ఆదివారం 24 మే 2020
Nizamabad - Mar 27, 2020 , 01:43:57

వ్యక్తిగత శుభ్రత ముఖ్యం

వ్యక్తిగత శుభ్రత ముఖ్యం

  • గ్రామాల్లో గంటకోసారి ‘హ్యాండ్‌వాష్‌' సైరన్‌  మోగించాలి 
  • రామనవమి సామూహిక ఉత్సవాలకు ప్రజలు దూరంగా ఉండాలి
  • ముస్లిములు, క్రైస్తవులు ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకోవాలి
  • వేల్పూరు నుంచి మంత్రి  ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి
  • పోలీసులు, వైద్య సిబ్బందికి పండ్లు పంపిణీ

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి గురువారం వేల్పూర్‌లో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు ధరించాలన్నారు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీరామనవమి సామూహిక వేడుకలకు  దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ముస్లిములు, క్రైస్తవులు తమ ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. అనంతరం మంత్రి గ్రామంలో కానిస్టేబుళ్లు, ఆశవర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల ఇంటికి వెళ్లి అభినందించి పండ్లు, బిస్కెట్లు, వాటర్‌ బాటిళ్లను అందజేశారు. ఎండలో తిరుగుతూ కరోనా వైరస్‌ మహమ్మారి గురించి అవగాహన కల్పిస్తున్న ఏఎన్‌ఎంలను అభినందించారు.  

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని, ప్రతి గంటకు ఒక్కసారైనా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి గురువారం వేల్పూర్‌లో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు,  ఎంతమంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించిన మంత్రి.. స్వయంగా అధికారులతో సమీక్షా సమావేశంలో మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గంటకు ఒక్కసారి సైరన్‌ మోగించడం, మైక్‌ ద్వారా అనౌన్స్‌మెంట్‌ చేయడం లాంటివి చేసే విధంగా గ్రామ సర్పంచ్‌, సెక్రెటరీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ సైరన్‌, మైక్‌ ద్వారా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పుడు  చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంటే కరోనా వైరస్‌  దగ్గరికి రాద్దన్నారు. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు ధరించాలని, చేతి రుమాలు, రెండు, మూడు మడతలు వేసి అడ్డుగా కట్టుకోవాలని, చేతి రుమాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని కోరారు. శ్రీరామనవమి వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. ముస్లిములు, క్రైస్తవులు తమ ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. కిరాణా కొట్టు, మెడికల్‌, రేషన్‌ షాప్‌..ఎక్కడికెళ్లినా ప్రజలు సామాజిక దూరం పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు కుటుంబంతో కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండాలని, తద్వారా వైరస్‌ లక్షణాలు ఉంటే మీ కుటుంబానికి వచ్చే అవకాశం ఉండదన్నారు. వేల్పూరులో చేపట్టిన ఏర్పాట్ల గురించి ఆరాతీసిన మంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు. 


logo