శనివారం 30 మే 2020
Nizamabad - Mar 10, 2020 , 00:51:06

పసుపు రైతుకు ఏదీ కేంద్రం మద్దతు

పసుపు రైతుకు ఏదీ కేంద్రం మద్దతు

కమ్మర్‌పల్లి/నమస్తే తెలంగాణ/నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లాలో పసుపునకు మద్దతు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు.చేతికొచ్చిన పసుపు పంటను నష్టాలకు అమ్ముకుంటున్నారు. పసుపునకు మద్దతు ధర ప్రకటిస్తామని లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. దీంతో ఈసారి మద్దతు ధర వస్తుందని గంపెడాశలతో పసుపు సాగు చేసిన రైతులు... మార్కెట్‌లో ధర లేక మద్దతు ధరో రామచంద్రా అంటున్నారు. పసుపునకు మద్దతు ధర ఇవ్వడమనేది కేంద్రం చేతిలో ఉంటుంది. ఎంపీగా బీజేపీ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపిస్తే ఇప్పుడు వారు మద్దతు ధర ఊసెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంట పెట్టుబడి ఖర్చులైనా రాని పరిస్థితిలో, తుట్టికి అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. ప్రపంచంలో పసుపు సాగులో తెలంగాణ ముందంజలో ఉంది. కానీ, పసుపు రైతుకు ఏటా ఆశించిన ధర రాక నష్టాల సాగునే చేస్తున్నాడు. ధర రావాలంటే పసుపునకు మద్దతు ధర కావాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. దశాబ్దాల డిమాండ్‌ ఈసారి నెరవేబోతున్నదని ఎన్నికల వేళ బీజేపీ నాయకులు ఇచ్చిన మాటలు నమ్మి ఆశలు పెంచుకున్నారు. కానీ, కేంద్రం మద్దతు ధర ప్రకటించకపోవడంతో దగా పడ్డామని గుర్తిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌ మార్కెట్‌కు పసుపు పోటెత్తుతోంది. కానీ, ధర మాత్రం క్వింటాలుకు రూ. 4 వేల నుంచి 5 వేలు మించడం లేదు.దీంతో రైతన్నల్లో ఆవేదన నెలకొంది.


తెలంగాణలో సాగు వివరాలు.. 

తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో పసుపు సాగు జరుగుతోంది.జిల్లాల వారీగా నిజామాబాద్‌ జిల్లాలో 12,778 హెక్టార్లలో 76,670 టన్నులు,  జగిత్యాలలో 14,760 హెక్టార్లలో 73,800 టన్నులు, మహబూబా బాద్‌లో 8,277 హెక్టార్లలో 50,372 టన్నులు, నిర్మల్‌లో 7,863 హెక్టార్లలో 39,365 టన్నులు, వరంగల్‌ రూరల్‌లో 6,503 హెక్టార్లలో 34,140 టన్నులు, జయశంకర్‌ భూపాలపల్లిలో 2,768 హెక్టార్లలో 13,840 టన్నులు, వికారాబాద్‌లో 1,326 హెక్టార్లలో 6,630 టన్నులు, సంగారెడ్డిలో 413 హెక్టార్లలో 2,065 టన్నులు, ఆదిలాబాద్‌లో 491 హెక్టార్లలో 2,455 టన్నులు, వరంగల్‌ అర్బన్‌లో 238 హెక్టార్లలో 1250 టన్నుల మేర పసుపు సాగుచేస్తున్నారు. 


ఖర్చు బారెడు..మిగిలేది మూరెడు 

మార్కెట్లో ధర రాక నష్టాలను ఎదుర్కొంటున్న పసుపు రైతుకు.. సాగు ఖర్చు మాత్రం ఏటా పెరుగుతోంది. సాగుకోసం పెట్టిన ఖర్చులు కూడా చేతికి రాని పరిస్థితి నెలకొంది.ఎకరాకు రూ.లక్షా 15 వేల వరకు ఖర్చు అవుతోంది. అధికారులు ఎకరాకు రూ.98,300 ఖర్చుగా పేర్కొంటున్నా.. వాస్తవానికి నానాటికి పెరుగుతున్న కూలీ రేట్లు, పెరిగిన రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. మిగిలిన పంటలతో పోలిస్తే పసుపు పంట తొమ్మిది నెలల కాలంలో పంట చేతికి వస్తుంది.తొమ్మిది నెలల పాటు పంట పై పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రాని పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో సుమారు 37వేల మంది రైతులు పసుపు పంటను పండిస్తున్నారు. పసుపు పంట చేతికి వచ్చే సీజన్‌ ఫిబ్రవరి నుంచి మొదలుకాగా.. ఇప్పటి వరకు నిత్యం 30వేల బస్తాలు తగ్గకుండా నిజామాబాద్‌ మార్కెట్‌కు వస్తున్నది.ఈ సందర్భంగా రైతులకు మద్దతు గుంటూరు ప్రభావతి రకాలకే మంచి ధరలు వస్తున్నాయి. అందులో కూడా మండ రకానికి మద్దతు ధర వస్తుంది. రైతుల మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్పైస్‌ బోర్డు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇక్కడి రైతులు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు.


logo