మంగళవారం 26 మే 2020
Nizamabad - Mar 27, 2020 , 02:43:31

కరోనాపై పోరులో దూరం.. దూరంగా..

కరోనాపై పోరులో దూరం.. దూరంగా..

  • కిరాణాకొట్టు, రేషన్‌ షాప్‌, మార్కెట్టు.. ఎక్కడికెళ్లినా సామాజిక దూరం పాటిస్తున్న జనం
  • ఆ మేరకు చర్యలు చేపట్టిన యంత్రాంగం
  • పల్లెలు, పట్టణాల్లో కొనసాగుతున్న దిగ్బంధం
  • పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు
  • అంతర్రాష్ట్ర సరిహదుల్లో డేగకన్ను
  • చెక్‌పోస్టులు, రోడ్లపైన పోలీసుల కాపలా
  • విదేశాల నుంచి వచ్చిన వారిపై కొనసాగుతున్న నిఘా
  • ధరల నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటు
  • బోధన్‌ రోడ్డులో సరుకులు అధిక ధరలకు అమ్ముతున్న దుకాణం సీజ్‌  
  • సమీక్షిస్తున్న కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు

జిల్లాలో గురువారం నాలుగో రోజూ లాక్‌డౌన్‌ కొనసాగింది. పోలీసులు చెక్‌పోస్టులు, ముఖ్యకూడళ్లు, రోడ్లపై కాపలా కాశారు. పలుచోట్ల జనం అనవసరంగా బయటకు రావడంతో తిరిగి ఇంటికి పంపారు. ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. కిరాణాకొట్టు, మెడికల్‌ షాష్‌, రేషన్‌ దుకాణం.. ఇలా ఎక్కడికెళ్లినా జనం సామాజిక  దూరం పాటించేలా మార్కింగ్‌ వేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా కొనసాగగా.. వారి పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్లెల్లో స్వీయ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. పలువురు తమవంతుగా అధికారులకు విరాళాలు అందజేశారు. మంత్రి, జడ్పీ చైర్మన్‌ మొదలుకొని.. గ్రామస్థాయి  ప్రజాప్రతినిధుల వరకూ అందరూ  పర్యవేక్షణ చేశారు. సరిహద్దులో నిఘా కొనసాగుతున్నది.  నిజామాబాద్‌ కలెక్టర్‌ మహారాష్ట్ర సరిహద్దున ఉన్న సాలూరా చెక్‌పోస్టును పరిశీలించారు. కామారెడ్డి కలెక్టర్‌ పలు గ్రామాల్లో పర్యటించి తాజా పరిస్థితులను పరిశీలించారు.  

కామారెడ్డి నమస్తే తెలంగాణ / విద్యానగర్‌ / రాజంపేట / బీబీపేట / కామారెడ్డి రూరల్‌ / దోమకొండ / మాచారెడ్డి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అన్ని మండలాలు, గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. గురువారం పలు గ్రామాల్లో ప్రధాన రహదారులను ముళ్ల కంచెలతో స్వచ్ఛందంగా మూసివేశారు.  గ్రామాల్లో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెడికల్‌, రేషన్‌, కిరాణా దుకాణాల వద్ద వినియోగదారులు సామాజిక దూరం పాటించి కొనుగోళ్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు.  

బీబీపేట్‌ మండల కేంద్రంతో పాటు మల్కాపూర్‌, యాడారం గ్రామాల్లో గురువారం ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి ప్రేమ్‌కుమార్‌ ఆటోలో తిరుగుతూ  మైక్‌తో కరోనాపై అవగాహన కల్పించారు. కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలో సర్పంచ్‌ చింతల రవితేజాగౌడ్‌ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ చేశారు. ట్రాక్టర్‌లో  బియ్యం, వేయింగ్‌ మిషన్‌తో ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. తిమ్మక్‌పల్లి (కే)లో ప్రజలు మీటరు దూరంలో ఉంటూ రేషన్‌ తీసుకున్నారు. అడ్లూర్‌, శాబ్దిపూర్‌, గర్గుల్‌, టేక్రియాల్‌, రామేశ్వర్‌పల్లి తదితర గ్రామాల్లో రాకపోకలు బంద్‌ చేసేలా ప్రధానరోడ్లపై కంచెలు ఏర్పాటు చేశారు.  

దోమకొండ మండల కేంద్రంలోని మెడికల్‌, కిరాణా షాపులు, సిండికేట్‌ బ్యాంకు ఎదుట ఎస్సై రాజేశ్వర్‌ గౌడ్‌, గడీకోట ట్రస్ట్‌ మేనేజర్‌ బాబ్జీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ వేయించారు. మండల కేంద్రంలోని రేషన్‌ దుకాణంలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్‌ అంజయ్య ప్రారంభించారు. సీతారాంపల్లిలో సర్పంచ్‌ నాంపల్లి విదేశాల నుంచి వచ్చిన వారి ఇండ్లకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.  

మాచారెడ్డి మండలంలోని ఫరీద్‌పేటలో వైస్‌ ఎంపీపీ నర్సింహారెడ్డి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లారు. 

కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో రాజీవ్‌ పార్క్‌ వద్ద ఉన్న మార్కెట్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ జగదీశ్‌, ఎస్సై గోవింద్‌, కౌన్సిలర్‌ అంజల్‌రెడ్డి పరిశీలించారు. కూరగాయలు ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజీవ్‌ పార్క్‌ వద్ద ఉన్న మార్కెట్‌ను శనివారం నుంచి నవాబ్‌ వెంచర్‌కు, హౌసింగ్‌ బోర్డ్‌ వద్ద ఉన్న మార్కెట్‌ను సీఎస్‌ఐ గ్రౌండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోలీసులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. జిల్లాకేంద్రంలోని బాంబే క్లాత్‌ హౌస్‌ యజమానులు రాజ్‌కుమార్‌, లాల్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు, పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. 


logo