బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 21, 2020 , 03:05:38

యంత్రాంగం అప్రమత్తం

యంత్రాంగం అప్రమత్తం

  • 23 నుంచి ‘పది’ పరీక్షలు వాయిదా  
  • ప్రార్థనా మందిరాలమూసివేత
  • ఏసీ బస్సుల్లో తగ్గిన ప్రయాణాలు  
  • ఫంక్షన్‌హాళ్లపై  డేగకన్ను 
  • నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు
  • సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా స్క్రీనింగ్‌ 
  • విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా.. అప్రమత్తత  
  • పకడ్బందీగా ముందస్తు చర్యలు 
  • ప్రజల్లో విస్తృత అవగాహన.. పరిశుభ్రతపై  పెరిగిన చైతన్యం 
  • మాస్కులు, శానిటైజర్ల  వినియోగంపై ఆసక్తి 
  • జిల్లాకేంద్ర బస్టాండ్‌ను పరిశీలించిన  కలెక్టర్‌ 

అందరినీ భయపెట్టిస్తున్న కరోనా భూతాన్ని జిల్లా పొలిమేరల్లోకి రాకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా అన్ని శాఖలను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోని ఉంది. ప్రధానంగా సరిహద్దుల నుంచి వచ్చే వారితో వైరస్‌ వ్యాప్తి ప్రమాదం పొంచి ఉంది. పక్కన మహారాష్ట్రలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. స్క్రీనింగ్‌ ముమ్మరం చేసింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది.జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనం తనిఖీ, పరీక్షలు చేసిన తర్వాతే అధికారులు అనుమతిస్తున్నారు. జిల్లావైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి గురువారం జిల్లాకేంద్ర బస్టాండ్‌లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపునివ్వడంతో ఆమేరకు జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం చర్యలు చేపడుతున్నది.    

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: అందరినీ భయపెట్టిస్తున్న కరోనా భూతాన్ని జిల్లా పొలిమేరల్లోకి చేరనీయకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ఇతర చోట్ల చోటుచేసుకున్న వైఫల్యాలను గుణపాఠాలుగా స్వీకరించి.. అలాంటి లోపాలు ఇక్కడ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం ముందు వరుసలో ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో అన్ని శాఖలను కలెక్టర్‌ నారాయణరెడ్డి అప్రమత్తం చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కరోనాపై భయోత్పాతం కలగకుండా ప్రజల్లో అవగాహన పెంచే విషయంలో సఫలీకృతులవుతున్నారు. ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నది. కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నది. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డు, సిబ్బంది పనితీరు, సౌకర్యాల ఏర్పాటుపై సమీక్షిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలిగినా హైదరాబాద్‌కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ప్రత్యేకంగా విదేశాల నుంచి వస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం నిఘా పెట్టింది. వైరస్‌ వ్యాప్తి బయట నుంచి వచ్చే వారితోనే కలగడంతో, వారిపైనే సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించింది. ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరికీ ముందు పరీక్షలు చేసిన తర్వాతే వ్యాధి లేదని నిర్ధారణ అయితేనే ఇంటికి పంపుతున్నారు. దీంతో జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ఉంది. ప్రధానంగా సరిహద్దుల నుంచి వచ్చే జనం ద్వారా వైరస్‌ వ్యాప్తి ప్రమాదం పొంచి ఉండడంతో , ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహారాష్ట్రలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను అలర్ట్‌ చేసింది. బోధన్‌ మండలంలోని సాలూర వద్ద ఉన్న చెక్‌పోస్టును మరింత కట్టుదిట్టం చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. అక్కడి నుంచి వచ్చే ప్రతి వాహనం తనిఖీ, పరీక్షలు చేసిన తర్వాతే జిల్లాలోకి అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్‌ నుంచి నిజామాబాద్‌ జిల్లాకు వచ్చే మార్గంలో, కరీంనగర్‌ నుంచి జిల్లాకు వచ్చే రహదారుల్లో నిఘా పెడుతున్నారు. పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోపక్క ప్రజల్లో కూడా కరోనా వైరస్‌పై విస్తృత అవగాహన పెరుగుతున్నది. మాస్కులు ధరించడం, శానిటైజర్‌ ఉపయోగించడం, జనసమూహం ప్రాంతాల్లోకి వెళ్లక పోవడం, ఇంటికి పరిమితం కావడం, కుటుంబ సభ్యుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటూ పరిణతి ప్రదర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటూ, మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతోపాటు పలువురికి వ్యాధి నియంత్రణపై అవగాహన కలిగించేలా చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎస్సెస్సీ పరీక్షలను సైతం ప్రభుత్వం వాయిదా వేసిం ది. ఇప్పటికే విద్యాసంస్థల బంద్‌తో పాటు జనసమూ హం కలిగిన వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. దేవాలయాలు, చర్చిలు, మసీదులు బంద్‌ పాటిస్తున్నాయి. కేంద్రం సైతం పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈ ఆదివారం జనతా కర్ఫ్యూను ప్రజలే స్వచ్ఛందంగా పాటించాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఇప్పటి నుంచే అప్రమత్తమయ్యారు. కిరాణా షాపులు, సూపర్‌ మార్కెట్ల ద్వారా ముందస్తుగా.. కావాల్సిన నిత్యావసర వస్తువులను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఏటీఎంల ద్వారా కావాల్సిన నగదును అందుబాటులో ఉంచుకుంటున్నారు. సూపర్‌ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, తదితర నిత్యావసర సరుకులు దొరికే కేంద్రాలను తెరిచే ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, భయోత్పాతం కల్పించే ప్రచారాలను నమ్మవద్దని  యంత్రాం గం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నది. 

ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత చర్యలు... 

ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత చర్యలు చేపడుతున్నారు. వైరస్‌ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉన్న బస్టాండ్‌, ప్రయాణించే బస్సుల్లో ఎప్పటికప్పుడు శుభ్రతా చర్యలు చేపడుతున్నారు. ముందస్తుగా వ్యాధి నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కలెక్టర్‌ నారాయణరెడ్డి జిల్లాకేంద్ర బస్టాండ్‌ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సుల్లో, ప్రయాణికులు కూర్చుండే సీట్లలో స్ప్రే చేస్తున్న శానిటైజర్‌ను పరిశీలించారు. బస్సులో ఎక్కుతుంటే క్యూ పద్ధతిలో దూరం దూరంగా ఉంటూ వెళ్లాలని ప్రయాణికులకు కలెక్టర్‌ సూచించారు.   

సామాజిక బాధ్యతతో వ్యవహరిద్దాం: కలెక్టర్‌ 

కరోనా వైరస్‌ను దూరంగా ఉంచడానికి ప్రజలు స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాలని, మనిషికి మనిషికి మధ్య కనీసం మూడు అడుగుల దూరం పాటించాలని, బయటకు వెళితే చేతి రుమాలు కానీ, మాస్కులు కానీ ధరించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వయంగా ఇండ్లల్లో దూరంగా ఉండడంతో పాటు పదిహేను రోజుల పాటు బయట తిరగవద్దు అని సూచించారు. ఇందుకు గాను గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో టీమ్‌ను ఏర్పాటు చేశామని, వారు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని, జాగ్రత్తలు తెలియజేస్తున్నారని తెలిపారు. గ్రామానికి వచ్చిన వారు గాని, గ్రామస్తులకు కానీ జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు ఉంటే డాక్టర్లకు చూపించాలని కోరారు. వారిని పదిహేను రోజుల పాటు చికిత్సతో పాటు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా వైరస్‌ను కట్టడి చేయగలుగుతామని తెలిపారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గుడ్డను నోటికి అడ్డంగా పెట్టుకోవాలన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి సుమారు 964 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చినట్లు గుర్తించామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. వారికి పరీక్ష నిర్వహించగా.. ఆరుగురికి అనుమానంగా ఉండడంతో.. ఐదుగురిని ప్రభుత్వ దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డులో చేర్పించామని, ఒకరిని గాంధీ దవాఖానకు పంపించామన్నారు. జిల్లా సరిహద్దులోని మూడు చెక్‌ పోస్టుల వద్ద  చెకింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. దుబాయ్‌ నుంచి జిల్లాకు వచ్చిన ఓ ప్రయాణికుడితో మాట్లాడారు. అతనికి ఈ లక్షణాలు లేవని, అతని చేతికి వేసిన ముద్రను పరిశీలించారు.  జాగ్రత్తగా ఉండాలని అతనికి సూచించారు. ఆయన వెంట ఆర్‌ఎం సోలోమాన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం ఉన్నారు. 

భయాందోళన వద్దు..

కరోనా వైరస్‌ మహమ్మారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యాన్ని వీడి స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.  ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలి. ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియాలో వచ్చే అసత్యపు ప్రచారాలు, వదంతులు నమ్మవద్దు.   అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. 

- వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి  

964 మందికి పరీక్షలు పూర్తి..

ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 964 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చినట్లు గుర్తించాం. వారికి పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి అనుమానంగా ఉండడంతో.. ఐదుగురిని ప్రభుత్వ దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డులో చేర్పించాం. ఒకరిని గాంధీ దవాఖానకు పంపించాం. 

-నారాయణరెడ్డి, కలెక్టర్‌


logo