బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Mar 07, 2020 , 01:46:23

బడాపహాడ్‌లో ఉర్సు ప్రారంభం

 బడాపహాడ్‌లో ఉర్సు ప్రారంభం

వర్ని: ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బడాపహాడ్‌లో హజరత్‌ సయ్యద్‌ షాదుల్లా హుస్సేన్‌ బాబా పుట్టిన రోజు సందర్భంగా ఉర్సు  శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలిరోజు కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి వేలాది భక్తులు పాల్గొననున్నారు. ఉత్సవాలకు డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముజావర్లు నజీర్‌, గఫార్‌ల ఇంటి వద్ద గంధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని ప్రధాన కూడలిలోని చావిడి వద్దకు తీసుకువచ్చారు. చావిడి వద్ద ముఖ్య అతిథులు డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి సమక్షంలో కవ్వాలి నిర్వహించి, గంధాలకు పూజలు నిర్వహించారు. అనంతరం గంధాల ఊరేగింపు మేలతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ప్రారంభించారు. ఊరేగింపు మార్గమధ్యలో డప్పు చప్పులకు భక్తులు నృత్యాలు చేశారు. ఊరేగింపులో ఫకీరులు తల, కాల్లు, నాలుకపై ఇనుప చువ్వలను పొడుకుని విన్యాసాలు చేశారు. వారి విన్యాసాలు అందరినీ అలరించాయి. ఒంటె పాదాలు, గుర్రం పాదాలు కడిగి కింద నుంచి వెళితే దోషాలు తొలగి, సౌభాగ్యాలు కలుగుతాయని అనే నమ్మకంతో భక్తులు అలా వెళ్లారు. జలాల్‌పూర్‌ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడాపహాడ్‌కు ఒంటెపై గంధాలను తీసుకువెళ్లి షాదుల్లా బాబా దర్గాకు సమర్పించారు. శనివారం దర్గా వద్ద ప్రత్యేక పూజలు, కవ్వాలి, జాతర జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో జట్పీటీసీ హరిదాసు, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, సర్పంచ్‌ అనిత, సొసైటీ చైర్మన్‌ కృష్ణా రెడ్డి, నాయకులు, మేక వీర్రాజు, ఇలియాజ్‌, కరీం, గఫార్‌, తదితరులు పాల్గొన్నారు.


ఉర్సులో కరువైన కనీస సౌకర్యాలు...

ఉర్సు సందర్భంగా వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్‌ బోర్డు అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి ఉర్సుకు వచ్చిన భక్తులు ఉండడానికి తాత్కాలిక షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, భోజన వసతి వంటి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఉర్సుకు వక్ఫ్‌ బోర్డు నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరైనా.. వసతులు కల్పించడంలో ఆశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన నిధులు దేనికి ఖర్చు చేసారో తెలియదు. తాత్కాలిక స్నానపు గదులు, సేదతీరడానికి వసతి, తాగునీటి సౌకర్యం సరిగా కల్పించకపోవడంతో భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు వాటరు బాటిళ్లను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. స్నానం చేయడానికి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు, పురుషులు బహిరంగ ప్రదేశాల్లోనే స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.


logo