గురువారం 28 మే 2020
Nizamabad - Mar 20, 2020 , 01:49:13

‘కరోనా’ ఎఫెక్ట్‌

‘కరోనా’ ఎఫెక్ట్‌

  • బోధన్‌లో నాలుగు ఫంక్షన్‌హాళ్ల సీజ్‌ 
  • గ్రామాల్లో పర్యటిస్తున్న వైద్యసిబ్బంది
  • సరిహద్దుల్లో ముమ్మరంగా స్క్రీనింగ్‌
  • సంతలు, ఆలయాల మూసివేత
  • అలర్ట్‌గా ఉంటున్న యంత్రాంగం
  • బోధన్‌ పట్టణంలో నాలుగు ఫంక్షన్‌హాళ్లు సీజ్‌

బోధన్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించిన బోధన్‌ పట్టణంలోని నాలుగు ప్రధాన ఫంక్షన్‌హాళ్లపై అధికార యంత్రాం గం కొరడా ఝళిపించింది. ఈ నాలుగు ఫంక్షన్‌ హాళ్లను రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు గురువారం సా యంత్రం సీజ్‌చేశారు. ముందుగా పట్టణ శివారులోని రమాకాంత్‌ ఫంక్షన్‌హాల్‌ను బోధన్‌ ఆర్డీవో గోపీరాం, ఏసీ పీ జైపాల్‌రెడ్డి తనిఖీచేశారు. ఆ సమయంలో ఆ ఫంక్షన్‌ హాల్లో జరుగుతున్న ఒక వివాహ వేడుకలో నిబంధనలకు విరుద్ధంగా వేలాది మంది ఉండడం చూసి ఆశ్చర్యపోయా రు. పట్టణంలోని మిగతా ఫంక్షన్‌ హాళ్లలో కూడా పరిమితికి మించి అక్కడి శుభకార్యాల్లో ప్రజలు గుమిగూడి ఉ న్నారన్న సమాచారం వారికి అందింది. దీంతో ఆ ఫంక్షన్‌ హాళ్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆర్డీవో గోపీ రాం, ఏసీపీ జైపాల్‌రెడ్డి, బోధన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.శివానందం సమక్షంలో రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు రమాకాంత్‌ ఫంక్షన్‌ హాల్‌ను సీజ్‌చేశారు. అనంతరం వరుసగా పట్టణంలోని రవి గార్డెన్స్‌, ఆచన్‌పల్లిలోని అప్నా ఫంక్షన్‌ హాల్‌ను, ఏఆర్‌ గార్డెన్స్‌ను అధికారులు సీజ్‌చేశారు. ఆయా ఫంక్షన్‌హాళ్లలో ఆ సమయంలో వివాహ వేడుకలు ముగింపు దశలో ఉన్నాయి. వివాహాలకు హాజరైనవారంతా వెళ్లిపోయిన తర్వాత ఆయా ఫంక్ష న్‌ హాళ్లకు తాళాలు వేశారు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ముందుగానే ఫంక్షన్‌ హాళ్లలో బుక్‌ అయిన వివాహాలు, శుభకార్యాలకు ఈ నెల 31 వరకు షరతులతో కూ డిన అనుమతులు ఇస్తూనే.. వేడుకల్లో 200 మంది కంటే ఎక్కువ ఉండరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసి న విషయం తెలిసిందే. ఈ నిబంధనను బేఖాతరు చేస్తూ.. ఫంక్షన్‌ హాళ్లలో జరిగే వేడుకలకు రెండు, మూడు రోజులు గా వేలాది మంది హాజరవుతుండడం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు బోధన్‌ డివిజన్‌ అధికార యంత్రాంగం దిగింది. ఫంక్షన్‌ హాళ్ల సీజ్‌లో బోధన్‌ సీఐ పల్లె రాకేశ్‌, మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

కరోనాపై గ్రామాల్లో దండోరా

రెంజల్‌: కరోనా వైరస్‌ వ్యాపించకుండా అధికారులు దండోరా వేయించినట్లు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా శుభకార్యాలు, జాతరలకు వెళ్లకూడదని, ఉపాధి కోసం విదేశాల నుంచి తిరిగి వచ్చే వివరాలను  మండల అధికారులు సమాచారం అందించాలని దండోరా వేయించి మండల  ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులో కరోనా వ్యాపించకుండా వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం సమన్వయంతో  చర్యలు తీసుకుంటున్నది. రెంజల్‌ మండలం కందకుర్తి సమీపంలో గురువారం ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్‌ అసదుల్లాఖాన్‌ తెలిపారు. మహారాష్ట్రలో 39 కేసులు నమోదు కావడంతో మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్నీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. వారి పూర్తి వివరాలను సిబ్బంది నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చీపోయే వారికి వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, సలహాలు అందిస్తున్నారు. సాటాపూర్‌ గ్రామంలో శనివారం నిర్వహించే వారాంతపు సంతను రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు. కందకుర్తి తనిఖీ కేంద్రాన్ని బోధన్‌ రూరల్‌ సీఐ షకీర్‌అలీ, ఎంపీడీవో గోపాలకృష్ణ, వైద్యాధికారిణి డాక్టర్‌ క్రిస్టినా, రెంజల్‌ ఎస్సై శంకర్‌ పరిశీలించారు. 

సాలూర చెక్‌పోస్ట్‌ వద్ద రెండోరోజూ తనిఖీలు 

బోధన్‌, నమస్తే తెలంగాణ : బోధన్‌ మండలం సాలూర గ్రామం శివారులోని తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక చెక్‌ పాయింట్‌ వద్ద రెండోరోజూ గురువారం కూడా వైద్యశాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బోధన్‌ ఆర్డీవో గోపీరాం ఆధ్వర్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి సరిహద్దు దాటి రాష్ట్రంలోకి ప్రవేశించే బస్సులు, వాహనాలను ఆపుతూ.. వారిలో కరోనా లక్షణాలున్న ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో తనిఖీలు చేశారు. కరోనా వైరస్‌ సోకే విధానం, దాని ప్రభావంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. 


logo