శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Mar 08, 2020 , 02:13:42

ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు షురూ..

 ఎమ్మెల్సీ ఎన్నికకు  ఏర్పాట్లు షురూ..

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ ఎన్నిక కోసం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 12న నోటిఫికేషన్‌ వెలువరించనున్నారు. ఆ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆలోగా ఓటరు జాబితాపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల నియోజకవర్గం కావడంతో ఈ రెండు జిల్లాకు చెందిన ఎంపీటీసీలు , జడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు, నామినేటెడ్‌ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు ... వీరంతా ఓటర్ల జాబితాలో ఉంటారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వారీగా అధికారులు ఓటరు జాబితాలో ఎంతమంది వస్తున్నారనే గణాంకాలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఆదివారం(నేడు) అధికారికంగా ఓటరు జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియకు సిద్ధమవుతారు. పోలింగ్‌ స్టేషన్లు సైతం రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ఆరు పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ , ఆర్మూర్‌, బోధన్‌ రెవెన్యూ డివిజన్లు ఉండగా.. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటిపై నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి శనివారం సమావేశమై చర్చించారు. ఉమ్మడి జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు.


 ఎన్నికల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు: కలెక్టర్‌ 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూలు వచ్చినందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పక పాటించాలని, అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టర్‌ తన చాంబరులో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. శనివారం రాత్రి కల్లా ఓటర్ల జాబితా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ జాబితాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు, నామినేటెడ్‌ సభ్యులు, కోఆప్షన్‌ సభ్యులు తదితరులు అందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. 


పోలింగ్‌ స్టేషన్ల జాబితా సిద్ధం చేసి ఏర్పాట్లు పరిశీలించాలన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికకూ ప్రవర్తన నియమావళి ఉంటుందని, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పాటించాలని కోరారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి తప్పనిసరిగా అనుమతి పొందాలని, అన్ని ఎన్నికల మాదిరిగానే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ ఎన్నిక కూడా ప్రశాంతంగా పూర్తి చేయడానికి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో రెండు జిల్లాల రాజకీయ పార్టీల ప్రతినిధులు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, యాదిరెడ్డి, జడ్పీ సీఈవోలు గోవింద్‌, చందర్‌ నాయక్‌, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. 


14 మంది నోడల్‌ అధికారుల నియామకం

నిజామాబాద్‌ సిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 14 మంది నోడల్‌ అధికారులను నియమించినట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నోడల్‌ అధికారులుగా అడిషనల్‌ కలెక్టర్‌  చంద్రశేఖర్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వెంకటరమణ, డిప్యూటీ సీఈవో సంజీవ్‌, మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజారాం, డీసీవో సింహాచలం, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ జిల్లా మేనేజర్‌ అభిషేక్‌, సీపీ కార్తికేయ, ఏపీఆర్వో రామ్మోహన్‌రావు, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ డేవిడ్‌ రవికాంత్‌, ఎన్‌ఐసీ ఏడీఐవో రాజ్‌గోపాల్‌, ఈ-డిస్ట్రిక్‌ మేనేజర్‌ కార్తీక్‌ను నియమించారు. వీరు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విధులను నిర్వర్తిస్తారు.


logo