బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 26, 2020 , 02:32:18

ఎక్కడికక్కడే కట్టడి

ఎక్కడికక్కడే కట్టడి

  • నిర్మానుష్యంగా మారిన రోడ్లు
  • కరోనా ఎఫెక్ట్‌తో గ్రామాలు నిర్బంధం 
  • విదేశాల నుంచి వచ్చిన వారి పాస్‌పోర్టులు స్వాధీనం

గ్రామాల్లోని ప్రజలు ఎక్కడికక్కడే కట్టడి ‘కరోనా’ అంటూ స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. తమ గ్రామాల్లోకి రావొద్దని సరిహద్దులను మూసేశారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌లో పాల్గొన్నారు. రోడ్ల వెంట తిరిగే వాహనదారులను పోలీసులు అడ్డుకుని తిరిగి వారి గ్రామాలకు పంపిస్తున్నారు. ప్రధాన రోడ్లపై అడ్డంగా వాటర్‌ ట్యాంకులు, ట్రాక్టర్లు, ముళ్ల కంచెలు, బండరాళ్లు పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. గ్రామస్తులకు మాస్కులను పంపిణీ చేశారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అధికారులు ప్రత్యేక పికెట్‌ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో విదేశాల నుంచి వచ్చిన వారి ఇంటింటికీ తిరిగి పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో మూడో రోజూ లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది.

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ/ధర్పల్లి/జక్రాన్‌పల్లి/నిజా మాబాద్‌ రూరల్‌/సిరికొండ/ఇందల్వాయి : కరోనా ఎఫెక్ట్‌తో వేరే గ్రామాల ప్రజలు ఎవరూ తమ గ్రామాల్లోకి రావొద్దని రోడ్డుకు అడ్డంగా కర్రలు, బండలు అడ్డుగా పెట్టి బోర్డును ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా ప్రజలు తమ ఇండ్ల నుంచి బయటకు రాలేదు. డిచ్‌పల్లి మండల కేంద్రం, అన్ని గ్రామాల్లో  పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమివేయాలంటే ప్రజలు పూర్తి సహకారమందిస్తేనే సాధ్యమవుతుందని తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీవో మర్రి సురేందర్‌ తెలిపారు. ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్‌, గుడి తండా, కేశారం, రామడుగు, హొన్నాజిపేట్‌ తదితర గ్రామాల్లో  లాక్‌డౌన్‌ కొనసాగింది. హొన్నాజిపేట్‌లో ఇంటింటికీ తిరిగి విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించి 128 మంది పాస్‌పోర్టులను తహసీల్దార్‌ శ్రీధర్‌ స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నటరాజ్‌, ఎస్సై పాండేరావు, వైద్యుడు బ్రహ్మేశ్‌, సిబ్బంది ఉన్నారు. ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్‌లో టైలరింగ్‌ శిక్షకురాలు వనజ మాస్క్‌లను పంపిణీ చేశారు. తాను స్వయంగా మాస్క్‌లను కుట్టి గ్రామస్తులకు ఉచితంగా పంపిణీ చేసి వాటి వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వనజను పలువురు అభినందించారు. జక్రాన్‌పల్లి మండలంలోని ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కొలిప్యాక్‌ గ్రామంలో ఎంపీపీ డీకొండ హరిత, ఎస్సై రవి, తహసీల్దార్‌ రాజు, ఎంపీడీవో భారతి, మండల వైద్యాధికారి రఘువీర్‌ గౌడ్‌, సర్పంచ్‌, వీఆర్వోల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి కరోనాపై అవగాహన కల్పించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. రూరల్‌ మండలంలోని పలు గ్రామాలకు విదేశాల నుంచి వచ్చిన 56 మంది పాస్‌పోర్టులను ఎంపీడీవో డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌, తహసీల్దార్‌ ప్రశాంత్‌కుమార్‌ వేర్వేరుగా తమ సిబ్బందితో కలిసి బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు నగేశ్‌, అశోక్‌, నవీన్‌, ఎంపీటీసీ నరేశ్‌, విండో చైర్మన్‌ మాధవ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఉమాకాంత్‌, గంగాధర్‌, ఉమా, వీఆర్వోలు అర్చన, ఆశన్న, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. రూరల్‌ మండలంలోని మల్కాపూర్‌(ఏ), మల్లారం గ్రామాల్లో రోడ్లపై ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ధర్మారం(ఎం) గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమా ల్లో వైస్‌ ఎంపీపీ అన్నం సాయిలు, సర్పంచ్‌లు శేఖర్‌గౌడ్‌, నగేశ్‌, రాంగోపాల్‌రెడ్డి, కార్యదర్శులు ఉమాకాంత్‌, ఆనంద్‌, స్వప్న, గ్రామపెద్దలు యువకులు పాల్గొన్నారు. సిరికొండ మండల సరిహద్దును తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు. నిబంధన లు ఎవరు అతిక్రమించినా వారిపై  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందల్వాయి మండలంలో కరోనా వైరస్‌పై ప్రజలకు తహసీల్దార్‌ రమేశ్‌, ఎంపీడీవో రాములునాయక్‌, మండల వైద్యాధికారి శుభకర్‌, స్థానిక ఎస్సై శివప్రసాద్‌రెడ్డి 23 గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. మండలానికి విదేశాల నుంచి వచ్చిన 143 మంది పాస్‌పోర్టులను సీజ్‌ చేసినట్లు తెలిపారు. కల్లు గీత కార్మికులు స్వచ్ఛందంగా తమ లైసెన్స్‌లను సర్పంచ్‌, ఉప సర్పంచ్‌కు అప్పగించారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వాహనాల రాకపోకలు లేక బుధవారం నిర్మానుష్యంగా మారింది. తహసీల్దార్‌, సీఐ, ఎస్సై మండల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పికెట్‌ ఏర్పాటు చేశారు. 

మాస్కులు ధరించాలి

నిజామాబాద్‌ అర్బన్‌ : నగరంలోని శ్రద్ధానంద్‌ గంజ్‌ కూరగాయల మార్కెట్‌కు వచ్చే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ అధికారిణి స్వరూపరాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్కెట్‌లో 5 కిలోల కన్నా తక్కువ కొనుగోలు చేసేవారు మాత్రమే వెళ్లాలని తెలిపారు. రిటైల్‌గా కావాల్సిన వారు తమ దగ్గరలోని రైతుబజార్లు, గాంధీ గంజ్‌ మార్కెట్లలో కొనుగోలు చేయడానికి మాస్కులు ధరించాలన్నారు. ఎవరైనా హోల్‌సేల్‌ అమ్మకందారులు 5 కిలోల కన్నా తక్కువగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

ఐసోలేషన్‌ వార్డులో పకడ్బందీ ఏర్పాట్లు

ఖలీల్‌వాడి : జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు 14 రోజుల పాటు ఇంటి వద్ద సౌకర్యం లేని వారికి ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. దవాఖానలో డాక్టర్లు, నర్సులు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. జిల్లా లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.


logo