జరిపారు.       గడీకోట ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించారు. 

మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్‌ తండాలో వాహనాలు తిరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బయటకు వచ్చిన వారికి కరోనాపై అవగాహన కల్పించి తిరిగి పంపించారు.


logo