గురువారం 28 మే 2020
Nizamabad - Mar 15, 2020 , 12:54:12

పరిశుభ్రత పాటించకుంటే ఉపేక్షించం

పరిశుభ్రత పాటించకుంటే ఉపేక్షించం

బోధన్‌, నమస్తే తెలంగాణ: ఖాళీ స్థలాల్లో నిల్వనీరు, పిచ్చిమొక్కలు తొలగించకుండా నిర్లక్ష్యం వహించినా, రోడ్ల ఆక్రమణలకు పాల్పడినా, పరిశుభ్రత పాటించకపోయినా.. ఎవరినీ ఉపేక్షించేదిలేదని కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. పట్టణ ప్రగతి అమలులో ప్రజలంతా భాగస్వాములు కావాలని అన్నారు. బోధన్‌ పట్టణం శక్కర్‌నగర్‌లోని 23వ వార్డును, బోధన్‌లోని షర్బతీ కెనాల్‌ను, గాంధీ పార్కును, వీక్లీ బజార్‌ను, బీఫ్‌ మార్కెట్‌ను, మున్సిపాలిటీలో విలీనమైన శ్రీనివాస్‌నగర్‌తో పాటు పలు వార్డుల్లో శనివారం కలెక్టర్‌ పర్యటించారు. అక్కడ పారిశుద్ధ్యం పరిస్థితిని గమనించడంతో పాటు, సమస్యలను గుర్తించడానికి మున్సిపల్‌ కౌన్సిలర్లు, స్థానికులతో మాట్లాడారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి, ఆర్డీవో గోపీరాంలతో కలిసి తిరుగుతూ సూచనలు, సలహాలను మున్సిపల్‌ అధికారులకు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా పరిశుభ్రత పాటించకపోతే.. ఆయా శాఖల అధికారులకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్‌ కమిషనర్‌ శివానందంకు సూచించారు. 


ఆరుబయట మాంసం అమ్మితే చర్యలు 

బోధన్‌ పట్టణంలోని వీక్లీ బజార్‌లో శుభ్రత లేకపోవడంపై కలెక్టర్‌ నారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. పశువుల మాసాన్ని ఆదివారం సంతలో రోడ్లపైనే విక్రయిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదుకు స్పందించిన కలెక్టర్‌.. వారం గడువు ఇచ్చి.. ఆ తర్వాత రోడ్లపై పశువుల మాంసం అమ్మినవారిపై జరిమానాలు విధించాలని ఆదేశించారు. బీఫ్‌ మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచి, వ్యాపారులంతా అక్కడ బీఫ్‌ అమ్మేలా చూడాలన్నారు. మటన్‌ మార్కెట్‌ భవనం నెలరోజుల్లోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మార్కెట్‌ మడిగెల్లోనే కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


పట్టణ ప్రగతి కమిటీలు శాశ్వత కమిటీలు

పట్టణ ప్రగతి కోసం ఏర్పాటుచేసిన వార్డు కమిటీలు శాశ్వత కమిటీలని, పట్టణ ప్రగతి కార్యక్రమం నిరంతరం జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు.  బోధన్‌ పట్టణంలోని గాంధీ పార్కులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కమిటీల సభ్యులు పట్టణ ప్రగతిలో పాల్గొనేలా అవగాహన కార్యక్రమం చేపడతామని అన్నారు. పట్టణ ప్రగతి, అభివృద్ధిపై ఆసక్తి ఉన్నవారిని కూడా వార్డు కమిటీల్లో నియమిస్తామన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంపై మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.


అంగన్‌వాడీ కేంద్రం సందర్శన

బోధన్‌ పట్టణం శ్రీనివాస్‌నగర్‌లో కలెక్టర్‌ పర్యటిస్తూ స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలోకి వెళ్లి పిల్లలతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని రుచిచూశారు. బోధన్‌ మున్సిపల్‌ అధికారులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఎం.గుణప్రసాద్‌, మీర్‌ నజీర్‌ అలీ (డబ్బు), అబ్దుల్లా, అంకు దాము, తూము శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo