బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 19, 2020 , 04:16:09

నేటి నుంచి ‘పది’ పరీక్షలు

 నేటి నుంచి ‘పది’ పరీక్షలు

  • అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన విద్యాశాఖ 
  • 135 సెంటర్లు ఏర్పాటు
  • పరీక్ష రాయనున్న 23,520 మంది విద్యార్థులు 
  • కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధింపు
  • నిమిషం నిబంధనకు నేడు సడలింపు

ఇందూరు: పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రావు తెలిపారు. ఈనెల 19 నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలను సీఎస్‌, డీవోలు పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. ఎస్సెస్సీ పరీక్షల కోసం 138 సీఎస్‌లు, 138 డీవోలను, ఇన్విజిలేటర్లుగా స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ ఉపాధ్యాయులను నియమించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా సీసీ కెమెరాలను పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రీఫైనల్‌ పరీక్షలు పూర్తి చేసుకొని గ్రాండ్‌ టెస్టులు రాశారు. విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 135 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 23,520 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. స్కూళ్లతో పాటు కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను కూడా సెంటర్ల కోసం వినియోగిస్తున్నారు. ఒకేషనల్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల్లో డెస్క్‌ బెంచీలు, తాగునీటి వసతి, టాయిలెట్లు, ఇతర సౌకర్యాలకు కల్పిస్తున్నారు.  

ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. సెంటర్ల వద్ద జిరాక్స్‌ సెంటర్లు మూసివేయబడతాయి. దూర ప్రాంతాల విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నది. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. సెకండ్‌ లాంగ్వేజ్‌ హిందీకి మాత్రం ఉదయం 9.30 గంటలకు నుంచి  మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. బుధవారం డీఈవో కార్యాలయంలో 21 మంది ప్లయింగ్‌ స్వాడ్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫ్ల్లయింగ్‌ స్కాడ్స్‌ విధుల గురించి అవగాహన కల్పించారు. అనంతరం అన్ని కేంద్రాల్లో హాల్‌ టికెట్ల నంబర్లను వేశారు. 

ఏ స్కూళ్ల నుంచి ఎంతెంత మంది...

 జిల్లా పరిషత్‌ స్కూల్స్‌ 8,771, ప్రభుత్వ పాఠశాలలు 1,277, కేజీబీవీ పాఠశాలలు 801, మోడల్‌ స్కూళ్లు                          987, సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లు  549, ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లు   49, మైనార్టీ వెల్ఫేర్‌ స్కూళ్లు   175, రెసిడెన్షియల్‌ స్కూళ్లు        234, బీసీ వెల్ఫేర్‌ స్కూళ్లు  76, ఎయిడెడ్‌ స్కూళ్లు 596, ప్రైవేట్‌ ఆన్‌ఎయిడెడ్‌ స్కూళ్లు 9,905, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు  08 విద్యార్థుల చొప్పున మొత్తం 23,520 మంది పరీక్షలు రాయనున్నారు.

 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు ...

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు, ఫిర్యాదులు ఉంటే 08462 - 295302 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని డీఈవో జనార్దన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులకు ఉదయం 8.30 గంటలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.  9.30 గంటల వరకు లోనికి అనుమతినిస్తామని, ఒకవేళ ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఈ ఒక్కరోజే(గురువారం) అనుమతిస్తామని తెలిపారు.  పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురావద్దని సూచించారు. విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో, ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా ఉత్సాహంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఈనెల 20 నుంచి ఉదయం 9.30 గంటల లోపలే సెంటర్‌కు రావాల్సి ఉంటుందని, విద్యార్థులు తమ పాఠశాలకు సంబంధించిన యూనిఫారం వేసుకోవద్దని సూచించారు.   


logo