శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Mar 09, 2020 , 02:16:35

సంక్షేమ పద్దు

సంక్షేమ పద్దు

సంక్షేమ పద్దు


విద్య, వైద్యం, రైతాంగం, సాగునీటి రంగం, పట్టణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిరంగాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. సబ్బండ వర్ణ్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌ పద్దు రూపకల్పన చేసింది. ఆదివారం శాసనసభలో మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. రైతులు, కార్మికులు, కులవృత్తిదారులు, విద్యార్థులే కాకుండా పలు పథకాల లబ్ధిదారులు, ప్రజలు బడ్జెట్‌ బాగుందని అభినందిస్తున్నారు. ఆర్థిక మాంద్యం ఇబ్బందులున్నా.. సంక్షేమానికి ఎలాంటి ఢోకా లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయించడంతో అన్నివర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పంట రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలతో జిల్లాలో ఎంతోమంది లబ్ధి పొందనున్నారు.


నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: సబ్బండవర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ కేటాయింపులపై అన్నివర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రధానంగా వ్యవసాయానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసింది ప్రభుత్వం. రైతును రాజును చేసే వరకు విశ్రమించనని సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలు.. బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రతిబింబించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఈ బడ్జెట్‌ ద్వారా కార్యరూపం దాల్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఆ మేరకు వాటికి కేటాయింపులు జరిపారు.

బీసీలకు, ఎంబీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు జరుపుతూనే, అన్నిరంగాలకు సమప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌ కేటాయింపుల్లో సమన్యాయం చేశారు. ఆర్థిక మాంద్యం ఉన్నా.. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఆటంకాలు లేకుండా, వాటి అమలును అదే దూకుడుతో కొనసాగించేలా బడ్జెట్‌ రూప కల్పన జరిగింది. 

రైతుబంధు పథకానికి నిధులు కేటాయించారు. వానాకాలం(ఖరీఫ్‌), యాసంగి(రబీ) సీజన్‌లకు ఎకరాకు రూ. 10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రూపొందించిన ఈ పథకానికి భారీగా నిధులు కేటాయించడంతో రైతన్న హర్షం వ్యక్తం చేసున్నాడు. జిల్లాలో మొత్తం 2.50 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందనుంది. దీంతో పాటు రైతుబీమా పథకాన్ని కూడా కొనసాగిస్తూ, బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించింది. 

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా లక్ష రూపాయల పంట రుణమాఫీపై ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో రైతులు రుణ విముక్తులు కానున్నారు. రూ. 25వేల వరకు అప్పులున్న రైతులకు ఈ నెలలోనే రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. రూ.లక్ష లోపు అప్పులున్న వారికి నాలుగు దఫాలుగా రుణమాఫీ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, జిల్లాలో మొత్తం 2 లక్షల మందికి రుణమాఫీ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఆధ్వర్యంలో ఈ రుణమాఫీని అమలు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా ఎంత మంది రైతులు.. ఎన్ని బ్యాంకుల ద్వారా రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని ఉన్నారో వివరాలను లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ జయ సంతోష్‌ సేకరిస్తున్నారు. ఆమేరకు వీరికి రుణమాఫీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 32 బ్యాంకులకు సంబంధించి 272 బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 2 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. రైతు సమన్వయ సమితిలు ఇకపై రైతు వేదికలుగా ఏర్పాటు చేయనున్నారు. రైతు వేదికల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. 


ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌..

పేదవాడి ఆరోగ్యానికి భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సర్కారు దవాఖానలను బలోపేతం చేసి పేదలకు  వైద్యం మరింత చేరువ చేసిన సర్కారు.. ప్రజారోగ్యంలో మరో కీలక ముందడుగు వేసింది. ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. షుగర్‌, బీపీతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తిస్తారు. దీనికోసం ఇంటి కుటుంబ సభ్యుల మొత్తం ఆరోగ్య వివరాలు సేకరిస్తారు. ప్రతి  ఒక్కరి పేరు మీద వారి హెల్త్‌ ప్రొఫైల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది. దీని ద్వారా జిల్లాలో ఎంత మంది ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి మందులు ఎంత కావాలి.? ఏఏ మందులు కొనుగోలు చేయాలి? తదితర సమాచారాన్ని ముందే సేకరించి అందరికీ వైద్యాన్ని మరింత చేరువ చేయనుంది. ప్రైవేటు దవాఖానల్లో ఇక వేలకు వేలు డబ్బులు ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఒక్క క్లిక్‌తో మన డాటా మొత్తం సర్కారు చేతిలో ఉంటుంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సర్కారు తన దగ్గర సేకరించి పెట్టుకుంటుంది. ఆ మేరకు వారు ఏ సర్కారు దవాఖానకు పోయినా.. వారికి తగిన చికిత్సలు అందుతాయి. 


జీపీల వర్కర్స్‌కు బీమా సౌకర్యం

నిజామాబాద్‌ సిటీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో గ్రామపంచాయతీల్లో పనిచేసే మల్టీపర్పస్‌ వర్కర్స్‌కు రూ.2లక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో నిజామాబాద్‌ జిల్లాలో 530 గ్రామపంచాయతీల్లో సుమారు 2000 మంది మల్టీపర్పస్‌ వర్కర్స్‌కు బీమా లబ్ధి చేకూరనుంది. కార్మికులకు పెంచిన వేతనాలకు సంబంధించి బడ్జెట్‌లో వివరాలు వెల్లడించడం మంచి నిర్ణయం.


logo