బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 10, 2020 , 00:45:25

ఎమ్మెల్సీ ఓటర్లు @ 878

 ఎమ్మెల్సీ ఓటర్లు @ 878

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజవకర్గ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈనెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నది. దీంతో కీలకమైన ఓటర్ల జాబితాపై కసరత్తు పూర్తిచేసింది. ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థలకు చెందిన ప్రతినిధులైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్‌అఫీషియో సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ ఎన్నికలో ఓటర్లుగా ఉంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులతో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ చింతకుంట నారాయణరెడ్డి ఇప్పటికే సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాను రూపొందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం రాత్రి వరకు అధికారులు దీనిపై కసరత్తు చేసి ఓ స్పష్టతకు వచ్చారు. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలన్నింటిలో ఉన్న ప్రజాప్రతినిధులంతా కలిపి మొత్తం 878 మంది ఉన్నారని లెక్కతేలినట్లు తెలిసింది. వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసుందుకు అర్హులు. ఈ ఓటర్ల జాబితాను పోలింగ్‌ స్టేషన్ల వారీగా, జడ్పీ కార్యాలయా ల్లో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మంగళవారం(నేడు) ప్రదర్శించనున్నారు. రెవెన్యూ డివిజన్‌కు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటిల్లో ఆరు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.  ఈనెల 12న ఈ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంటుంది. 20న నామినేషన్ల పరిశీలన, 23న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్‌ 7న పోలింగ్‌ ఉంటుంది. ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 9న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ లోపు కీలకమైన ఓటర్ల జాబితాపై కసరత్తు పూర్తి చేసిన అధికారులు.. ఇక నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

 ఎవరికి వారే ప్రయత్నాలు.. 

 డాక్టర్‌ భూపతిరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. దాదాపు రెండేండ్ల కాలపరిమితి మాత్రమే ఈ పదవికి ఉన్నది. మొత్తం ఆరేండ్ల కాల పరిమితి గల ఈ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవి టీఆర్‌ఎస్‌ అధిష్టానం డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు ఆయనను ఏకగ్రీవంగా ఆనాడు ఎన్నుకునేలా కృషిచేసింది. ఈసారి కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీనికోసం నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు పోటీపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసి తమకు అవకాశం కల్పించాలని ఎవరికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌ పదవి కామారెడ్డి జిల్లాకు ఇచ్చినందున.. ఎమ్మెల్సీ పదవిని నిజామాబాద్‌ జిల్లా కు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నామినేషన్లకు మరో రెండు రోజుల సమయం ఉడడంతో ఆశావహులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ద్వారా కూడా తమ అభ్యర్థిత్వాన్ని అధిష్టానానికి నివేదించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఈసారి అవకాశం కల్పించాలని ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అన్ని ఎన్నికలు ముగియడంతో మగిలిన ఈ ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు నేతలంతా బారులు తీరారు. ఎవరి వైపు టీఆర్‌ఎస్‌ అధిష్టానం మొగ్గు చూపుతుందో త్వరలో తేలనుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచి వారం రోజుల సమయం ఉండడంతో, ఆ లోపుగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. logo