శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Mar 08, 2020 , 01:56:24

రైతుబిడ్డకు రాష్ట్రస్థాయి పదవి

 రైతుబిడ్డకు  రాష్ట్రస్థాయి పదవి

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ : పంటల సాగులో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన అంకాపూర్‌ గ్రామానికి చెందిన రైతుబిడ్డ మార గంగారెడ్డిని రాష్ట్రస్థాయి పద వి వరించింది. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని అంకాపూర్‌ గ్రామానికి చెందిన మార గంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, మహ్మద్‌ షకీల్‌, బిగాల గణేశ్‌ గుప్తా అభిప్రాయాలతో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా మార గంగారెడ్డి అభ్యర్థిత్వానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో శనివారం ఆయన నామినేషన్ల దాఖలు ప్రక్రియ లాంఛనంగా ముగిసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒకే నామినేషన్‌ దాఖలయ్యేలా చూశారు. శనివారం హైదరాబాద్‌లో పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో పలువురు డైరెక్టర్ల సమక్షంలో మార గంగారెడ్డి  మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. కేవలం ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో మార గంగారెడ్డి మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ పదవిని చేపట్టాలని అంకాపూర్‌ చెందిన రైతు నాయకుడు మార గంగారెడ్డి ప్రయత్నించారు. 


రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్‌రెడ్డిని డీసీసీబీ చైర్మన్‌ పదవి వరించింది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేసిన మార గంగారెడ్డి.. డీసీసీబీ చైర్మన్‌ పదవిని అశించి భంగపడ్డారు. నిరాశకు గురికాకుండా వెంటనే  మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్ది, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతుతో పాటు జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేల, ప్రధాన నాయకుల మద్దతును కోరుతూ తన ప్రయత్నాలను హైదరాబాద్‌ కేంద్రంగా చేశారు. అంకాపూర్‌ గ్రామంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో పాటు, సీఎం కేసీఆర్‌తో మార గంగారెడ్డికి ఉన్న వ్యక్తిగత పరిచయం ఈ విషయంతో బాగా కలిసవిచ్చిందనే చెప్పాలి. 2001 నుంచే టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేసి, పార్టీ ఉద్యమాల్లో పాల్గొని, జిల్లాలో పార్టీ తరపున రైతు నాయకుడిగా సేవలందించి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా మర గంగారెడ్డి పార్టీ పటిష్టత కోసం పనిచేశారు. 2013, 2020 రెండు పర్యాయాల్లో వరుసగా అంకాపూర్‌ సొసైటీ చైర్మన్‌గా మార గంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు మార్లు డీసీసీబీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇటీవల డీసీసీబీ చైర్మన్‌ పదవిని మార ఆశించగా.. దానిని అందుకోలేకపోయారు. కానీ, సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ఏకంగా రాష్ట్ర స్థాయిలో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా అవకాశం లభించింది. పదవికి ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. ఈనెల 11న లాంఛనంగా ప్రకటించనున్నారు. అన్నీ అనుకూలిస్తే అదేరోజు ఆయన పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు...

ఆర్మూర్‌ నియోజకవర్గానికి చెందిన అంకాపూర్‌ వాసి మార గంగారెడ్డిని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా నియమించడంపై శనివారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో పార్టీ పెద్దలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మార గంగారెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యవసాయ రంగంలో పెరెన్నిక కలిగిన ఆర్మూర్‌ ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలో పదవికి కేటాయించడంపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.       


logo