గురువారం 28 మే 2020
Nizamabad - Mar 09, 2020 , 02:09:59

జిల్లాలో అకాల వర్షం

జిల్లాలో అకాల వర్షం

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురి సింది. అకాల వర్షానికి పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లో పది నిమిషాల పాటు భారీగా వర్షం కురువగా.. జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. అకాల వర్షం కురవడంతో యాసంగిలో సాగుచేస్తున్న పంటలకు దెబ్బ తింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా శనగ పంట సాగు చేసిన రైతులకు ఈ వర్షం దెబ్బతీసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి పంటకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటకు నష్టం వాటిల్లనున్నట్లు వారు తెలిపారు. 

తడిసిన శనగ కుప్పలు ...

బోధన్‌ రూరల్‌ : బోధన్‌ మండలంలోని సాలూర, కల్దుర్కి, పెగడాపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. దీంతో శనగ కుప్పలు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన శనగ పంట అకాల వర్షంతో తడిసి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాలూరలో కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలు పోసిన శనగ పంట తడిసిపోయింది. అకాల వర్షంతో తడిసిన శనగ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

కూలిన ఇంటి గోడలు, కూన పెంకులు

కోటగిరి : మండలంలోని సోంపూర్‌, రాంగంగానగర్‌, టాక్లీ గ్రామాల్లో అకాల వర్షంతో తీవ్ర నష్టం జరిగిందని స్థానికులు వాపోయారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. సోంపూర్‌ గ్రామంలో నాలుగు కరెంట్‌ స్తంభాలు విరిగాయని సర్పంచ్‌ తెలిపారు. చెట్లు నేలకూలాయి. కూన పెంకుల ఇండ్ల దెబ్బ తిన్నాయి. సోంపూర్‌ గ్రామానికి చెందిన లాలయ్య మరుగుదొడ్డిపై చెట్టు పడడంతో గోడ కూలిపోయింది. రేకుల షెడ్డు దెబ్బతిన్నది. రేకులు ఎగిరిపడ్డాయి. అకాల వర్షం కురవడంతో కోతకు వచ్చిన పొద్దుతిరగుడు పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.

ఎడపల్లిలో గాలివాన బీభత్సం

ఎడపల్లి : ఎడపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకస్మికంగా మబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగాయి. రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరి పోయాయి. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

ఇందూరు కూల్‌ కూల్‌..

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ నగరంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని చిరుజల్లులు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడిన జనం.. సాయంత్రం చిరుజల్లులు కురవడంతో వణికారు. వాహనదారులు అకాల వర్షానికి తడిసి ముద్దయ్యారు. తిరుమల టాకీస్‌ రోడ్డులో కూరగాయల వ్యాపారులు తాడిపత్రిని కప్పుకొని వర్షం నుంచి ఉపశమనం పొందారు. వర్షానికి తోడు ఈదురుగాలులు తోడు కావడంతో కరెంట్‌ సరఫరా కాసేపు నిలిపివేశారు. 


logo