మంగళవారం 26 మే 2020
Nizamabad - Mar 06, 2020 , 02:05:52

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మోగిన నగారా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు  మోగిన నగారా

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సహకార ఎన్నికలు ముగియడంతో ఇక మిగిలి ఉన్న ఒకేఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కూడా ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ప్రభుత్వం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక్కసారిగా మళ్లీ రాజకీయం వేడెక్కింది. మొన్నటి వరకు డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులు ఆశించి భంగపడ్డ వారితో పాటు ఇంకొంత మంది టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 


12న నోటిఫికేషన్‌ విడుదల..

ఈ నెల 12న ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంటుంది. 20న నామినేషన్ల పరిశీలన, 23న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్‌ 7వ తేదీన పోలింగ్‌ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 9న ఓట్ల లెక్కింపు ఉంటుంది. డాక్టర్‌ భూపతిరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. దాదాపు రెండు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఈ పదవికి ఉన్నది. మొత్తం ఆరు సంవత్సరాల కాల పరిమితి ఉన్న ఈ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవి టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు ఆయనను ఏకగ్రీవంగా ఆనాడు ఎన్నుకున్నారు. అయితే పార్టీకి నష్టం కలిగించే చర్యలకు దిగిన భూపతిరెడ్డి రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కయ్యానికి కాలుదువ్వి అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యారు. 


గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరభావం పాలయ్యారు. అప్పటికే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి భూపతిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు వేయాలని అధిష్ఠానానికి సూచించారు. ఆ మేరకు మండలి చైర్మన్‌ సైతం అనర్హత వేటు వేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ భూపతిరెడ్డి హైకోర్టు మెట్లు ఎక్కారు. అక్కడ ఆయనకు చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. అక్కడా భూపతిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అనర్హత వేటు సబబేనని తీర్పు రావడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. దీంతో నాటి నుంచి ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందని ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు ఎదురు చూస్తున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ఎన్నిక కావడంతో రెండు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొంటారు. అన్ని స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే ఉండడంతో అధిష్ఠానం సూచన మేరకు ఎవరి పేరైతే సీల్డ్‌ కవర్లో సూచిస్తారో వారికే అందరి మద్దతు లభించనుంది. దీంతో ఇది కూడా ఏకగ్రీవ జాబితాలో పడనుంది. జడ్పీచైర్మన్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల మాదిరిగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక సైతం ఏకగ్రీవంగానే పూర్తయ్యే అవకాశాలున్నాయి. అధిష్ఠానం ఎవరికి మొగ్గు చూపుతుందనే అంశం ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉత్కంఠకు తెర లేపింది. logo