శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Mar 10, 2020 , 00:48:49

అకాల వర్షంతో పంటలకు నష్టం

 అకాల వర్షంతో పంటలకు నష్టం

నిజామాబాద్‌ అర్బన్‌ : ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ నష్ట శాతం ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఆదివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో చేతికొచ్చిన పంట నేలరాలింది. బోధన్‌ ప్రాంతంలో పంటనష్టం అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం పరిశీలన చేశారు. 33 శాతానికి పై బడి నష్టపోయిన పంటను పరిగణలోకి తీసుకొని ప్రాథమికంగా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. బోధన్‌ ఏరియాలో కుప్పలుగా పోసిన శనగ తడిసిముద్దయ్యింది. బోధన్‌ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో  మొక్కజొన్న 706 ఎకరాల్లో దెబ్బతినగా..  705 మంది రైతులు నష్టపోయారు.  పొద్దుతిరుగుడు 711 ఎకరాల్లో నష్టపోగా.. 520 మంది రైతులకు ఈ నష్టం వాటిల్లింది. 78 మంది రైతులకు చెందిన  అరటి తోట 68 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.  పుచ్చకాయ సాగు  9 ఎకరాల్లో నష్టపోయింది.  ఎడపల్లి మండలంలోని ఏడు గ్రామాల్లో  సుమారు 106 ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా 211 మంది రైతుల నష్టపోయినట్లు అధికారులు తెలిపారు.  కాగా చాలా మండలాల్లో పంట నష్టానికి సంబంధించి అంచనా వేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ తెలిపారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు ఇలాంటి మార్పులు సాధారణంగా సంభవిస్తాయని, 2015 - 16 సంవత్సరంలో ఇలాగే నష్టం జరిగిందని, మళ్లీ 2020లో పునారవృతమైనట్లు ఆయన వివరించారు. ప్రాథమిక అంచనా నివేదికను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. 

పంటలను పరిశీలించిన అధికారులు 

బోధన్‌ రూరల్‌ : ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. బోధన్‌ మండలంలోని కుమ్మన్‌పల్లి, సాలంపాడ్‌, పెంటాకుర్దు, సాలూర క్యాంప్‌, సాలూర , హున్సా, మందర్న గ్రామాల్లో అ కాల వర్షానికి దెబ్బతిన్న పంటలను సోమవారం బోధన్‌ ఇన్‌చార్జి ఏడీఏ సంతోష్‌ నాయక్‌తో పాటు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ మానిక్‌ వెంకట్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. బోధన్‌ మండలంలో మొక్కజొన్న 706 ఎకరాలు, సన్‌ఫ్లవర్‌ 711 ఎకరాలు, అరటి 68 , పుచ్చకాయ 4 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.  వారి వెంట రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ మానిక్‌వెంకట్‌రెడ్డి, సర్పంచులు కొర్వ గంగాధర్‌, హున్సా సొసైటీ చైర్మన్‌ మందర్న రవి, ఏఈవో సత్తార్‌, సాయిచరణ్‌, అనుజా తదితరులు ఉన్నారు.


logo