గురువారం 28 మే 2020
Nizamabad - Mar 17, 2020 , 08:01:29

పదికి ‘పది’ సాధ్యమే

పదికి ‘పది’ సాధ్యమే
  • విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలి
  • పరీక్షలకు ముందు బట్టీ వద్దు...

ఎల్లారెడ్డి రూరల్‌: పదో తరగతి వార్షిక పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో 12,751 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు కఠినంగా భావించే గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్ల పరీక్షల్లో సమాధానాలు ఎలా రాయాలనే అంశాలపై ప్ర భుత్వ ఉపాధ్యాయులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పరీక్షలంటేనే విద్యార్థుల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. ఈ నేపథ్యంలో అనవసర ఆందోళనకు గురై పరీక్షల్లో తప్పుతుంటా రు. దీంతో తాము ఇక జీవితంలో ఏదీ సాధించలేమనే భయం తో వణికిపోతుంటారు. మనస్సులో భయాన్ని దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఆలోచించి పరీక్షలు రాస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. ఉపాధ్యాయులు సూచించిన మార్గాలను అందిపుచ్చుకొని విజయ తీరాలను చేరవచ్చు. 

తెలుగు: ఐదు అంశాలపై పట్టు అవసరం...

తెలుగులో అవగాహన - ప్రతిస్పందన, స్వీయరచన, సృజనాత్మకత, పదజాలం, వ్యాకరణంపై పట్టు సాధించాలి. భాషా దోషాలు లేకుండా, కొట్టివేతలు, దిద్దుబాట్లు లేకుండా కుదిరించి రాయడం నేర్చుకోవాలి. ఆకర్షణీయంగా రాయాలి. చుక్కగుర్తు గల 15 పద్యాలను కంఠస్థం చేసి తాత్పర్యాలను ధారణ చేయాలి. దీంతో ప్రతిపదార్థం రాయగలిగితే నైపుణ్యం కూడా వస్తుంది. పుస్తకంలోని పేరాలను చదివి, చిన్న చిన్న ప్రశ్నలను తయారు చేయడం, అభ్యాసం చేయాలి. దీంతో 10 మార్కులు సులభంగా సంపాదించే అవకాశం ఉంది. వాచకం వెనుకవైపు ఉన్న పదవిజ్ఞానంలోని పదాలను తరచుగా చూస్తుండాలి. చంపకమాల, ఉత్పలమాల, మత్తేభము, శార్ధులము, వృత్త పదాల లక్షణాలను గుర్తించగలగాలి. లేఖ రాసినపుడు ఒక పేజీలో రాయాలి. తేదీ, ఊరు రాసి అనుకరణ చిహ్నాలు పాటిస్తూ చివరకు ఒక డబ్బాలో చిరునామా రాయాలి. కరపత్రం వస్తే శీర్షిక , సంబోధన ఉండేలా రాస్తూ చివరగా ముద్రించిన వారి పేరు మరువకుండా  ఒక పేజీలో అందంగా ఆకర్షించేలా రాయాలి. సంభాషణ రాయమంటే చిన్నచిన్న వాక్యాలతో సారాన్ని రాబట్టేలా రాస్తే సరి.

- అయ్యవారు మురళి, తెలుగు ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల, ఎల్లారెడ్డి

హిందీ: మాదిరి ప్రశ్నాపత్రాలపై దృష్టి సారించాలి

ద్వితీయ భాష హిందీ ప్రశ్నాపత్రంలో ఏ విభాగం, బీ విభాగంలో మార్కులుంటాయి. ఏ విభాగంలో ప్రశ్నలు బిట్ల లో ఇస్తారు. ఈ బిట్లను సమగ్రంగా సాధన చేసి అవగాహన చేసుకుంటే మంచి మార్కులు పొందవచ్చు. మాదిరి ప్రశ్నాపత్రాలను సాధన చేయాలి. 1 నుంచి 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే గద్యం, పద్యాన్ని పూర్తిగా చదివి దానిని అర్థం చేసుకొని అభ్యసించాలి. పద్యభాగం, గద్యభాగం నుంచి కవి పరిచయం కచ్చితంగా నేర్చుకోవాలి. గద్య,పద్య పాఠ్యాంశాల, వ్యాకరణాంశాలకు సంబంధించి బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. సృజనాత్మకతకు సంబంధించి వ్యాసం, కథ, సంభాషణ, నినాదాలు, డైరీ, లేఖ, ముఖాముఖి, కవితారచన, సూక్తులు, కరపత్రాలు, గోడపత్రిక, వినతిపత్రాలు రాయడంపై పట్టు సాధించాలి. జాతీయ పదాలు, పర్యాయపదాలు, నానార్థాలు, పునరుక్తి పదాలు, వాక్యరచన, వ్యతిరేక పదాలు తదితర అంశాలపై పట్టుసాధిస్తే మార్కులు సులువే..

- ఎం.ఏ బారీ, హిందీ ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల, ఎల్లారెడ్డి

ఇంగ్లిష్‌: పదాలకు వాక్య రూపమిస్తే సరి..

ఆంగ్ల పరీక్ష అంటే తెలుగు మీడియం విద్యార్థులకు భయం.  తమకు ఇంగ్లీషు రాదన్న అపోహ రాకుండా చూసుకోవాలి. రో జువారీ తెలుగుపద ప్రయోగంలోనే చాలా వరకు ఆంగ్ల పదా లు దొర్లుతాయి. సరైన క్రమంలో  సందర్భానుసారంగా వాక్యరూపంలో వినియోగిస్తే ఆంగ్లభాషపై పట్టు సాధించినట్టే. పదో తరగతి పరీక్షల్లో ఆంగ్ల పేపరులో మూడు భాగాలుంటాయి. రీడ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. (ఒకాబులరీ అండ్‌ గ్రామర్‌)  పదజాలం, వ్యాకరణం, క్రియేటివ్‌ రైటింగ్‌ (సృజనాత్మకంగా రాయడం) పేపర్‌-1లోని అంశాలన్నీ పాఠ్యపుస్తకం ఆధారంగా వస్తాయి. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను విని ప్రతి పాఠ్యాంశాన్ని మూడుసార్లు చదవాలి. దీంతో రీడ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో అంశాలను సులభంగా  అర్థం చేసుకొని రాయగలుగుతారు. క్రియేటివ్‌, రైటింగ్‌ విషయానికి వస్తే విద్యార్థులు సాధ్యమైనంత ఎక్కువ డిస్కషన్‌ను ప్రతిదినం రాసి సాధన చేయాలి. పేపర్‌-2లో పాఠ్యపుస్తకంలో లేని అంశాలు వస్తాయి. విద్యార్థులు ఏ మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నారో పరీక్షించడం జరుగుతుంది. విద్యార్థులు సాధ్యమైనన్నీ ఇతర కథల పుస్తకాలు, పద్యాలు చదివి అర్థం చేసుకోవాలి.  వ్యతిరేక పదాలను, అర్థాలను, క్రియా పదాలను వివిధ వాడుక రూపాల్లో   నేర్చుకుంటే చాలా వరకు పదజాలం వచ్చినట్లే. వ్యాకరణంలో యాక్టివ్‌ వాయిస్‌ నుంచి ప్యాసివ్‌ వాయిస్‌, డైరెక్ట్‌ నుంచి ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, డిపైనింగ్‌, నాన్‌ డిపైనింగ్‌ రిలేటివ్‌ క్లాజ్‌ వంటివి ఎక్కువగా నేర్చుకోవాలి. 6,7,8,9 తరగతుల్లో అంశాలు (కథలు-పద్యాలు) ఇస్తారు.  

- సిద్ధిరాములు, ఆంగ్ల ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల, ఎల్లారెడ్డి.

జీవశాస్త్రం: చదవాలి.. విశ్లేషించాలి....

జీవశాస్త్రంలో పాఠ్యపుస్తకాన్ని బాగా చదివి విద్యా ప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలి. అంతర్గత ప్రశ్నలు, కీలక పదాలను ఆకలింపు చేసుకొని విశ్లేషించగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. విద్యా ప్రమాణం-1 విషయ అవగాహనల్లో విశ్లేషనాత్మక ప్రశ్నలు, బేధాలను తెలిపే ప్రశ్నలు, పోల్చే ప్రశ్నలు, కారణాలు తెలిపే ప్రశ్నలు ఉంటాయి. విద్యాప్రమాణాలు-2లో  ఆలోచించే ప్రశ్నలు, ఊహించి సమాధానాలు రాసే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. విద్యా ప్రమాణం-3లో ప్రయోగ నైపుణ్యానికి సంబంధించి ప్రశ్నలుంటాయి. విద్యా ప్రమాణం-4లో ఇచ్చిన సమాచారాన్ని పట్టిక రూపంలో లేదా గ్రాఫ్‌ రూపంలో ప్రశ్నల ఆధారంగా విశ్లేషించాలి. విద్యాప్రమాణాలు 5,6లలో  భావనలకు బొమ్మల రూపంలో లేదా ఫ్లోచార్ట్‌ ప్రదర్శించాలి. ప్రతి బొమ్మపై అవగాహన కలిగి ఉండాలి. నిత్య జీవితం అను  ప్రయోక్త పర్యావరణానికి సంబంధించి అన్వయించుకునేలా ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. జీవశాస్త్రంలోని హరిత రేణువు, మైటో కాండ్రియా, నాడులు, శుక్రకణం, జీర్ణవ్యవస్థ భాగాలు, నాడీకణం, నెఫ్రాన్‌, ప్రత్యుత్పత్తికి సంబంధించి పటాలు, భాగాలు ప్రాక్టీసు చేయాలి. ప్రతీ పాఠాన్ని అర్థవంతంగా చదివి ముఖ్యాంశాలను అండర్‌లైన్‌  చేసుకోవాలి.

- దేవేందర్‌, బయాలజీ ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్‌ఎస్‌, గండిమాసానిపేట్‌


భౌతికశాస్త్రం: అర్థం చేసుకుంటేనే ప్రయోజనం

భౌతికశాస్త్రంలో ప్రతీ పాఠాన్ని క్షుణ్ణంగా చదివి అవగాహన పెంచుకుంటేనే ప్రయోజనం. భావనలు అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించాలి. పాఠ్యాంశం చివర ఉండే అభ్యాసాన్ని మెరుగుపరుచుకొని ప్రతీ ప్రశ్నకు సొంతంగా సమాధానాలు రాయాలి. ప్రశ్నాపత్రాన్ని ఓపిగ్గా చదివితే  చాలా వరకు నిత్యజీవనం, వినియోగంపై ప్రశ్నలు ఉంటాయి. అవకాశం ఉన్నచోట్ల పటాలను పెన్సిల్‌తో గీసి వివరించాలి. ఫిజికల్‌ సైన్స్‌ ఏఎస్‌-1(విషయఅవగాహన) విద్యా ప్రమాణంపై 16 మార్కుల వరకు ప్రశ్నలుంటాయి. మానవుని కన్ను - రంగుల ప్రపంచం, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, కార్బన్‌, దాని సమ్మేళనాలు వంటి పాఠాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. వీటిలో వచ్చే ప్రశ్నలను విద్యా ప్రమాణాల ఆధారంగా విభజించాలి. ప్రయోగశాల కృత్యం సంబంధించినవి అంటే వివరించడం పోలికలు వంటి ప్రశ్నలు అడగవచ్చు. కాంతి కిరణ చిత్రాలు గీయడం, ఒక చిన్న సమస్య, చిన్న కృత్యాలపై ప్రశ్నలు అడగడం, నిత్య జీవిత వినియోగం, ఉపయోగాలు కర్బన సమ్మేళనాల పేర్లు పెట్టడం, రసాయన సమీకరణాలు తుల్యం చేయడం ప్రశ్నలుంటాయి. విజ్ఞానశాస్త్రం, బొమ్మలకు సంబంధించి, పాఠ్యపుస్తకాల భావనలు, నిజజీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి... భావనల ఆధారంగా సమస్యలను సాధన చేయాలి. పాఠ్య పుస్తకంలోని విషయాలను అవగాహన చేసుకొని ప్రతి విషయాన్ని వివరిస్తూ ఉదాహరణలు  ఇవ్వగలిగితే మంచి మార్కులు మీ సొంతమే....

- రాజశేఖర్‌, భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల, ఎల్లారెడ్డి


గణితం: అధ్యాయాల వారీగా సాధన...

గణిత పరీక్ష మొదటి పేపర్‌ ఏడు అధ్యాయాలు, రెండో పేపర్‌లో ఏడు అధ్యాయాల (8-14) నుంచి ఉంటాయి. అధ్యాయాల వారీగా చేసేందుకు మొదటి అధ్యాయంలోని భావనల అవగాహన కోసం ఇచ్చిన వాక్యాలను, వివరణలను పూర్తి స్థాయిలో చదవాలి. శ్రేఢులు, నిరూపక జ్యామితి, సమితులు, శ్రేఢుల్లోని అంకశ్రేఢి మొదటి పదం, పదాంతరం పదాలను రాయడం సులభం. నిరూపక జ్యామితిలో  రెండు బిందువుల మధ్య విభజన సూత్రం, త్రిభుజ వైశాల్యానికి  సంబంధించిన సూత్రాలను నేర్చుకోవాలి. సమితులలో సమ్మేళబేధనము, బేధాలు, వెన్‌ చిత్రాలకు సంబంధించిన ప్రశ్నలు సాధన చేయాలి. అదే విధంగా బహుపదుల గ్రాఫ్‌ను గీయడం, ప్రాక్టీసు చేయాలి. పేపర్‌లో సంభావ్యత, సంఖ్యా శాస్త్రం, క్షేత్రసమితి, త్రికోణమితి, అయవర్తనాలకు సంబంధించి సాధన చేయాలి. సంఖ్యాశాస్త్రంలోని సగటును, మధ్యగతాన్ని, బహుళకాన్ని కనుగొనాలి. 

- సిద్దిరామాగౌడ్‌, గణిత ఉపాధ్యాయుడు, అన్నాసాగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల


సాంఘికశాస్త్రం: పటాలు, పాఠ్యాంశాలపై అవగాహన

సాంఘికశాస్త్రం పాఠ్యాంశాల్లోని భావనలు పూర్తిగా అవగాహన చేసుకోగలిగితే ప్రశ్నలు ఎలా అడిగినా సమాధానాలు రాయ డం సులువే. నాలుగు మార్కుల ప్రశ్నలకు ఎనిమిది నుంచి పది వాక్యాల్లో పాయింట్ల వారీగా సమాధానం రాయాలి. గతంలోని పరీక్షా పత్రాల్లో వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే ఉన్నది ఉన్నట్లు మళ్లీ రాకపోయినా వివిధ అంశాలను ఏవిధంగా అడుగుతున్నారో అర్థం చేసుకోవడానికి సులువు అవుతుంది.  ప్రతీ పాఠంలోని కీలక భావనలను గుర్తించి సాధ న చేస్తే ప్రశ్న ఎలా అడిగినా సమాధానం రాయడం సులభం.  సమాచార నైపుణ్యాలు, ప్రతీ పాఠంలోని పట్టికలు, గ్రాఫ్‌ అర్థం చేసుకొని విశ్లేషించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇచ్చిన సమాచారం ఏ విషయాన్ని తెలుపుతుంది. దాని నిర్వచనం దత్తాంశ వివరణ దానికి గల కారణాలు సూచనలతో ముగించాలి. అలా చేస్తే నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చిన అంశాన్ని చదివి వాఖ్యానించడం కింద ఒక పేరాగ్రాఫ్‌ ఇచ్చి అభిప్రాయాన్ని గాని వాఖ్యానించమని గానీ అడగడం జరుగుతుంది. ఇచ్చిన పేరాగ్రాఫ్‌ ఏదైనా సమస్యకు సంబంధించిన భావనకు ముడిపడి ఉంటుంది. ఆ భావనను గుర్తించి ఆ సమస్య, సలహాలు, సూచనలు ఇస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. సమకాలీన అంశాలు పాఠ్యాంశంలో భావనలకు అనుగుణంగా నాలుగు మార్కుల కోసం ఇవ్వబడతాయి. భావనలను చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలను జోడించి ప్రిపేర్‌ అవ్వాలి. తెలంగాణ, భారతదేశం ఔట్‌లైన్‌ మ్యాప్‌ ప్రాక్టీస్‌ చేయాలి. నాలుగు మార్కులకు ఒక వ్యాసరూప ప్రశ్న అడుగుతారు. 

- నాగేందర్‌రెడ్డి, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్‌ఎస్‌, గండిమాసానిపేట్‌


logo