బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 17, 2020 , 03:05:30

‘డబుల్‌' వేగం

‘డబుల్‌' వేగం

పేదవాడి ఆత్మగౌరవ ప్రతీకలైన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల వేగం పుంజుకుంది. జిల్లాలో పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు ప్రభుత్వం 7,057 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రభుత్వ స్థలంలోనే సకల సౌకర్యాలు, హంగులతో నిర్మాణాలు చేసి ఇస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో స్థలం దొరకడం ఆలస్యం కావడంతో నిర్మాణాల్లో జాప్యం ఏర్పడింది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు స్థలాలను గుర్తించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాగా.. మరికొన్ని చోట్ల పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థలం గుర్తించే అంశం నుంచి మొదలుకొని.. నిర్మాణాలకు ఏజెన్సీలను ఎంపిక చేసుకోవడం.. పకడ్బందీగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవడం.. అర్హులైన పేదలకు ఇండ్లను అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

  • జిల్లాకు 7,057 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు
  • 1374 ఇండ్ల నిర్మాణాలు పూర్తి
  • ఇప్పటికే 814 ఇండ్లు పంపిణీ
  • అర్బన్‌లో ప్రవేశానికి సిద్ధంగా 400 ఇండ్లు
  • పురోగతిలో 2,687.. ప్రారంభదశలో 2996 ఇండ్లు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: కిరాయి ఇండ్ల దుర్భర బతుకుల నుంచి పేదవారు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలో కొత్త జీవితాన్ని మొదలుపెడ్తున్నా రు. పూర్తి ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది ప్రభుత్వం. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఏర్పడిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్‌ ప్రతి పేదవాడికీ డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ జిల్లాలో విజయవంతంగా అ మలవుతున్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1374 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పంపిణీ చేశారు. అర్బన్‌లో మరో 400 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నా యి. మొత్తం జిల్లాకు 7,057 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రభుత్వ స్థలంలో నే సకల సౌకర్యాలు, హంగులతో నిర్మాణాలు చేసి ఇస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో స్థలం దొరకడం ఆలస్యం కావడంతో నిర్మాణాల్లో జాప్యం ఏర్పడింది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు స్థలాలను గుర్తించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాగా.. మరికొన్ని చోట్ల వేగంగా నిర్మాణాలు జరిగి చివరి దశకు చేరుకుంటున్నాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థలం గుర్తించే అంశం నుంచి మొదలుకొని.. నిర్మాణాలకు ఏజెన్సీలను ఎంపిక చేసుకోవడం.. పకడ్బందీగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవడం.. అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇండ్లను అందించే విషయం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సొంత జాగా ఉంటే వారు కట్టుకోవడానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దీని కోసం ప్రత్యేకంగా కేటాయింపులు కూడా చేశారు. మరోవైపు మొన్నటి వరకు మందకొడిగా జరిగిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పనుల్లో వేగం పెంచాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో.. ఎమ్మెల్యేలు వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిర్మాణాలు చేపట్టారు. కిచెన్‌, హాలు, రెండు బెడ్‌ రూమ్‌లు, బయట డ్రైనేజీలు, నల్లాలు, సీసీ రోడ్లు, కంపౌండ్‌ వాల్‌.. ఇలా అన్ని సదుపాయా లు కల్పించారు. విద్యుత్‌ సరఫరా, తాగునీటి సౌకర్యం కల్పించారు. 

ఆర్మూర్‌లో పునాదుల దశలో..

ఆర్మూర్‌ నియోజకవర్గానికి మొత్తం 799 ఇండ్లు మంజూరయ్యాయి. ఆర్మూర్‌ టౌన్‌, రూరల్‌లో మొత్తం 639 ఇండ్లు మంజూరయ్యాయి. ఇవి  పునాదుల వరకు పనులు పూర్తి చేశారు. మాక్లూర్‌ మండల కేంద్రంలో 20 ఇండ్లు, అడవి మామిడిపల్లిలో 20 ఇండ్లు, వడ్యాట్‌పల్లిలో 20 ఇండ్లు పునాదుల దశలో ఉన్నాయి. నందిపేట్‌ మండల కేంద్రానికి 50, వెల్మల్‌కు 50 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు కాగా.. ఇవి పునాదుల  దశలోనే ఉన్నాయి. 

బాన్సువాడ నియోజకవర్గంలో గృహ ప్రవేశాలు.. 

వర్ని మండలంలో ఇప్పటివరకు మొత్తం 125 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు పూర్తయ్యాయి. వీటిని పంపిణీ చేశారు. మరో 124 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. 95 ఇండ్ల నిర్మాణాలు  ప్రారంభిస్తున్నా రు. చందూర్‌ మండలంలో ఇప్పటివరకు 24 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యా యి. మరో 64 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మోస్రా మండలానికి మంజూరైన మొత్తం 30 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యా యి. రుద్రూర్‌ మండలానికి మొత్తం 304 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 185 ఇండ్లు పూర్తయ్యాయి. మిగతా 119 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కోటగిరి మండలంలో మొత్తం 874 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు మంజూరయ్యా యి. వాటిలో ఇప్పటివరకు 500 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా 374 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వచ్చే మే నెలాఖరుకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

రూరల్‌లో ఇలా.. 

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నిర్మాణ పనులు చురుకుగా సా గుతున్నాయి. డిచ్‌పల్లి మండలంలోని బీబీపూర్‌ తండా వద్ద 50 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మం జూరై నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. నడిపల్లి శివారులో మంజూరైన 50 ఇండ్ల నిర్మాణ పనులు బేస్‌మెంట్‌ దశలో నిలిచాయి. ఇందల్వాయి మండల కేంద్రానికి 50 ఇండ్లు మంజూరైనప్పటికీ ప్రభుత్వ స్థలం లో నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతివ్వగా పనులు మాత్రం ప్రా రంభం కాలేదు. ఇందల్వాయిలో పక్షం రోజుల కింద 50 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గన్నారం, సిరికొండ మండలానికి 50 ఇండ్లు మంజూరు కాగా.. స్థలం లేక పనులు ప్రారంభంకాలేదు. మోపాల్‌ మండలం న్యాల్‌కల్‌లో 50 ఇండ్లు మంజూరైనా అవి పునాది దశలోనే నిలిచిపోయాయి. ధర్పల్లి మండల కేంద్రం లో 50 ఇండ్ల పనులు కొనసాగుతున్నాయి. దుబ్బాక గ్రామంలో పనులు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయాయి. నిజామాబాద్‌రూరల్‌ మండలంలోని పాల్దాలో 50 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మల్కాపూర్‌ తండాకు 50 ఇండ్లు మంజూరైనా పనులు సాగడంలేదు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో 50 ఇండ్లు మంజూరైనా పనులు ప్రారంభంకాలేదు. 

బోధన్‌లో పుంజుకున్న వేగం.. 

బోధన్‌ పట్టణం, బోధన్‌ మండలానికి మొత్తం 990 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు మం జూరయ్యాయి. వాటిలో 449 ఇండ్ల పనులు జరుగుతున్నాయి. మిగతా 541 ఇండ్ల నిర్మా ణ పనులు ప్రారంభంకాలేదు. ఎడపల్లి మం డలంలో మొత్తం 220 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 140 ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మిగతావి అసలే ప్రారంభంకాలేదు. రెంజల్‌ మండలానికి మొత్తం 191 ఇండ్లు మంజూరుకాగా, వాటిలో 106 ఇం డ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నవీపేట్‌ మండలంలో మొత్తం 201 ఇండ్లు మంజూరుకాగా, వాటిలో నాళేశ్వర్‌ గ్రామంలోని 50 ఇండ్ల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయి. నవీపేట్‌లోని 50, పొతంగల్‌లో 51, అబ్బాపూర్‌ (ఎం)లోని 50 ఇండ్ల చొప్పున అంటే మండలంలో 151 ఇండ్ల నిర్మాణాలు ఇంతవరకు ప్రారంభంకాలేదు.

మంత్రి ఇలాకాలో ‘డబుల్‌' ధమాకా..

బాల్కొండ నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లుభవనాలు, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో 980 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు కాగా.. ఇందు లో మోర్తాడ్‌కు 220, వేల్పూర్‌కు 80, భీమ్‌గల్‌కు 80, బడాభీమ్‌గల్‌కు 80, మోతెకు 200, మెండోరాకు 100, కమ్మర్‌పల్లికి 80, బాల్కొండకు 100, పడగల్‌కు 60 చొప్పున మంజూరయ్యాయి. ఇప్పటికే మోర్తాడ్‌, బాల్కొండ, పడగల్‌ గ్రామాల్లో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. బాల్కొడ, పడగల్‌లో దాదాపు నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. మోర్తాడ్‌లో నిర్మాణం పనులు జోరందుకున్నాయి. బాల్కొండలో 100, పడగల్‌లో 60, మోర్తాడ్‌లో 80 డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మిగతా మండలాల్లో పను లు త్వరలో ప్రారంభించనున్నారు. 


logo