సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Mar 20, 2020 , 01:53:21

పది పరీక్షలు షురూ..

పది పరీక్షలు షురూ..

  • తొలిరోజు 52మంది విద్యార్థులు గైర్హాజరు 
  • కరోనా వైరస్‌ ప్రభావంతో 
  • మాస్క్‌లతో హాజరైన విద్యార్థులు
  • సెంటర్లను తనిఖీ చేసిన డీఈవో

పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జిల్లాలో ప్రశాంతంగా పరీక్ష ముగిసింది. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ తెలుగు పేపర్‌ -1 ను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు నిర్వహించారు. జిల్లాలో 138 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 23,543 మంది విద్యార్థులకు గాను 23,491 మంది హాజరైనట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. పలు కేంద్రాలను డీఈవో తనిఖీ చేశారు.

ఇందూరు: పదో వార్షిక తరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ తెలుగు పేపర్‌ -1 ను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు నిర్వహించారు. జిల్లాలో 138 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 23,543 మంది విద్యార్థులకు గాను 23,491 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈవో జనార్దన్‌రావు పేర్కొన్నారు. 52 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షా కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలకు సమయానికి ప్రశ్న పత్రాలను అందజేశామన్నారు. డీఈవో నాలుగు పరీక్షా కేంద్రాలను, జిల్లా లెవల్‌ అబ్జర్వర్స్‌ నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు 38 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. మొదటి రోజు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించారు.

యూనిఫామ్‌తో రావడంతో అభ్యంతరం...

కోటగిరి: మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు స్కూల్‌ యూనిఫామ్‌తో పదో తరగతి పరీక్షలకు హాజరు కావడంతో జిల్లా పరిశీలకుడు శ్రీనివాస్‌రావు అభ్యంతరం తెలిపారు. గురువారం పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గల పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేయగా.. ఈ కేంద్రంలో పలువురు విద్యార్థులు ఒకే రకమైన డ్రెస్‌కోడ్‌తో పరీక్షకు హాజరయ్యారు. దీంతో వీరిని పరీక్షలకు యూనిఫామ్‌తో ఎలా అనుమతించారని అక్కడి అధికారులను ప్రశ్నించారు. డ్రెస్‌కోడ్‌పై ఆయన అభ్యంతరం తెలుపుతూ వీటిపై విచారణ చేయాలని విజిట్‌ రిజిస్టర్‌లో రాసినట్లు సమాచారం.

పరీక్షలు యథాతథం..

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ ప్రభావంతో విద్యాసంస్థలకు ఈనెల 31 వరకు సెలవులు ప్రకటిస్తూ జీవోను విడుదల చేసినప్పటికీ, ఇది వరకే పదో తరగతి విద్యార్థుల పరీక్షల షెడ్యూల్‌ ఖరారు కావడంతో పరీక్షలను సెలవుల నుంచి మినహాయించారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లు, సీపీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్‌ దిశగా టాయిలెట్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో బ్లీచింగ్‌ చల్లడంతో పాటు డెస్క్‌ బెంచీలను రోజు వారీగా శుభ్రం చేయాలని సూచించారు.


logo