బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 23, 2020 , 02:06:04

జన చేతనకు జై

జన చేతనకు జై

 • జనతా కర్ఫ్యూ జయప్రదం
 • స్వచ్ఛందంగా పాల్గొన్న సబ్బండ వర్ణాలు
 • జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతం 
 • ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పిలుపునకు భారీ స్పందన
 • అద్భుతమైన చైతన్యాన్ని ప్రదర్శించిన ప్రజానీకం
 • స్వచ్ఛందంగా ఇండ్లకే పరిమితమైన జనం 
 • అద్భుత దృశ్యం ఆవిష్కారం
 • పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన కలెక్టర్‌, సీపీ
 • సరిహద్దులు మూసేసిన జిల్లా యంత్రాంగం
 • అన్నిచోట్ల చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన ప్రజలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు యావత్‌ జిల్లా ప్రజానీకం ఏకతాటిపైకి వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. కరోనా వైరస్‌ కట్టడికి జిల్లా ప్రజలంతా ఐక్యత చాటి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా ప్రజలంతా ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6వరకు జనతా కర్ఫ్యూను పాటించి సహకరించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రాణాలను తీస్తున్న కరోనా వైరస్‌ను పారదోలేందుకు ప్రభుత్వాలకు స్వచ్ఛంద కర్ఫ్యూ ద్వారా ప్రజానీకం మద్ధతు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలను అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా అమలు చేసింది. కరోనా కట్టడిలో భాగంగా ఇంటి గడప దాటేందుకు  ప్రజలెవరూ ఇష్టపడలేదు. స్వీయ నిర్బంధంలోనే పిల్లా పాపలతోనే గడిపారు. ఆదివారం నాటికి అవసరమయ్యే సరుకులను ముందస్తుగానే సిద్ధం చేసుకోవడంతో ఇబ్బంది లేకుండానే కర్ఫ్యూను కొనసాగించారు. సాయంత్రం 5 గంటలకు ప్రజలందరూ ఇండ్ల బయటకు వచ్చి వైద్య ఆరోగ్య సిబ్బందికి చప్పట్లతో సంఘీభావ సంకేతం తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 31 వరకు ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని, అప్పటి వరకు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.  

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కీలక నిర్ణయం మేరకు జనతా కర్ఫ్యూ జిల్లాలో విజయవంతమైంది. దీనికి అన్నివర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది. వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలన్నీ స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. ప్రజలంతా తమ ఇంటికే పరిమితమై కుటుంబ సభ్యులతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు ఇంట్లోనే గడిపారు. టీవీలో కార్యక్రమాలు, ఆటవిడపు కోసం క్యారంబోర్డు, చెస్‌ ఆటలతో కాలక్షేపం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ , సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు సాయంత్రం 5గంటలకు ఇంటి బయటకు వచ్చి చప్పుట్లు కొట్టడం ద్వారా ఇందూరు ఐక్యతను చాటిచెప్పారు. అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,  కలెక్టర్‌, సబ్బండవర్ణాలు జనతా కర్ఫ్యూలో భాగంగా స్వీయ గృహ నిర్బంధం పాటిస్తూనే, అత్యవసర సేవలందించిన వారికి సంఘీభావం, అభినందనలు తెలుపుతూ చప్పట్ల ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ఐక్యతను చాటి చెప్పారు. జిల్లా పోలీసుశాఖ ఉదయం నుంచి రాత్రి వరకు గట్టి బందోబస్తు నిర్వహించింది. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వీధివీధిలో, సందు సందులో జనం రోడ్ల పైకి రాకుండా స్వీయ గృహ నిర్బంధం పాటించారు. తెల్లవారు జామునే బయటనుంచి పాలు కొనుగోలు చేసుకున్న ప్రజలు.. ఆ తర్వాత బయటకు వెళ్లలేదు. ఒకరోజు ముందుగానే నిత్యావసర వస్తువులు తెచ్చిపెట్టుకున్నారు. ఇంటిల్లిపాది స్వీయ గృహ నిర్బంధం పాటిస్తూ ఇండ్లలోనే కాలక్షేపం చేశారు. ఫోన్ల ద్వారా ఒకరినొకరు యోగక్షేమాలను తెలుసుకుంటూనే పలు సూచనలు చేస్తూ జాగ్రత్తలు చెబుతూ గడిపారు. మొట్టమొదటి సారిగా గ్రామాల్లో స్వీయ గృహ నిర్బంధం కనిపించింది. జనతా కర్ఫ్యూ వంద శాతం సక్సెస్‌ అయింది. కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలో బయట కనిపిస్తే జరిమానా వేస్తామని హెచ్చరికలు చేయడంతో ఎవరూ బయటకు రావడానికి సాహసించలేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఐక్యతతో పారదోలేందుకు దూరాన్ని పాటిస్తూనే.. స్వీయ గృహ నిర్బంధం ద్వారా బయటకు వెళ్లకుండా మహమ్మారిపై తమదే పై చెయ్యిగా నిరూపించుకున్నారు. తమ ఐక్యత ముందు కోరలు చాచిన ఈ రక్కసి అంతమవ్వదనే సంకేతాలు ఇచ్చారు. అత్యవసర సర్వీసులు యథావిధిగా కొనసాగాయి. దవాఖానల్లో అత్యవసర సేవలతో పాటు, పోలీసు, ఫైర్‌, పెట్రోల్‌ బంకులు యథావిధిగా విధులు నిర్వహించాయి. కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ శర్మ ఎప్పటికప్పుడు జనతా కర్ఫ్యూను సమీక్షించారు. నిజామాబాద్‌ నగరంలో సీసీ కెమెరాల ద్వారా బంద్‌ ప్రభావాన్ని వీక్షించారు. సీఎం కేసీఆర్‌ పిలుపునందుకుని ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేసి తమ ఐక్యతను చాటారు. ఆర్టీసీ బస్సులు ఉదయం నుంచే డిపోలకు పరిమితమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ప్రయాణాలు నిలిచిపోయాయి. సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి మహారాష్ట్ర నుంచి వచ్చే బస్సులను నిలిపి వేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపజేశారు. 

 సరిహద్దుల్లో అలర్ట్‌.. 

బోధన్‌ డివిజన్‌లోని బోధన్‌ పట్టణం, డివిజన్‌లోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఆదివారం జనతా కర్ఫ్యూ పూర్తిగా విజయవంతమైంది. జనతా కర్ఫ్యూతో బోధన్‌ పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడ చూసినా జనసంచారం కనిపించలేదు. బస్సులు నడపకపోవడంతో బస్టాండ్‌ నిర్మానుష్యంగా కనిపించింది. బోధన్‌ డివిజన్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చే రహదారులను మూసి వేశారు. దీంతో అక్కడి నుంచి బస్సులు, ఇతర వాహనాలు జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించలేదు. బోధన్‌ మండలం సాలూర, రెంజల్‌ మండల కందకుర్తి, కోటగిరి మండలం పోతంగల్‌ వద్ద తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు రహదారులను పూర్తిగా మూసివేశారు. సాయంత్రం 5గంటలకు బోధన్‌ పట్టణ ప్రజలు, వివిధ మండలాల్లోని ప్రజలు తమ చప్పట్లతో జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. చందూర్‌లో ఆ గ్రామం అంతా వినిపించేలా జనగణమన గేయాన్ని పాడారు. 

జాతీయ రహదారులు గప్‌చుప్‌.. 

బాల్కొండ నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, ఏర్గట్ల, వేల్పూర్‌, మెండోరా, భీమ్‌గల్‌, బాల్కొండ, ముప్కాల్‌ మండలాల్లో ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు. జనం రోడ్ల మీదకు రాకుండా ఉదయం నుంచే ఇండ్లలోనే ఉండిపోయారు. అధికారులు, పోలీసులు జనతా కర్ఫ్యూను పరిశీలించారు. బస్సులు నడవకపోవడంతో లారీలు సైతం పలుచోట్ల డ్రైవర్ల స్వచ్ఛందంగా నిలిపి వేశారు. దీంతో జాతీయ రహదారులు సహా ప్రధాన రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. సాయంత్రం అన్ని గ్రామాల్లోని ప్రజలు ఇండ్ల ముందరకు వచ్చి చప్పట్లతో మద్దతు తెలిపారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఆర్మూర్‌ పట్టణంతో పాటు నందిపేట్‌, నందిపేట్‌ రూరల్‌, మాక్లూర్‌ మండలాల్లో ప్రజలకు స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూలో పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు, దుకాణాదారులు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. అందరూ ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 5గంటలకు ఇంటిలో నుంచి ప్రజలు బయటకు వచ్చి కరతాల ధ్వనులతో సంఘీభావం తెలిపారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. అన్ని మండలాల్లో ప్రజలు, అధికారులు స్వీయ గృహ నిర్బంధం పాటిస్తూ కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఎక్కడి వారు అక్కడే ఉదయం నుంచి తమ తమ ఇండ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం వేళ పది నిమిషాల పాటు బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. అనంతరం మళ్లీ స్వీయ గృహ నిర్బంధానికి పరిమితమయ్యారు.

ప్రజల సహకారం భేష్‌

 • జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతం 
 • కలెక్టర్‌ నారాయణరెడ్డి వెల్లడి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో జనతా కర్ఫ్యూ పూర్తిగా విజయవంతమైందని, ప్రజలు అందించిన స్వచ్ఛంద సహకారం ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని కలిగిందని, జిల్లా ప్రజల సహకారం భేష్‌ అని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్‌ కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమై కరోనా వైరస్‌ అడ్డుకట్టకు సహాయ, సహకారాలు అందించారని అభినందించారు. వ్యాపారులు, మిగతా వర్గాలూ బంద్‌ పాటించి అన్నివిధాలా సంఘీభావం తెలిపారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ఎవరూ జిల్లాకు రాకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 1,750 మందిని వారి ఇంట్లోనే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. వారికి రెండు పూటలా చెకింగ్‌ చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారిని జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డుకు పంపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలు ఇచ్చిన సహకారం తమకు నమ్మకాన్ని కలిగించిందని, దురదృష్టవశాత్తు ఒకవేళ ఈ వైరస్‌ విస్తరిస్తే ఏకతాటిపై నిలిచి దానిని ధైర్యంగా ఎదుర్కొనే బలాన్ని ఇచ్చారని, వారి సహకారం చూస్తుంటే ఏ కార్యక్రమామైనా సమర్థవంతంగా నిర్వహించడానికి తమకు పూర్తి విశ్వాసం కలిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఇక ముందు  అన్నింటినీ విజయవంతం చేయడానికి కృషిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పూర్తిస్థాయిలో తమ విధులు నిర్వహించిన పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి తమ వంతుగా సంఘీభావం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కలెక్టర్‌ తెలిపారు. అత్యవసర విభాగాల ఉద్యోగులు, సిబ్బందికి ప్రజలతో పాటు తామంతా కృతజ్ఞతులైమ ఉంటామని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శన్‌, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు, వైద్యాశాఖ సిబ్బంది, డాక్టర్లు, కలెక్టర్‌ సతీమణి మనీషా, పిల్లలు స్వాతిక, శిశిర, తదితరులు పాల్గొన్నారు. logo