గురువారం 28 మే 2020
Nizamabad - Mar 22, 2020 , 00:21:34

జనం కోసం.. జనం చేత.. జనతా కర్ఫ్యూ

జనం కోసం.. జనం చేత.. జనతా కర్ఫ్యూ

  • నేడు ఉదయం  6 నుంచి 24 గంటలపాటు అమలు
  • కరోనా రక్కసిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దండయాత్ర
  • వ్యక్తుల మధ్య సామాజిక దూరం పెంచే విధంగా చర్యలు 
  • వైరస్‌ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలకు ఏర్పాట్లు
  • ప్రజల్లో అవగాహన పెంచుతున్న జిల్లా యంత్రాంగం 
  • స్వీయ నిర్బంధమే తారకమంత్రం 
  • సిద్ధమైన జిల్లా ప్రజలు.. ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు 
  • పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి  
  • కరోనా మహమ్మారిపై పోరుకు ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ 

పాటించేందుకు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి   24గంటల పాటు పాటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దీనికి ప్రజలంతా స్వచ్ఛందంగా సమ్మతం తెలుపుతూ ఇంటికే పరిమితం కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ మేరకు అవసరమైన సరుకులు, సామగ్రిని శనివారమే సమకూర్చుకున్నారు. జిల్లా యంత్రాంగం సైతం ఆ దిశగా సిద్ధమైంది.. ప్రజలను సిద్ధం చేసింది. ఆ మేరకు అన్ని చర్యలు చేపట్టింది. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ,రైల్వే సేవలు సైతం నిలిచిపోనుండడంతో ప్రజారవాణా స్తంభించనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. యంత్రాంగాన్ని అలర్ట్‌గా ఉంచారు. స్వచ్ఛందంగా బంద్‌ పాటించేలా కృషిచేస్తున్నారు. శనివారం జిల్లాకేంద్ర బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ ప్రయాణికులు లేక బోసిపోయి కనిపించాయి. కలెక్టర్‌  నారాయణరెడ్డి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లను పరిశీలించి  పరిస్థితులు సమీక్షించారు.

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: కరోనా రక్కసిపై సర్కారు కర్ఫ్యూ అస్త్రం ప్రయోగిస్తోంది. అందరి మద్దతు, సమష్టి కృషితో కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం (నేడు) ఉదయం 6గంటల నుంచి 24గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించేందుకు సర్వం సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వ సూచనలను బలపరుస్తూ నేటి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని, ఎవరు బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 24గంటల కర్ఫ్యూతో పాటు మరుసటి రో జు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు సైతం ఈ స్వీయ నిర్బంధాన్ని కొనసాగించాలని సీఎం కోరారు. ఆదివారం బస్సులను బంద్‌ చేయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం చేపడుతున్న విస్తృత ప్రచా రం ద్వారా ఇప్పటికే జనతా కర్ఫ్యూ విషయం జనంలోకి వెళ్లిపోయింది. ఆ మేరకు అన్నివర్గాల్లో నేటి కర్ఫ్యూ పరిస్థితులకు అనుగుణంగా కావాల్సిన ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు. బయటకు వెళ్లకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టి, కావాల్సిన నిత్యావసరాలను తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పటికే పరిశుభ్రతను కుటుంబ సభ్యులంతా పాటిస్తున్నారు. బయటకు వెళితే మాస్కులు ధరించడం తప్పనిసరి గా చేస్తున్నారు. చేతులు శుభ్రపరుచుకోవడం కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఇంటిల్లిపాది సెల్‌ఫోన్లతో, టీవీ కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తూ, బయటకు వెళ్లకుండా ఉండేందుకు సాధ్యమైనంత మేర ప్ర యత్నం చేస్తున్నారు. దీంతో ప్రధాన కూడళ్లు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆదివారం జనతా క ర్ఫ్యూ నేపథ్యంలో శనివారం కొంత మార్కెట్‌ సం దడి కనిపించింది. సూపర్‌మార్కెట్లు, కిరాణా దుకాణాలు సందడిగా కనిపించాయి. సామాజిక బాధ్యతగా కనీసం ఒకరికొకరు మూడు అడుగుల దూరం పాటించాలనే నిబంధన అందరూ అనుసరిస్తున్నా రు. రైల్వేస్టేషన్‌తో పాటు జనసమూహం ఉన్న ప్రతిచోట ఈ మూడు అడుగుల దూరాన్ని పాటిస్తున్నా రు. ప్రజల్లో ఈ రెండు మూడు రోజుల నుంచి కరో నా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ముందస్తు చ ర్యల్లో భాగంగా విస్తృత అవగాహన వచ్చింది. గ తంలో కొంత నిర్లక్ష్యం కనిపించినా.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ముందస్తు చర్యలను కచ్చితంగా పాటిస్తున్నారు. ఇతరులకు పాటించాలని చెబుతున్నారు. నియంత్రణే వ్యాధి నిర్మూలనకు ప్రధాన సూత్రమనే విషయాన్ని అందరూ గుర్తించారు. అందులో భాగంగా పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం జనతా కర్ఫ్యూ విషయంలో అప్రమత్తమైంది. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఇదే విషయంపై జిల్లా యంత్రాంగానికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు ఆదేశాలు జారీచేశారు. అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో కరోనా వైరస్‌ చికిత్స నిమిత్తం ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డును పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను అదుపులో ఉంచుతున్నది. బ్లాక్‌ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారించింది. రేట్లు పెరగకుండా కట్టుదిట్టం చేస్తున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో కీలకంగా కానున్న జనతా కర్ఫ్యూ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. 

ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు?

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందితో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వి దేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారి వివరాలు పకడ్బందీగా సేకరిస్తున్నారు. వైద్యం అవసరమైన వారి ని జిల్లాకేంద్రానికి తరలిస్తున్నారు. పరిస్థితి తీవ్రత ను అనుసరించి ఏరియా ఆసుపత్రుల నుంచి అనుమానిత వ్యక్తులను నేరుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రాంతీయ దవాఖానల్లోనూ కరోనా వైరస్‌ పై చైతన్యం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ నుంచి వచ్చిన వారికి వైద్యసేవలు అందుతున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానల్లో ఏరియా దవాఖానల నుంచి వ చ్చే రోగులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యం నుంచి వచ్చే విదేశీ ప్రయాణికుల వివరా లు క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేస్తున్నా రు. విదేశాల్లో ఉండి వచ్చిన వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించడం, పరీక్షలు చేయించడం వంటివి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.

స్వచ్ఛందంగా పాల్గొనాలి...

కరోనా వైరస్‌ ప్రపంచంలో వేలాది మందికి సోకి అనేక మందిని బలి తీసుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ యుద్ధాలను మించిన నష్టాలను ఈ కనిపించని శత్రువు మిగులుస్తోంది. యావత్‌ ప్రపంచంలో వైరస్‌ ధాటికి చితికిపోతున్న దుస్థితిలో ముందస్తు జాగ్రత్తలే వైరస్‌ను నిరోధించేందుకు ఏకైక మార్గంగా నిలుస్తోంది. ఇందుకోసం తెలంగాణ  ప్రభుత్వం మార్చి 15వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు విద్యాసంస్థలు, మాల్స్‌, ఫంక్షన్‌హాళ్లు, సినిమా థియేటర్లను మూసేసింది. 20వ తేదీ నుంచి షట్‌ డౌన్‌ జాబితాలో దేవాలయాలు, అన్నిరకాల పార్కులు, జన బాహుళ్య ప్రదేశాలన్నీ వచ్చిచేరాయి. తద్వారా సామాజిక దూరాన్ని ప్రజల్లో పెంచడంతో వైరస్‌ వ్యాప్తి అనేది తగ్గించొచ్చని ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతం అవలంబిస్తోన్న చర్యలు కూడా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో అడుగు ముందుకేసి సర్వం బంద్‌ చేసి ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే మహత్తర కార్యక్రమానికి సిద్ధమయ్యాయి. ఇందులో స్వచ్ఛందంగా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి.

రైళ్లు, ఆర్టీసీ సేవలు బంద్‌...

జనతా కర్ఫ్యూలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం అర్ధరాత్రి నుంచే రైళ్ల రాకపోకలను నిలిపేస్తుంది. మరోవైపు దేశం మొత్తం విమానయానం పూర్తిగా స్తంభించబోతోంది. 22వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇప్పటికే నౌకాయానం సైతం బంద్‌ కావడంతో వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారిని ఎక్కడికక్కడ ప్రభుత్వాలు నిలువరించేలా చర్యలు చేపట్టాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజా రవాణాను ఆదివారం పూర్తిగా నిలిపేయనుంది. హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులను పూర్తిగా బంద్‌ చేస్తుండడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సేవలు సైతం నిలిపేశారు. తద్వారా ప్రజలను ఎక్కడికక్కడే కట్టడి చేసి కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి వైరస్‌ను వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు జాగ్రత్త వహిస్తున్నాయి.

ఇంటికే పరిమితం కావాలి..

ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఆదివారం ఇంటికే పరిమితం కావాలి. ప్రమాదకరమైన కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. అవసరమైతే తప్ప జనసంచార ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం మంచింది. కరోనా వైరస్‌ కట్టడికి రెవెన్యూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మావంతు కృషిచేస్తున్నాం.

 - రమణ్‌రెడ్డి, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

ప్రజల మద్దతు అవసరం.. 

కరోనా వైరస్‌ పోరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూకు ప్రజలందరూ మద్దతు తెలిపారు. కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. దీనిని నియంత్రించడానికి ప్రజలందరూ ఒక్కరోజు స్వీయ నిర్బంధం పాటించాలి. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మాశాఖ పరంగా మేముం సిద్ధంగా ఉన్నాం. 

- వెంకటరమణ, జిల్లా రవాణా అధికారి

జనతా కర్ఫ్యూ పాటిద్దాం.. 

ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాల్సిందే. వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని ఇంటి వద్దనే ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్‌ నివారణకు వ్యక్తిగత అవగాహన చాలా అవసరం. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేద్దాం. - డాక్టర్‌ ఇందిర, 

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ 

పరిశుభ్రతను పాటించాలి.. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తాం. ప్రయాణికులు ఈ విషయాన్ని గ్రహించాలి. కరోనా వైరస్‌ కట్టడికి ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు, బస్సుల్లో తగిన చర్యలు తీసుకుంటున్నాం. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించాం. రోగనిరోధక శక్తితోనే కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రోగ నిరోధకశక్తి పెంచుకునేలా కృషిచేయాలి. జనతా కర్ఫ్యూను అందరూ విజయవంతం చేయాలి.

- సోలోమాన్‌, ఆర్టీసీ ఆర్‌ఎం

ఇంటికే పరిమితమైతే మంచిది.. 

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు జనతా కర్ఫ్యూలో భాగంగా అందరూ ఇంటికే పరిమితం కావడం మంచి నిర్ణయం. దీనికి అందరూ భాగస్వాములు కావాలి. వ్యక్తిగత దూరం పాటించాలి. అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండడం మంచిది. ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యాధికారులకు తెలియజేయాలి.

- డాక్టర్‌ నాగేశ్వర్‌రావు


logo