శనివారం 06 జూన్ 2020
Nizamabad - Mar 09, 2020 , 02:13:37

సెర్చ్‌ కమిటీకి సన్నాహాలు..!

సెర్చ్‌ కమిటీకి సన్నాహాలు..!

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌(వీసీ) ఎంపికకు చర్యలు వేగంగా చేపడుతున్నారు. వీసీని ఎంపిక చేసే సెర్చ్‌ కమిటీ సభ్యుల సమావేశం ఈనెల 15వ తేదీలోపు జరగనున్నట్లు సమాచారం. అందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున అభ్యర్థిని ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించాల్సింది ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే విశ్వవిద్యాలయానికి ఆదేశాలు అందాయి. దీంతో ఆ పనుల్లో వర్సిటీ అధికారులు తలమునకలయ్యారు. ఈనెల 10వ తేదీలోపే వర్సిటీ నామినీ పేరును సూచించాల్సిందిగా ఆ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులు వర్సిటీ నామినీ పేరును పరిశీలిస్తున్నారు. గతంలో వర్సిటీ తరఫున నామినీగా ప్రొఫెసర్‌ వి.శివలింగ ప్రసాద్‌ పేరును పంపించారు. ఈయన ఇప్పటి వరకు న్యాక్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈయన పేరునే పంపుతారా, లేక మరొకరిని ఎంపిక చేస్తారా అన్న సందిగ్ధం నెలకొన్నది. తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులు మాత్రం శివలింగ ప్రసాద్‌ పేరునే వర్సిటీ నామినీగా ప్రతిపాదించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఇటీవలే తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల్లో సైతం ప్రస్తుత పేరునే ప్రతిపాదించవచ్చు లేదా మరొకరి పేరు కూడా సూచించవచ్చని పేర్కొన్నట్లు సమాచారం. వర్సిటీ అధికారులు మాత్రం మరో వ్యక్తి పేరు వెతికే కన్నా, ఇప్పటికే ప్రతిపాదించిన శివలింగ ప్రసాద్‌ పేరునే తిరిగి ప్రతిపాదించే అవకాశం ఉన్నది. అదే జరిగితే ఈనెల 15వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన సెర్చ్‌ కమిటీ సభ్యుల సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

కొత్త ఏడాదిలోపే కొత్త వీసీ..!

తెలంగాణ విశ్వవిద్యాలయానికి రానున్న కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభంలోపే నూతన వీసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 15లోపు సెర్చ్‌ కమిటీ సభ్యుల సమావేశం ఉండనుంది. అది పూర్తయితే ఈనెల 20వ తేదీలోపు సెర్చ్‌ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన తుది ముగ్గురి సభ్యుల జాబితాను గవర్నర్‌కు పంపించనున్నారు. మరోవైపు వీసీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిసింది. తెలంగాణ విశ్వవిద్యాలయానికి వచ్చే వీసీ కోసం గతంలోనే 114 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. వారిని సెర్చ్‌ కమిటీ సభ్యుల బృందం పరిశీలించి, చివరకు ముగ్గురి సభ్యులతో కూడిన జాబితాను గవర్నర్‌కు పింపిస్తారు. వారిలో నుంచి ఒకరి పేరుని గవర్నర్‌ ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. ఈ తంతు అంతా రానున్న ఉగాది పర్వదినం లోపే పూర్తి కానున్నట్లు సమాచారం. తెలంగాణ విశ్వవిద్యాలయ వీసీ పదవి మరి ఎవరిని వరించనుందో వేచి చూడాల్సిందే. 


logo