బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 23, 2020 , 02:13:07

శ్రమించిన పోలీసులు

శ్రమించిన పోలీసులు

  • జనతా కర్ఫ్యూ విజయవంతానికి విశేష కృషిచేసిన పోలీస్‌శాఖ
  • ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన సీపీ కార్తికేయ

నిజామాబాద్‌ సిటీ: ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం అర్ధ్దరాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ రెవెన్యూ డివిజన్లలోని తమ పోలీసు స్టేషన్ల పరిధిలో సిబ్బంది జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేలా కృషిచేశారు. ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్‌ జంక్షన్లు, ముఖ్య ప్రాంతాలు, రోడ్లు, చౌరస్తాల్లో విధులు నిర్వర్తించారు. జిల్లా సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు నిర్వహించి ఇతర ప్రాంతాల నుంచి జనం జిల్లాలోకి రాకుండా చర్యలు చేపట్టారు. ప్రధానంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో డేగకన్ను వేసి బందోబస్తు నిర్వహించారు. నిజామాబాద్‌ సీపీ కార్తికేయ ఉదయం నుంచి రాత్రి వరకు పరిస్థితిని పర్యవేక్షించారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఎక్కడాఅవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధ్ధరాత్రి వరకు పోలీసులు షిఫ్ట్‌వైస్‌గా విధులు నిర్వహించారు. డివజన్లలో ప్రధాన చౌరస్తాలో బృందాల వారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ నగరంలోని గంగాస్థాన్‌ ఫేస్‌-2లో సీపీ కార్తికేయ, అదనపు డీసీపీ రఘువీర్‌, నిజామాబాద్‌ ఇన్‌చార్జీ ఏసీపీ ప్రభాకర్‌రావు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రజలతో కలిసి చప్పట్లు కొట్టి అత్యవసర సేవల సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఈ నెల 31వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, జిల్లా సరిహద్దులను మూసివేశామని, ప్రజలు సహకరించాలని పోలీసు కమిషనర్‌ కార్తికేయ కోరారు. logo