గురువారం 28 మే 2020
Nizamabad - Mar 22, 2020 , 02:13:10

‘మహా’ భయం!

‘మహా’ భయం!

  • పొరుగున మహారాష్ట్రలో ప్రబలుతున్న కరోనా వైరస్‌
  • సరిహద్దు ప్రాంతాలకు పొంచి ఉన్న ప్రమాదం 
  • నిత్యం మహారాష్ట్ర నుంచి వేలాది మంది రాకపోకలు 
  • సరిహద్దు గ్రామాల వివాహాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్న మరాఠాలు
  • యంత్రాంగం అప్రమత్తం .. రోడ్ల మూసివేత

బోధన్‌, నమస్తే తెలంగాణ: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ప్రబలుతుండడంతో దాన్ని ఆనుకుని ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో కలవరం ప్రారంభమైంది. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరనది తీర ప్రాంతానికి కరోనా ముప్పు పొంచి ఉండడంతో జిల్లా అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. రెండు, మూడు రోజులుగా ఈ దిశగా తీసుకుంటున్న చర్యలను శుక్రవారం మరింత ముమ్మరం చేశారు. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసులు 49 వరకు నమోదయ్యాయి. దీనికితోడు పొరుగున మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంత ప్రజలు శుచి, శుభ్రతకు పెద్దగా ప్రాధాన్యమివ్వకపోవడం జిల్లా అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో శుక్రవారం నుంచి మహారాష్ట్ర నుంచి అన్ని రహదారులు, అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విదేశాల నుంచి ఫిబ్రవరి 29 నుంచి వచ్చిన వారిని గుర్తించి, వారిని సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంచడం కోసం గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే.. విదేశా ల నుంచి వచ్చేవారితో పాటు పొరుగున మహారాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చేవారిపై కూడా నిఘా ఉంచాల్సిన అవసరాన్ని బోధన్‌ డివిజన్‌ అధికారులు గుర్తించారు. 

సరిహద్దు గ్రామాల్లో మరాఠాలతో సంబంధాలు..

మహారాష్ట నుంచి జిల్లాలో ప్రవేశించే అంతర్రాష్ట్ర రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మహారాష్ట్ర ఆర్టీసీతో పాటు మన ఆర్టీసీ బస్సు ల్లో వేలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. సరిహద్దులోని బోధన్‌, కోటగిరి, రెంజల్‌, నవీపేట్‌ మండలాల ప్రజలతో మహారాష్ట్రీయులకు సంబంధ బాంధవ్యాలు ఉన్నా యి. సరిహద్దు గ్రామాల్లోనైతే ఇక్కడివారు అక్కడి వారిని, అక్కడివారు ఇక్కడివారిని వివాహాలు చేసుకోవడం ఎక్కువగా జరుగుతోంది. నిత్యం బంధువుల ఇండ్లకు మరాఠాల రాకపోకలతో పాటు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా మరఠ్వాడాలోని బంధువులు, మిత్రుల ఇండ్లకు వెళ్లివస్తుంటారు. దీనికి తోడూ బోధన్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో మహారాష్ట్ర వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. పొరుగున నాందేడ్‌ జిల్లాలోని ధర్మాబాద్‌, కొండల్‌వాడి, బిలోలి, దెగ్లూర్‌ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చిపోతుంటారు. చివరికి మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడి కూరగాయల సంతల్లో అపరాలు, కూరగాయలు, బట్టలు అమ్ముతుంటారు. ఇక సరిహద్దు గ్రామాల్లో జరిగే అన్ని వివాహాలకు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. దీంతో ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో.. అక్కడినుంచి వచ్చేవారితో ఎక్కడ కరోనా ప్రబలుతుందోనన్న భయం ఇక్కడి ప్రజలను వెం టాడుతోంది. 

సరిహద్దు రహదారుల మూసివేత దిశగా..

మహారాష్ట్ర నుంచి వచ్చేవారితో జరిగే వివాహ వేడుకలపై అధికార యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టింది. అక్కడి నుంచి వివాహ వేడుకలకు అతిథులు పరిమితంగా వచ్చే లా చర్యలకు ఉపక్రమించారు. రెండు రోజులుగా సరిహద్దులోని బోధన్‌ మండలం సాలూర, రెంజల్‌ మండలం కందకుర్తి, కోటగిరి మండలం పొతంగల్‌ వద్ద కరోనా తనిఖీల కోసం చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అయినప్పటికీ, వేలాదిగా అక్కడి నుంచి నిత్యం వస్తున్నవారిని అదుపు చే యడం కష్టమవుతుండడంతో.. అక్కడి నుంచి జిల్లాలోకి వచ్చే రహదారులను రద్దుచేసే దిశగా జిల్లా అధికారులు యోచించారు. ఇందులో భాగంగానే శుక్రవారం రెంజల్‌ మండలం కందకుర్తి వద్ద జిల్లాలోకి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ నుంచి వచ్చే రోడ్డును పూర్తిగా మూసివేశారు. 

మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు రద్దు..

మహారాష్ట్రకు వెళ్లే బోధన్‌ డిపో బస్సులను సగానికిపైగా శుక్రవారం నుంచి రద్దుచేశారు. మరో రెండురోజుల్లో మహారాష్ట్రకు వెళ్లే అన్ని బస్సులనూ రద్దుచేయాలన్న యోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. బోధన్‌, నిజామాబాద్‌ల నుంచి మహారాష్ట్రకు వెళ్లే బస్సులను ఆర్టీసీ శుక్రవారం నుంచి రద్దుచేసింది. 


logo